నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్‌కు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్‌గా నిలిచాయి. తమిళనాడు ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సూపర్ స్టార్ విజయ్ తన నెక్స్ట్ టార్గెట్‌గా తెలుగు రాష్ట్రాలను ఎంచుకున్నారా? అనే చర్చ ఇప్పుడు బాగా జరుగుతోంది. తన రాజకీయ ప్రయాణం తమిళనాడుకే పరిమితం చేయకుండా జాతీయస్థాయికి ఎదగాలనే ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి విజయ్.. అందుకు తగినట్లు అడుగులు వేస్తున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తమ వాదనకు బలం చేకూర్చేలా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని పత్రికల్లో తమిళనాడు ప్రభుత్వ ప్రకటనలు జారీ చేయడమో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : ప్రశ్న రావణ్‌కు షాక్.. ఇక ఇప్పట్లో బయటకు రావడం కష్టమే..!
తమిళనాడు ముఖ్యమంత్రిగా వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా దళపతి విజయ్ ప్రభుత్వం పత్రికలకు భారీ ప్రకటనలు ఇచ్చింది. ఇలా ప్రభుత్వ విజయాలను పత్రికల్లో ప్రకటనల ద్వారా ప్రచురించడం సహజమే. అయినప్పటికీ తమిళనాడు సరిహద్దులు దాటి తెలుగు రాష్ట్రాల్లో తెలుగు భాషలో ప్రకటనలు జారీ చేయడమే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిజానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తమ ప్రభుత్వాల విజయాలను, పథకాల ప్రారంభం గురించి పక్క రాష్ట్రంలో ప్రకటనలు ఇవ్వటం లేదు. కానీ తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకటనలు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఏపీ, తెలంగాణల్లోని కొన్ని ప్రధాన పత్రికలకు తమిళనాడు ప్రభుత్వ ప్రకటనలు జారీ చేయడం చర్చనీయాంశం అవుతోంది. ఏ ఉద్దేశంతో తమిళనాడు ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రచారం చేసిందనేది హాట్ టాపిక్ అవుతోంది. సినీ నటుడిగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా కూడా పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకోవాలని చూస్తున్నారా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. విజయ్‌కి తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్ బేస్ ఉంది. కేవలం సినిమా నటుడిగానే కాకుండా, ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడంతో తన నాయకత్వ ప్రభావాన్ని, ప్రతిష్టను రాష్ట్రాలకూ చాటుకునే ప్రయత్నంలో వ్యూహాత్మకంగా ఈ ప్రకటనలు జారీ చేసి వుంటారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : మానవ్ సుతార్ సక్సెస్ వెనుక ఉన్న ఆ సీక్రెట్ స్టార్ అతనే..!
ఇదేసమయంలో విజయ్ ప్రభుత్వ ప్రకటనలకు రాజకీయానికి సంబంధం ఉండదనే వాదన కూడా వినిపిస్తుంది. తమిళ, తెలుగు ప్రజలకు సంస్కృతిక, చారిత్రక సంబంధాలు ఉన్నాయని, ఆ భావోద్వేగాన్ని కొనసాగించేందుకు తెలుగు రాష్ట్రాల్లో తన ప్రభుత్వ ప్రగతిని చాటుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు. తమిళనాడులో తెలుగు ఓటర్లు కూడా గణనీయంగా ఉండటం, వారికి ఇక్కడి వారితో బంధుత్వాలు ఉండటం వల్ల తన పాలనపై సానుకూల చర్చ జరిగాలనే ఆలోచన కూడా ఉండొచ్చని అంటున్నారు. ఇదే సమయంలో తన ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో తెలుగు ప్రజలను ఆకర్షించి పర్యాటకాభివృద్ధికి బాటలు వేయాలనే ప్లాన్ కూడా చేశారనే వాదన కూడా వినిపిస్తోంది.
మరోవైపు పెట్టుబడులు, పరిశ్రమల ఆకర్షణకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని, ఈ పోటీలో తాను ఉన్నానని చెప్పేందుకే ఇక్కడి పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించడానికి కూడా దళపతి విజయ్ ఈ విధంగా తెలుగులో వంద రోజుల విజయంపై ప్రకటనలు జారీ చేశారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, తమ రాష్ట్రంలో పెట్టుబడులు, పర్యాటకం లేదా ఇతర అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఇతర రాష్ట్రాల ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు మీడియా మార్కెటింగ్‌లో భాగంగా కూడా ఇలాంటి ప్రకటనలు ఇచ్చి ఉండవచ్చునని అంటున్నారు. మొత్తానికి విజయ్ సర్కార్ తెలుగు ప్రకటనలు.. పెద్ద రాజకీయ దుమారం రేపుతున్నాయి.

