ఏళ్ల తరబడి గంజికి ఏడ్చాం.. గుడ్డకు ఏడ్చాం.. ఇది నా ఊరు.. వీళ్లంతా నా వాళ్లు.. అంటూ ఛత్రపతి సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ అందరికీ గుర్తే. ఈ మాట రాయలసీమ ప్రాంత వాసులకు సరిగ్గా సరిపోతుంది. ఇంకా చెప్పాలంటే.. కూత వేటు దూరంలో కృష్ణమ్మ పరుగులు పెడుతున్నప్పటికీ.. తాగటానికి గుక్కెడు మంచినీళ్లు కూడా అందుబాటులో లేని దుర్భర పరిస్థితులు మార్కాపురం జిల్లా వాసుల పరిస్థితి. ఇలాంటి దయనీయ పరిస్థితులకు మంగళం పాడే సమయం వచ్చేసింది. మాది కరువు ప్రాంతం కాదు.. మేము రైతులమే అని ఈ ప్రాంత వాసులు గర్వంగా చెప్పుకునే సమయం ఆసన్నమైంది.
Also Read : ఇరుముడి తో రవి తేజ ట్రాక్ లోకి వస్తాడా?
ఏళ్ల తరబడి కరువు దుర్భిక్షంతో అల్లాడుతున్న ప్రాంతాల రైతుల ఆశలు వెలిగొండ ప్రాజెక్టుతో సాకారం కానున్నాయి. రైతుల పాలిట వరప్రదాయనిగా భావిస్తున్న పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను నల్లమల సాగర్‌కు తరలించేందుకు కూటమి ప్రభుత్వము చర్యలు ముమ్మరం చేసింది. ఎన్నో ఏళ్లుగా ఎదురైనా అడ్డంకులను, అవాంతరాలను అధిగమిస్తూ ప్రాజెక్టు వనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 22న ట్రయల్ రన్ నిర్వహించేందుకు జల వనరుల శాఖ ముహూర్తం ఖరారు చేసింది. కృష్ణా జలాలతో కరవు ప్రాంతాలకు కొత్త ఊపిరి వెలిగొండ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మార్కాపురం, కడప, నెల్లూరు జిల్లాలతో పాటు మార్కాపురం ప్రాంతంలోని కరువు పీడిత గ్రామాలకు సాగునీటి భరోసా లభించనుంది.
సరిగ్గా 50 కిలోమీటర్ల దూరంలోనే కృష్ణమ్మ. శ్రీశైల దివ్యక్షేత్రం మీదుగా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జున సాగర్ చేరుతుంది. కృష్ణా వరదలు వచ్చినప్పుడు లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదిలేస్తున్నారు. అయినా సరే.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నంద్యాల జిల్లాకు సాగు, తాగు నీరు సరఫరా అవుతుంది తప్ప.. ప్రాజెక్టు దిగువన ఉన్న మార్కాపురం, కడప జిల్లాలకు కృష్ణా జలాలు అందుబాటులో మాత్రం లేకుండా పోయాయి. ఇందుకు ఒకటే పరిష్కారం అని భావించిన నాటి సీఎం చంద్రబాబు.. 2002లోనే తొలిసారి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత నుంచి నల్లమల్ల అటవీ ప్రాంతంలో కొండను తవ్వే పనులకు శ్రీకారం చుట్టారు. సొరంగం ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటికి మార్కాపురం జిల్లా, కడప, నెల్లూరు జిల్లాలకు తరలించేలా ప్రణాళికలు రూపొందించారు.
Also Read : తెలుగు రాష్ట్రాలపై సీఎం విజయ్ కన్ను..?
ఎన్నో సంవత్సరాలుగా కేవలం వర్షాల మీదే ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు కృష్ణా జలాలు అందుబాటులోకి వస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 22న నిర్వహించనున్న ట్రయల్ రన్‌లో ప్రాజెక్టు లోని వివిధ భాగాల పనితీరును అధికారులు పరిశీలిస్తున్నారు. నీటి విడుదలకు ముందు సాంకేతిక వ్యవస్థలు సక్రమంగా వని చేస్తున్నాయా..? ఎక్కడైనా లీకేజీలు, లేదా సాంకేతిక లోపాలు ఉన్నాయా అనే అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
22వ తేదీ దగ్గర పడుతుండడంతో పనులు క్లియర్ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. తొలి దశ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు నీటిని తరలించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే సమయంలో ముంపు గ్రామాలను కూడా తరలించే చర్యలు చేపట్టారు. మౌళిక వసతుల కల్పనపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. రైతు కల సాకారం దిశగా పనులు దశాబ్దాలుగా వెలిగొండ ప్రాజెక్టు నీటి కోసం ఎదురు చూస్తున్న రైతుల్లో ఆశలు చిగురించాయి. ట్రయల్ రన్ విజయవంతమై కృష్ణా జలాలు నల్లమల్ల సాగర్‌కు చేరితే కరవు ప్రాంతాల ముఖచిత్రం మారే అవకాశముంది. సాగునీటితో పాటు తాగునీటి సమస్యకు ఉపశమనం లభించడం, వ్యవసాయం ఆధారంగా ఉపాధి అవకాశాలు పెరగడం ద్వారా ఈ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి వెలిగొండ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. ఈనెల 22న ట్రయల్ రన్ విజయవంతం కావాలని, త్వరలోనే కృష్ణా జలాలు మా పొలాలకు చేరాలని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

