బెంగాల్‌పై ఫోకస్ చేసి మరీ కొట్టారు. నెక్స్ట్ మిషన్ సౌత్‌లో భాగంగా.. తెలంగాణపై బీజేపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. నైజాంలో కూడా కాషాయ జెండా ఎగరవేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత.. సరేంద్ర మోదీ తొలి సభ తెలంగాణలోనే జరుగనుంది. ఈ సభ వేదికగా.. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర లేపనుందా..? ఇంతకు కమలనాథులతో టచ్‌లో ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలెవరు..? మోదీ సభలో చేరికలు ఉండబోతున్నాయనే టాక్ నిజమేనా.. లేక కేవలం మైండ్ గేమ్ మాత్రమేనా..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read : సీఎం సచివాలయంలో ఉండగా.. భయపెట్టిన ప్రచారం..!
చాలా కాలం తర్వాత ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ టూర్ ఖరారైంది. ఈ నెల 10వ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. సాయంత్రం 7 గంటల వరకు హైదరాబాద్‌లోనే ఉంటారు ప్రధాని. ఇందులో భాగంగా అధికార, పార్టీ కార్యక్రమాలు కూడా ఫిక్స్ చేశారు. పార్టీ కార్యక్రమాల వేదికగా బీజేపీని బలోపేతం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. టార్గెట్ తెలంగాణ లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే సాధారణ ఎన్నికల ముందు జరిగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను సెమీ ఫైనల్‌గా భావిస్తున్నాయి అన్ని పార్టీలు. గ్రేటర్ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందుకోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకునేందుకు కాషాయ పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు.
ఇటీవల మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు బీజేపీ స్టేట్ ఆఫీస్‌కు రావడం పొలిటికల్ సర్కిల్‌లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబంతో కలిసి ఢిల్లీలో నరేంద్ర మోదీని కలిశారు. దీంతో బీఆర్ఎస్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబంతో సహా కమలం గూటికి చేరేందుకు రెడీ అయ్యారన్న వార్తలు వస్తున్నాయి. అయితే బీజేపీలో చేరికపై మల్లారెడ్డి కోడలు ప్రీతీరెడ్డి క్లారిటీ ఇచ్చినప్పటికీ.. వారి కుటుంబం వేస్తున్న అడుగులు బీజేపీలో చేరేలా ఉన్నాయనే చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఇదే అంశం బీఆర్ఎస్ లో కూడా చర్చకు దారి తీసిందంటున్నారు. నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డి బీజేపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి. బీజేపీ నేతలు కూడా ఈ అంశంపై నర్మగర్భంగా స్పందిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
Also Read : వాజపేయి కోరిక తీర్చిన మోడీషా..!
ఇక గ్రేటర్ పరిధిలో కీలకంగా ఉన్న కాంగ్రెస్ నేతలే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర లేపేందుకు సిద్ధమయ్యారట కమలనాధులు. గ్రేటర్ పరిధిలో ఉన్న ఒకరిద్దరు కాంగ్రెస్ సీనియర్ నేతలను చేర్చుకునేలా పావులు కదుపుతున్నారట. జీహెచ్ఎంసీ, మల్కాజ్‌గిరి కార్పొరేషన్, సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో పాగా వేసేలా బలమైన నేతలను తమ వైపునకు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారట. నరేంద్ర మోదీ సభ వేదికగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను బీజేపీలోకి తీసుకోవడం ద్వారా ఆ రెండు పార్టీలకు షాక్ ఇవ్వాలనే ప్లాన్ నడుస్తోందట. మోదీ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న బీజేపీ లీడర్లు ఇక మోదీ సభకు ముందు, ఆ తర్వాత అన్నట్టుగా పార్టీ దూకుడు పెంచాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెన్, బీఆర్ఎస్‌లో ఉన్న బలమైన నేతలను, ఆయా పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలను గుర్తించి.. వారిని దశల వారీగా కమలం గూటికి చేర్చుకోవాలనేది ఆ పార్టీ నేతల ప్లాన్. మరి మోదీ సభ వేదికగా బీజేపీలో చేరేదెదరో చూడాలి.

