అమరావతి వేదికగా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో జరిగిన టీడీపీ మంత్రుల బ్రేక్‌ఫాస్ట్ సమావేశం ఆసక్తిని రేపుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రుల పనితీరు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మంత్రులకు దిశా నిర్దేశం చేస్తూ.. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవడానికి, వాయిదా వేయించడానికి ‘గొడ్డలి పార్టీ’ చేస్తున్న కుయుక్తులు ఇకపై సాగవని, అక్టోబర్ నెలలోనే ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని లోకేష్ స్పష్టం చేశారు.
Also Read : ఎవడు డ్రామాలు ఆడుతున్నాడో తెలుసు రోజా..!
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను కూటమి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, మంత్రులందరూ తమతమ జిల్లాల్లో కేడర్‌ను సమాయత్తం చేయాలని నారా లోకేష్ సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించేలా క్షేత్రస్థాయి వ్యూహాలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని, ముఖ్యంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ రాబోయే అక్టోబర్ నెల నుండి దశల వారీగా కొత్త పింఛన్లను మంజూరు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఈ సమావేశంలో వెల్లడించారు.
Also Read : రాజీనామా చేయండి.. కొండాకు ఖర్గే షాక్..!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రజల్లో తెచ్చిన నమ్మకాన్ని, అభివృద్ధిని ఓట్ల రూపంలో మార్చుకోవాల్సిన బాధ్యత మంత్రులపైనే ఉందని లోకేష్ గుర్తుచేశారు. ఈ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో మంత్రుల శాఖల వారీగా పురోగతిని సమీక్షించడంతో పాటు, పార్టీ మరియు ప్రభుత్వ సమన్వయంపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అక్టోబర్ లోగా లోకల్ బాడీ ఎన్నికల నోటిఫికేషన్ రానుందనే సంకేతాలు లోకేష్ ఇవ్వడంతో.. ఏపీలో అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల వేడి ఒక్కసారిగా రాజుకుంది.

