‘కేజీఎఫ్’ రెండు భాగాలతో భారీ విజయాన్ని అందుకున్న యష్.. కన్నడ హీరో నుంచి ప్యాన్ ఇండియా స్టార్‌గా తన ఇమేజ్‌ను ఒక్కసారిగా మార్చుకున్నాడు. దీంతో సహజంగానే ఆయన తదుపరి సినిమా ఎలా ఉండబోతోంది? ఎలాంటి కథను ఎంచుకుంటారు? దర్శకుడు గీతు మోహన్ దాస్‌తో కలిసి చేస్తున్న ‘టాక్సిక్’ ఎలా ఉండబోతోంది? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అనౌన్స్‌మెంట్ సమయంలో కొంతమంది సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ.. టీజర్, ప్రోమోల్లో కనిపించిన డార్క్ గ్యాంగ్‌స్టర్ వాతావరణం, బోల్డ్ ట్రీట్‌మెంట్ సినిమాపై అంచనాలను పెంచాయి. మరి భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘టాక్సిక్’ ఆ అంచనాలను అందుకుందా? సినిమా ఎలా ఉంది? తెలుసుకుందాం.
Also Read : జనసేనలోకి కొండా సుస్మిత? కీలక నేతలతో భేటీకి రంగం సిద్ధం!
కథేంటి..?
1940 నుంచి 1970ల మధ్య కాలంలో జరిగే పీరియడ్ క్రైమ్ డ్రామా ఇది. సాధారణ స్థాయి నుంచి ఎదిగి ఓ భారీ క్రైమ్ సిండికేట్‌ను శాసించే స్థాయికి చేరుకున్న రాయా (యష్) జీవితంలో జరిగిన సంఘటనల చుట్టూ కథ తిరుగుతుంది. రాయా జీవితంలో అతని సోదరి గంగ (నయనతార) పాత్ర ఎంతో కీలకం. చిన్నతనంలోనే అనాథలుగా మారిన వీరిద్దరిలో.. గంగ తల్లిలా రాయాను పెంచుతుంది. రాయా క్రైమ్ ప్రపంచంలో ఎదిగిన తర్వాత కూడా అతనికి అండగా నిలుస్తుంది.
మరోవైపు క్రైమ్ సిండికేట్‌లో కీలక స్థానంలో ఉన్న సాల్వడార్ కుమార్తె రెబెకా (తారా సుతారియా)ను రాయా వివాహం చేసుకోవాల్సి వస్తుంది. అదే సమయంలో సర్కస్‌లో పనిచేసే నాడియా (కియారా అద్వానీ)తో రాయా సంబంధం కొనసాగుతుంది. వీరికి ఓ కుమారుడు జన్మిస్తాడు. అయితే కొంతకాలం తర్వాత రాయా నాడియాకు దూరమవుతాడు. కథలో అసలు కీలకమైన మలుపు.. రాయా తన కుమారుడు టికెట్‌ను కలుసుకున్నప్పుడు మొదలవుతుంది. తండ్రి, కొడుకుల మధ్య ఏం జరిగింది? గంగ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? ఎలిజబెత్ (హుమా ఖురేషీ) ఎవరు? రాయా జీవితంలోని ఈ పాత్రలన్నీ ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయి? అన్నదే మిగతా కథ.
Also Read : భర్త హత్యకు సౌజన్య కుట్ర..? సైనేడ్ మిస్టరీలో షాకింగ్ నిజాలు..!
ఎలా ఉంది?
‘టాక్సిక్’ను బోల్డ్, డార్క్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కించాలనే దర్శకురాలు గీతు మోహన్ దాస్ ప్రయత్నం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కథ, కథనం విషయంలో అదే స్థాయి శ్రద్ధ కనిపించకపోవడం సినిమాకు ప్రధాన బలహీనతగా మారింది.
దాదాపు 80 ఏళ్ల క్రితం జరిగే కథ కావడంతోపాటు.. సినిమాలో పాత్రలు, వాటి నేపథ్యాలు, పేర్లు ఎక్కువగా ఉండటం వల్ల కథను అర్థం చేసుకోవడానికి ప్రేక్షకుడు మొదటి నుంచే ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది. ఒక పాత్ర ఎవరు? ఏం చేస్తుంది? మరో పాత్రతో దాని సంబంధం ఏమిటి? అనే విషయాలు పూర్తిగా అర్థమయ్యేలోపే కథ మరో ఎపిసోడ్‌కు వెళ్లిపోతుంది. దీంతో సినిమా సాగుతున్న కొద్దీ ప్రేక్షకుడికి కథపై ఆసక్తి కంటే అయోమయం ఎక్కువయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.
Also Read : పాకిస్తాన్ బండారం బయటపెట్టిన జాతీయ మీడియా..!
స్టైలిష్ మేకింగ్, డార్క్ విజువల్స్, భారీ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నప్పటికీ.. వాటిని బలమైన కథనం సరిగ్గా క్యారీ చేయలేకపోయింది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్లు సినిమాపై తీవ్ర ప్రభావం చూపాయి. సినిమా మొత్తం దాదాపు నిరంతర యాక్షన్‌తో నిండిపోవడంతో ఒక దశ తర్వాత అవి ప్రేక్షకుడికి విసుగును కలిగిస్తాయి. క్రైమ్ వరల్డ్‌ను చూపించడంలో వయొలెన్స్ అవసరమే. కానీ ఆ వయొలెన్స్‌కు కథతో బలమైన సంబంధం, సందర్భం ఉంటేనే దాని ప్రభావం ప్రేక్షకుడిపై పడుతుంది. ‘టాక్సిక్’లో చాలా సందర్భాల్లో యాక్షన్ కేవలం స్టైలిష్‌గా కనిపించడం కోసమే పెట్టినట్లుగా అనిపిస్తుంది. ఫలితంగా కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. ఓవరాల్‌గా అవే సినిమాకు మైనస్‌గా మారాయి.
మరో ముఖ్యమైన లోపం ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం. కథలో కుటుంబ బంధాలు, అన్నాచెల్లెళ్ల అనుబంధం, తండ్రి-కొడుకుల సంబంధం వంటి బలమైన ఎమోషనల్ అంశాలు ఉన్నప్పటికీ.. వాటిని ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దడంలో రచన విఫలమైంది. అందుకే కీలకమైన సన్నివేశాల్లో కూడా ప్రేక్షకుడు పాత్రలతో భావోద్వేగంగా ప్రయాణించలేడు.
కేజీఎఫ్ ప్రభావం
యష్ విషయంలో మరో అంశం స్పష్టంగా కనిపిస్తుంది. ‘కేజీఎఫ్’ తర్వాత ఆయనపై ఏర్పడిన మాస్ ఇమేజ్‌ను ‘టాక్సిక్’ కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది. రాయా పాత్రలో యష్ కనిపించే తీరు, కొన్ని డైలాగులు, యాక్షన్ ఎపిసోడ్లు చూస్తుంటే కేజీఎఫ్ ప్రభావం నుంచి పూర్తిగా బయటకు రాలేదనే భావన కలుగుతుంది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు, డైలాగ్ డెలివరీలో కేజీఎఫ్ ఫ్లేవర్ కనిపిస్తుంది. దీంతో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నప్పటికీ.. ప్రేక్షకుడికి ఎక్కడో చూసిన అనుభూతి కలుగుతుంది.
టెక్నికల్‌గా ఎలా ఉంది?
సినిమాటోగ్రఫీ ‘టాక్సిక్’కు ప్రధాన బలాల్లో ఒకటి. పీరియడ్ బ్యాక్‌డ్రాప్, డార్క్ టోన్, భారీ సెట్స్‌ను కెమెరా అద్భుతంగా క్యాప్చర్ చేసింది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ పనితనం కూడా తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి.
రవిబస్రూర్ సంగీతం కొన్ని సందర్భాల్లో బాగా పనిచేసింది. అయితే యాక్షన్ సన్నివేశాల్లో సంగీతాన్ని విపరీతంగా ఉపయోగించడం వల్ల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని చోట్ల ఓవర్‌గా అనిపిస్తుంది. సినిమా నిడివి కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. కథనంలో పెద్దగా ప్రభావం చూపని కొన్ని సన్నివేశాలను తొలగించి కనీసం 30–45 నిమిషాలు ట్రిమ్ చేసి ఉంటే సినిమా మరింత ఎంగేజింగ్‌గా ఉండేది.
నటీనటుల పనితీరు
రాయా పాత్రలో యష్ మరోసారి తన మాస్ ఇమేజ్‌కు తగ్గ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయితే కొన్ని సందర్భాల్లో ఆయన కేజీఎఫ్ రాకీ భాయ్‌ను గుర్తుకు తెచ్చేలా కనిపిస్తాడు. దీనికి భిన్నంగా టికెట్ పాత్రలో యష్ కనిపించే తీరు, నటన మరింత ఫ్రెష్‌గా అనిపిస్తుంది.
నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషీ, రుక్మిణీ వసంత్ తమ తమ పాత్రల పరిధిలో బాగానే నటించారు. వీరిలో కియారా అద్వానీ నటన కొంత ఎక్కువగా ఆకట్టుకుంటుంది. అయితే మంచి నటీనటులను తీసుకున్నప్పటికీ.. వారి పాత్రలకు బలమైన ఎమోషనల్ ఆర్క్ ఇవ్వకపోవడం కొంత నిరాశ కలిగిస్తుంది.
చివరిగా..
‘టాక్సిక్’లో స్టైలిష్ మేకింగ్ ఉంది. భారీ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. యష్ వంటి స్టార్ ఉన్నాడు. అద్భుతమైన విజువల్స్ ఉన్నాయి. కానీ వీటన్నింటినీ కలిపి నడిపించే బలమైన కథనం, పకడ్బందీ స్క్రీన్‌ప్లే లేకపోవడం సినిమాకు ప్రధాన సమస్య.
కేజీఎఫ్ తరహా మాస్ ఎలివేషన్స్, విపరీతమైన యాక్షన్, డార్క్ విజువల్స్ మాత్రమే సినిమాను నిలబెట్టలేవు. కథలోని పాత్రలు, వారి భావోద్వేగాలు, సంఘర్షణలు ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా ఉంటేనే ఆ ఎలివేషన్స్‌కు సరైన ప్రభావం వస్తుంది. ‘టాక్సిక్’లో అదే లోపించింది.
మొత్తంగా.. భారీ అంచనాలతో వచ్చిన ‘టాక్సిక్’ స్టైలిష్‌గా కనిపించినప్పటికీ, బలహీనమైన రైటింగ్, గందరగోళమైన స్క్రీన్‌ప్లే, ఓవర్‌డోస్ యాక్షన్ కారణంగా ప్రేక్షకుడిని పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది.
రేటింగ్: 1.5/5

