వడ్డించే వాడు మనవాడు అయితే.. బంతిలో చివర్లో కూర్చున్నా సరే.. అన్ని అవే వస్తాయనేది సామెత. ఇది కేవలం భోజనాలకే కాదు.. అన్ని విషయాలకు వర్తిస్తుంది. తీర్పు చెప్పే వాడు మనవాడు అయితే.. మనం తప్పు చేసినా కూడా.. దానిని ఒప్పు అని చూపించగలడు. ఇక రాజకీయ నేతల విషయంలో ఈ సూత్రం బాగా పని చేస్తుంది కూడా. నా అనుకున్న వాళ్లకు పదవుల కోసం ఎంత వరకు అయినా రెడీ అంటారు. ఇంకా చెప్పాలంటే.. రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్.. అని పదే పదే చెప్పే రాజకీయనేతలైతే.. తమ వారి కోసం ఆ రూల్స్ బ్రేక్ చేసేందుకు కూడా రెడీ అంటారు. తాజాగా ఏపీలో ఓ మంత్రి తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : ఏపీలో ప్రభుత్వ బడులకు ఫుల్ క్రేజ్..!
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతుంది. అయినా సరే.. ఇప్పటికీ కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయలేదు. దీనిపై అటు తెలుగు తమ్ముళ్లు, ఇటు పార్టీ నేతలు కూడా తీవ్ర అసహనంతో ఉన్నారు. కొంతమంది నేతలైతే.. ఇంకెన్నాళ్లు బాబు గారు ఇలా సాగదీస్తారు.. అంటూ విమర్శలు కూడా చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా చేరింది. దీంతో సాధ్యమైనంత త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో కొన్ని కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. వీటి కోసం ఆయా కులాలకు చెందిన నేతల్లో పార్టీ కోసం కష్టపడిన వారి వివరాలను ఇప్పటికే సేకరించారు.
వీటిల్లో ఇప్పుడు ఓ కార్పొరేషన్ చైర్మన్ పోస్టు అంశం.. ఇటు పార్టీలో అటు ఆ కులంలో కూడా హాట్ టాపిక్‌గా మారింది. శిష్ట కరణాల కార్పొరేషన్ చైర్‌పర్సన్ పదవి కోసం ఇప్పుడు ఓ మంత్రి రంగంలోకి దిగారు. బీసీ – డీ జాబితాలో ఉన్న శిష్ట కరణాల విభాగం తెలుగుదేశం పార్టీలో మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలోనే ఉంది. తెలుగుదేశం పార్టీ బీసీ విభాగాల ఇంఛార్జ్‌గా మంత్రి కొల్లు రవీంద్ర వ్యవహరిస్తున్నారు. దీంతో శిష్ట కరణాల కార్పొరేషన్ పదవి కోసం చైర్మన్ ఎంపిక బాధ్యత కూడా ఆయనకే అప్పగించారు. దీంతో.. ఆయన తనకు నచ్చిన ఓ వ్యక్తి పేరును పార్టీ పెద్దలకు సూచించారు. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. సదరు వ్యక్తి శిష్ట కరణాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని తేలడమే ఇప్పుడు హాట్ టాపిక్.
అక్కుమహంతి రాజా అనే వ్యక్తిని మంత్రి కొల్లు రవీంద్ర సిఫారసు చేశారు. ఇందుకు ప్రధాన కారణం.. సదరు రాజా అనే వ్యక్తి.. కొల్లు రవీంద్ర ప్రధాన అనుచరుడు. మచిలీపట్నం వాసి కూడా. దీంతో నీకు పదవి గ్యారంటీ అని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అసలు విషయం ఏమిటంటే.. రాజా అసలు పేరు నాగేశ్వర్రావు. ఆయన వడ్డెలు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. రాజా సోదరుడు చలపతిరావు ప్రస్తుతం హైదరాబాద్‌లో బీసీ-ఏ కోటాలో పోలీసు ఉద్యోగం చేస్తున్నారు కూడా. ఇదే విషయాన్ని శిష్ట కరణాల సామాజిక వర్గం నేతలు ఇటీవల పార్టీ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేశారు. అయితే విచిత్రంగా ఆ సమయంలో మంత్రి కొల్లు రవీంద్ర కూడా అక్కడే ఉండటంతో.. నేరుగా ఆయనకే రాజా గురించి ఫిర్యాదు చేశారు. దీంతో ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితుల్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారి పార్టీ సభ్యత్వ కార్డులు, ఇతర వివరాలు కూడా తీసుకున్నారు.
Also Read : ముందస్తు ఎన్నికలకు రెడీ అవ్వండి: స్టాలిన్ సంచలనం..!
ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. అక్కుమహంతి రాజా అలియాస్ నాగేశ్వర్రావు గతంలో వైసీపీలో పని చేసిన విషయాలను కూడా తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. మచిలీపట్నంలో ఏలూరి రంగ అనే వ్యక్తికి చెందిన సుమారు 30 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించి కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఫిర్యాదుతో అక్కుమహంతి రాజా పై డీజీపీ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశారు. ఇలాంటి వ్యక్తికి శిష్ట కరణాల కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇప్పించేందుకు మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.
ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే.. శిష్ట కరణాల సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో మాత్రమే స్థిరపడ్డారు. వీరు ఒడిశా ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వలస వచ్చారు. వీరు ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో స్థిరపడ్డారు. వీరు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో చాలా అరుదుగా కనిపిస్తారు. ఉత్తరాంధ్ర ప్రాంతంతో పోలిస్తే.. లేరనే చెప్పాలి. ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం 20 కుటుంబాలు కూడా లేవని శిష్ట కరణాల సామాజిక వర్గం నేతలు చెబుతున్నారు. అందుకే ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన వారికే ఇవ్వాలని ఆ సామాజిక వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. కానీ మంత్రి కొల్లు రవీంద్ర మాత్రం.. ఆ పదవిని అసలు సామాజిక వర్గం కానీ వ్యక్తి, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్కుమహంతి రాజాకు ఇప్పించాలని పట్టుబట్టడం ఏమిటనేది పార్టీ పెద్దల సూటి ప్రశ్న.

