అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందం ముగిసిన మరుసటి రోజే గల్ఫ్ రీజియన్ క్షిపణుల మోతతో వణికిపోయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లక్ష్యంగా ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడంతో గల్ఫ్ దేశాలలో అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులలో ఒకటి యూఏఈ ప్రాంతీయ జలాల్లో పడగా, మరొకటి వెలుపల పడిపోయినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ధృవీకరించింది. మిడిల్ ఈస్ట్‌లో సుదీర్ఘ కాలంగా సాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు గత జూన్ 17న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెస్కియాన్ ఒక కీలక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు.
Also Read : ప్రత్యక్ష ఎన్నిక.. తెలుగు తమ్ముళ్లలో గుబులు..!
దీని ప్రకారం కుదిరిన 60 రోజుల కాల్పుల విరమణ గడువు సోమవారంతో ముగిసిపోవడం, ఒప్పందం పొడిగింపునకు ఇరు దేశాలు మొగ్గు చూపకపోవడంతో ఈ సంక్షోభం మళ్లీ మొదటికి వచ్చింది. ఒప్పందం రద్దయిన కొన్ని గంటల్లోనే ఇరాన్ మళ్లీ తన పాత శత్రుత్వాన్ని తెరపైకి తెస్తూ.. అమెరికాకు అత్యంత కీలక భాగస్వామిగా ఉన్న యూఏఈపై క్షిపణి దాడులకు తెగబడింది. అంతకుముందు కూడా స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ సముద్ర మార్గంలో వెళ్తున్న అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ నౌకపై ఇరాన్ దాడికి పాల్పడటం గమనార్హం.
Also Read : నిస్సాన్ టెక్టాన్ క్రేజీ రివ్యూ.. లడఖ్ కొండల్లో సాహసం..!
ఇరాన్ నుండి క్షిపణి ముప్పును గుర్తించిన వెంటనే యూఏఈ నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారితీ దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. “మిస్సైల్ దాడి ముప్పు పొంచి ఉంది.. ప్రజలంతా వెంటనే మీకు దగ్గరలోని సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందండి” అంటూ ప్రజల మొబైల్ ఫోన్లకు అత్యవసర సైరన్ సందేశాలను పంపడంతో గల్ఫ్ దేశాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ విదేశాంగ శాఖ.. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ సముద్ర రవాణా మార్గాన్ని పూర్తిగా తెరవాలని డిమాండ్ చేసింది. తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాయని యూఏఈ స్పష్టం చేసింది.

