ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా పోస్ట్ పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు వరుసగా నాలుగు కేసుల్లో కోర్టుల నుండి బెయిల్ మంజూరు కావడం ఇప్పుడు కూటమి ప్రభుత్వ లాయర్ల సామర్థ్యంపై పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తోంది. పిఠాపురం, సర్పవరం, మచిలీపట్నం, పాయకరావుపేట పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో నిందితుడిని కనీసం రిమాండ్ కు కూడా పంపించలేకపోవడం వెనుక ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుల్లో బలమైన వాదనలు వినిపించడంలో పూర్తిగా విఫలమయ్యారనే టాక్ వినిపిస్తోంది.
Also Read : నాడు లేవని నోళ్ళు ఇప్పుడెందుకు లేస్తున్నాయి..?
పోలీసులు కష్టపడి ఆధారాలు సేకరించి నిందితుడిని పట్టుకొస్తుంటే, లాయర్లు కోర్టులో కేసును నిలబెట్టలేకపోతున్నారనే అసంతృప్తి కూటమి శ్రేణుల్లోనే వ్యక్తమవుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంతో పోల్చి చూస్తే.. ప్రస్తుత ప్రభుత్వ లాయర్ల తీరు ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతుందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమకు వ్యతిరేకంగా చిన్న పోస్ట్ పెట్టినా, జర్నలిస్టులు లేదా విపక్ష నేతలను అరెస్ట్ చేసిన వెంటనే వారికి కోర్టుల్లో ఖచ్చితంగా రిమాండ్ పడేలా ప్రభుత్వ లాయర్లు పక్కా వ్యూహంతో వాదనలు వినిపించేవారు.
Also Read : వైసీపీ టూ బీజేపీ.. మార్పుల వేళాయే..!
నిందితులకు సులభంగా బెయిల్ రాకుండా ప్రభుత్వ న్యాయవాదులు సాంకేతిక, చట్టపరమైన ప్రతిబంధకాలను కోర్టుల ముందు బలంగా ఉంచేవారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత భారీ వివాదం రేపిన యూట్యూబర్ విషయంలో లాయర్లు ఉదాసీనంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ఒక కేసులో బెయిల్ రాగానే పోలీసులు గేటు బయట వేచి ఉండి, మరో పాత కేసులో రావణ్ ను వరుసగా ఐదుసార్లు అరెస్ట్ చేయాల్సి రావడం వెనుక ప్రభుత్వ లాయర్ల వైఫల్యమే ప్రధాన కారణమనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
Also Read : నా దగ్గర ఏనుగు దంతాలున్నాయి: మోహన్ లాల్ సంచలనం..!
మొదటి లేదా రెండో కేసులోనే కోర్టులో బలమైన కౌంటర్లు వేసి, రిమాండ్ సాధించి ఉంటే పోలీసులకు ఈ వరుస అరెస్టుల తిప్పలు తప్పేవి. లాయర్లు కోర్టులో కేసులను సరిగ్గా డీల్ చేయలేకపోవడం వల్లే.. చివరికి పోలీసులు అత్యంత కఠినమైన ఉపా చట్టాన్ని ప్రయోగించి నిందితుడిని లోపల వేయాల్సి వచ్చిందని పొలిటికల్ టాక్ నడుస్తోంది. ఎన్నికల్లో ఘనవిజయం సాధించి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ, కీలకమైన కోర్టు కేసులలో, ముఖ్యంగా సోషల్ మీడియా అరాచకాలపై పోరాటంలో ప్రభుత్వ లాయర్ల సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని గ్రౌండ్ రిపోర్టులు చెబుతున్నాయి. వైసీపీ హయాంలో లాగా దూకుడుగా, చట్టబద్ధంగా కేసులను వాదించే గట్టి న్యాయవాదులను నియమించకపోతే.. భవిష్యత్తులో మరిన్ని కీలక కేసుల్లో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇకనైనా లీగల్ టీమ్ ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

