ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని రాయపూడిలో ప్రజాప్రతినిధుల కోసం నిర్మించిన సరికొత్త నివాస సముదాయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. సకల సౌకర్యాలతో, అత్యాధునిక హంగులతో ముస్తాబైన ఈ విలాసవంతమైన ఫ్లాట్ల తాళాల అప్పగింత కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల ఆగస్టు 24వ తేదీన సీఎం చంద్రబాబు స్వయంగా ఈ నివాసాలను ప్రజాప్రతినిధులకు అధికారికంగా అప్పగించనున్నారు. ఈ ప్రారంభోత్సవంతో అమరావతి వేదికగా ప్రజాప్రతినిధుల అధికారిక నివాస శకం ప్రారంభం కాబోతోంది.
Also Read : APPSC గ్రూప్-1 అక్రమాలు.. డిఫెన్స్‌లో జగన్ పార్టీ
గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఈ క్వార్టర్ల పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిష్టాత్మకంగా తీసుకుని, యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించింది. సాధారణ పరిపాలనా శాఖ ద్వారా ఎలాంటి రాజకీయ పక్షపాతం చూపకుండా, నిబంధనలకు లోబడి అర్హులైన ప్రజాప్రతినిధులందరికీ ఈ ఇళ్లను కేటాయించారు. అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు కూడా చట్టబద్ధంగా ఈ నివాసాలను అధికారికంగా కేటాయించడం విశేషం.
Also Read : శరీరంలో దాగున్న పాత వైరస్‌లను కరోనా నిద్రలేపుతోందా..?
ఏకంగా 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంతో, అధునాతన మౌలిక వసతులు, లగ్జరీ క్లబ్‌హౌస్, గ్రీన్ కవర్ మరియు అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలతో ఈ ఫ్లాట్లను నిర్మించారు. అయితే, ఈ ఇళ్ల కేటాయింపు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. గత ఐదేళ్లుగా అమరావతి నిర్మాణాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, మూడు రాజధానుల రాగాన్ని ఎత్తుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఇప్పుడు ప్రభుత్వం చట్టబద్ధంగా కేటాయించే ఈ నూతన నివాసాలను స్వీకరిస్తారా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది. గతంలో అమరావతిని వ్యతిరేకించిన వైసీపీ నేతలు, ఇప్పుడు అదే రాజధాని నడిబొడ్డున ఉన్న విలాసవంతమైన ఫ్లాట్లలో కాపురం ఉండటానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంగీకరిస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఆగస్టు 24న తాళాల అప్పగింత తర్వాత ప్రతిపక్ష నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

