ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పారదర్శకత లోపిస్తే నిరుద్యోగుల జీవితాలు ఎలా తల్లకిందులవుతాయనేదానికి జగన్ హయాంలో గ్రూప్-1 నియామకాల వివాదమే పెద్ద ఉదాహరణ. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నియామక ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూల్యాంకన విధానంలో మార్పులు చేయడం, జవాబు పత్రాల గోప్యతలో లోపాలు వంటి అంశాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా సాగిన ఈ ప్రక్రియ వల్ల అర్హులైన అభ్యర్థులకు దక్కాల్సిన అవకాశాలు పక్కదారి పట్టాయనే వాదన బలంగా ఉంది.
Also Read : భారత్ ఘన విజయం.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక పరిస్థితి ఏంటీ..?
అధికార బలంతో, అక్రమ మార్గాల్లో కొలువులు సాధించిన కొందరు కీలకమైన RDO,DSP పోస్టుల్లో కూర్చోవడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఒకవైపు అక్రమాల వల్ల నాడు గ్రూప్-1 కోల్పోయిన యువత నిరాశ చెందకుండా మరింత కష్టపడి, UPSC సివిల్స్‌లో జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించి IAS, IPS అధికారులుగా ఎంపికయ్యారు. అప్పట్లో నిజమైన ప్రతిభకు న్యాయం జరిగి ఉంటే వీరంతా ఏడేళ్ల క్రితమే రాష్ట్రంలో ఉన్నత హోదాల్లో సేవలందించి ఉండేవారు. కానీ, వ్యవస్థలోని లోపాల వల్ల రాష్ట్రం ఎంతో ప్రతిభావంతులైన అధికారుల సేవలను కోల్పోవాల్సి వచ్చింది.
ప్రస్తుతం ఈ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, తప్పు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి డిస్మిస్ చేయాలని నిరుద్యోగ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నత ఉద్యోగాల్లో కూర్చున్న వారిని ఏరిపారేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. ఏళ్ల తరబడి కష్టపడి వయోపరిమితి కోల్పోయిన బాధితులకు తగిన న్యాయం జరగాలి.
Also Read : గల్ఫ్ దేశాల్లో హై అలెర్ట్.. స్పీడ్ పెంచిన ఇరాన్..!
వ్యవస్థలో ప్రక్షాళన జరిగి, తప్పు చేసిన వారికి శిక్ష పడి, అర్హులకు తగిన గుర్తింపు దక్కితేనే భవిష్యత్తులో పోటీ పరీక్షలపై యువతకు నమ్మకం కలుగుతుంది. నిపుణుల సలహాలతో ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించి, నష్టపోయిన ప్రతిభావంతులకు ఉపశమనం కలిగించినప్పుడే అసలైన సామాజిక న్యాయం నెరవేరుతుంది.

