తెలంగాణ కాంగ్రెస్ ఒక్కసారిగా రాజకీయ ఉత్కంఠ పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ కీలక నేత కేసీ వేణుగోపాల్‌తో ప్రత్యేకంగా భేటీ కావడం ఇప్పుడు హస్తం పార్టీలో హాట్ టాపిక్‍గా మారింది. సాధారణ ప్రోటోకాల్ పక్కనపెట్టి సీఎం స్వయంగా కేసీ వేణుగోపాల్ నివాసానికి వెళ్లడం, అక్కడ సుదీర్ఘంగా వన్ టు వన్ చర్చలు జరపడం వెనుక అసలు కథ ఏమిటన్న దానిపై కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
Also Read : ఇకపై నాయకుల కోసం కాదు : పవన్ సంచలన కామెంట్స్..!
తెలంగాణ కాంగ్రెస్‌లో ఇటీవల చోటుచేసుకున్న వరుస వివాదాలు ఇప్పుడు అధిష్టానం టేబుల్ పైకి చేరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ కుటుంబానికి సంబంధించిన వ్యాఖ్యలు, వాటి చుట్టూ నెలకొన్న రాజకీయ దుమారం, పార్టీలో పెరిగిన అసంతృప్తిపై సీఎం తన అభిప్రాయాలను అధిష్టానానికి వివరించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. క్రమశిక్షణ విషయంలో రాజీపడకూడదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో కొండా సురేఖ వ్యవహారంపై అధిష్టానం ఏం నిర్ణయిస్తుందన్నది ఇప్పుడు అసలు ప్రశ్నగా మారింది. మంత్రి పదవికి ఎసరు వస్తుందా..? షోకాజ్ నోటీసుతో సరిపెడతారా..? లేక వివరణ తీసుకుని వివాదానికి తెర దించుతారా..? అనే చర్చ జోరందుకుంది.
ఇదే సమయంలో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ఆయన వ్యాఖ్యలపై పార్టీలో వ్యక్తమైన అభ్యంతరాలు, వాటి ప్రభావం తదితర అంశాలపై కూడా ఢిల్లీ పెద్దలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు మంత్రివర్గానికి సంబంధించిన వివాదం.. మరోవైపు పార్టీ నేతల వ్యాఖ్యలపై అసంతృప్తి.. ఇంకోవైపు క్రమశిక్షణ అంశం. ఇలా మూడు కోణాల్లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారం ఢిల్లీకి చేరినట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కూడా ఢిల్లీ చేరుకోవడం.. ఏఐసీసీ పెద్దలను కలవడం మరింత ఉత్కంఠ పెరిగింది. మరోవైపు మంత్రి కొండా సురేఖ కూడా తన వివరణ ఇచ్చేందుకు ఢిల్లీ చేరుకోవడం పరిణామాలకు మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చింది. అంటే.. ఢిల్లీ వేదికగా ఒక్కొక్కరి వాదన, అధిష్టానం ముందు ఒక్కొక్కరి వివరణ.. చివరకు ఎవరి వాదన బలపడుతుంది..? ఎవరి భవిష్యత్ పై ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది..? అనేది ఇప్పుడు కాంగ్రెస్‌లో చర్చనీయాంశం అయింది.
Also Read : కూతురు కోసం బీజేపీ ఎమ్మెల్యే పాట్లు..!
ఈ వరుస భేటీల నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కూడా రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఇప్పటివరకు కేబినెట్ మార్పులపై అధికారికంగా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. కేవలం ఒక వివాదాన్ని పరిష్కరించేందుకు మాత్రమే ఈ సమావేశాలా..? లేక పార్టీలో మరింత పెద్ద స్థాయి ప్రక్షాళనకు ఇది ముందుమాటా..? అన్నదే ఇప్పుడు ఆసక్తికర ప్రశ్న. రేవంత్, వేణుగోపాల్ భేటీకి కొనసాగింపుగా జరగనున్న ఢిల్లీ సమావేశాలు తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలకు కీలక మలుపుగా మారే అవకాశముంది. కొండా సురేఖ విషయంలో అధిష్టానం కఠినంగా వ్యవహరిస్తుందా..? చిన్నారెడ్డి వ్యాఖ్యలపై చర్య ఉంటుందా..? కేబినెట్‌లో మార్పులపై గ్రీన్ సిగ్నల్ వస్తుందా..? లేక అందరికీ హెచ్చరికలు జారీ చేసి వివాదాలకు ముగింపు పలుకుతారా..? ఈ ప్రశ్నలకు వరుస భేటీల తర్వాతే సమాధానం దొరికే అవకాశం ఉంది. ఢిల్లీ నుంచి వచ్చే ఒక్క నిర్ణయం.. తెలంగాణ కాంగ్రెస్‌లో సమీకరణాలను మార్చేంత ప్రభావం చూపుతుందా..? ఇప్పుడు అందరి చూపు.. ఏఐసీసీ వైపే..!

