శ్రీలంకతో జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ కీలక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. గాలే వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత్ 165 పరుగుల భారీ తేడాతో విజయం సాధించినప్పటికీ.. చైనామెన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పేలవ ప్రదర్శన ఇప్పుడు బీసీసీఐ సెలెక్టర్ల దృష్టికి వచ్చింది. దీంతో కొలంబోలో జరిగే రెండో టెస్టు మ్యాచ్‌కు అతడిని ప్లేయింగ్ ఎలెవన్ నుండి తప్పించి, అతని స్థానంలో మధ్యప్రదేశ్ ఆఫ్ స్పిన్నర్ శరన్ష్ జైన్‌ను జట్టులోకి తీసుకుని అరంగేట్రం చేయించే యోచనలో మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : మానవ్ సుతార్ సక్సెస్ వెనుక ఉన్న ఆ సీక్రెట్ స్టార్ అతనే..!
మొదటి టెస్టులో కుల్దీప్ యాదవ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. మ్యాచ్ మొత్తంలో 25 ఓవర్లు బౌలింగ్ చేసిన ఆయన, ఏకంగా 103 పరుగులు సమర్పించుకుని కేవలం ఒకే ఒక్క వికెట్ సాధించాడు. అదే సమయంలో జట్టులోని మిగిలిన స్పిన్నర్లు మానవ్ సుతార్ (10 వికెట్లు), రవీంద్ర జడేజా (4 వికెట్లు) అద్భుతంగా రాణించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. జట్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఉండటం వల్ల వైవిధ్యం లోపించిందని భావిస్తున్న యాజమాన్యం, స్పిన్ అటాక్‌లో బ్యాలెన్స్ కోసం కుల్దీప్ స్థానంలో రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్‌ను ఆడించాలని భావిస్తోంది.
Also Read : వైరల్ గా మారిన ముంబై ట్వీట్.. హార్దిక్ కష్టమేనా..?
గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో భారత జట్టులోకి వచ్చిన 33 ఏళ్ల శరన్ష్ జైన్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మంచి రికార్డు ఉంది. ఆయన ఇప్పటివరకు 54 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 188 వికెట్లు తీయడమే కాకుండా, బ్యాటింగ్‌లోనూ 2,223 పరుగులు చేసి అల్ రౌండ్‌గా నిరూపించుకున్నాడు. ఇటీవలి రంజీ ట్రోఫీలోనూ మధ్యప్రదేశ్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన శరన్ష్.. భారత్-ఎ తరఫున శ్రీలంక-ఎ తో జరిగిన మ్యాచ్‌లోనూ 6 వికెట్లు తీసి, నాటౌట్‌గా 70 పరుగులు చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. కొలంబో టెస్టులో లంకను క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా భారత్ ఈ కీలక మార్పుకు సిద్ధమవుతోంది.

