ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. అయితే ఆ పార్టీ ప్రభావం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది.. ఏ పార్టీ పైన ఎక్కువగా ప్రభావం పడుతుంది.. ఏ పార్టీకి లాభం.. ఏ పార్టీకి నష్టం.. అసలు ఆ పార్టీఏ ప్రాంతంపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందనే అంశాలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఏపీలో ఇప్పటికే తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ప్రాంతీయ పార్టీలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. అలాగే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు జాతీయ పార్టీలు ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమిగా ముందుకు సాగుతుంటే.. వైసీపీ, కాంగ్రెస్ ఒంటరిగా ఉన్నాయి. వీరితో పాటు కమ్యూనిస్ట్ పార్టీల నేతలు కూడా.. మేమున్నాం అని అప్పుడప్పుడు తళుకుమంటున్నారు.
Also Read : ప్రత్యక్ష ఎన్నిక.. తెలుగు తమ్ముళ్లలో గుబులు..!
ఏపీలో ప్రధానంగా తెలుగుదేశం – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ – జనసేన పార్టీల మధ్య మాత్రమే పోటీ ఉంది. 2019 ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేసిన బీజేపీ.. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పోయింది. అందుకే 2024 ఎన్నికల్లో టీడీపీ – జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకుంది. అయితే వైసీపీ మాత్రం తొలి నుంచి సింగిల్‌గానే పోటీ చేస్తోంది. 2014 ఎన్నికల్లో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించిన వైసీపీ.. 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచి అధికారం చేపట్టింది. అయితే ఐదేళ్ల అరాచక పాలన కారణంగా 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అవ్వడంతో.. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో ఆ పార్టీకి చెందిన కీలక నేతలు చాలా మంది వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అలాంటి వారిలో జగన్‌కు అత్యంత సన్నిహితుడు, అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దూరమయ్యారు.
Also Read : APPSC గ్రూప్-1 అక్రమాలు.. డిఫెన్స్‌లో జగన్ పార్టీ
రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన విజయసాయిరెడ్డి కొద్ది రోజుల క్రితం మీడియా రంగంలోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత రాజకీయాలపై సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. దీంతో విజయసాయిరెడ్డి త్వరలో మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని అంతా భావించారు. ఈ నేపథ్యంలోనే త్వరలో కొత్త పార్టీ ప్రారంభిస్తున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత రాజకీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేశారు. అయితే దీనిపై పూర్తిస్థాయి వివరాలను విజయవాడలో వెల్లడిస్తానని తెలిపారు. దీంతో సాయిరెడ్డి పార్టీ వల్ల ఎవరికి లాభం.. ఎవరికి నష్టం అనే చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. నిజానికి సాయిరెడ్డి ప్రభావం ఎక్కువగా రాయలసీమ ప్రాంతంతో పాటు ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా ఉంటుంది. రెడ్డి సామాజిక వర్గంలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి కూడా కావడంతో సాయిరెడ్డి పార్టీ వల్ల వైసీపీకి ఎదురుదెబ్బ తప్పదంటున్నారు.
Also Read : జోగి రమేష్ రాజకీయ కెరీర్ క్లోజ్..?
మరోవైపు ప్రస్తుతం జగన్ చుట్టూ కోటరీ చేరిందని.. అందుకే ఘోరంగా ఓడిపోయిందని సాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే వైసీపీకి రాజీనామా చేసిన నేతలు కూడా పరోక్షంగా వైసీపీ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా బోరుగడ్డ అనిల్ సైతం సజ్జల వల్లే తన జీవితం నాశనం అయిపోయిందన్నారు. ఇలా సజ్జల బాధితులు వైసీపీలో చాలా మంది ఇప్పటికీ ఉన్నారు. వారంతా సాయిరెడ్డి పార్టీ గురించి సైలెంట్‌గా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. సాయిరెడ్డికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. కాబట్టి సాయిరెడ్డి పార్టీలో చేరితే అన్ని రకాలుగా గుర్తింపు, లాభం ఉంటుందని ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్నట్లు సమాచారం.

ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని నేతలతో విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఆడిటర్ కూడా కావడంతో.. ఆర్థిక పరమైన లావాదేవీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పైగా విజయసాయిరెడ్డికి బీజేపీ పెద్దలతో ఉన్న బంధం బహిరంగ రహస్యం కూడా. కాబట్టి బీజేపీతో ఎలాంటి ఇబ్బందులు రావని కూడా భావిస్తున్నారు. అందుకే సాయిరెడ్డి పార్టీ ప్రారంభిస్తే.. అందులో చేరాలని భావిస్తున్న వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇందుకు మరో కారణం కూడా ఉంది. వైసీపీలో పదవులు రాని వాళ్లంతా.. సాయిరెడ్డి పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే.. అక్కడ రాని పదవి.. ఇక్కడ వస్తుందనే నమ్మకం. కాబట్టి సాయిరెడ్డి పార్టీ వల్ల వైసీపీకి ఎక్కువ నష్టం వస్తుందనే మాట బాగా వినిపిస్తోంది.

