“ఇడుపు కాగితం”.. తెలుగు భాష సొబగు.. తెలంగాణా యాస స్వచ్ఛత.. తెలియజెప్పేలా ఉంది. సినిమాలకు తెలుగు పేర్లు కరువవుతున్న ప్రస్తుత తరుణంలో ఈ పేరు చూడగానే చాలా బాగుందనిపించింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా పేరు చుట్టూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. కొందరు ఈ పేరును వెటకారం చేస్తున్నట్లు పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమాకు సబ్ టైటిల్స్ ఏస్తారా..?.. డబ్బింగ్ ఉంటుందా..?.. అంటూ కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. అలా మాట్లాడుతున్నారంటే వాళ్లకు తెలుగు భాష పైన ఏ మాత్రం అవగాహన, కనీస జ్ఞానం కూడా లేదని తెలుస్తోంది. లేదంటే ప్రాంతీయ అహంకారం తలకెక్కిన పొగరైనా అయి ఉండాలి. అది ఏ మాత్రం మంచిది కాదు. మన దేశంలో రాష్ట్రానికి ఓ భాష, ప్రాంతానికి ఓ యాస, జిల్లాకు ప్రత్యేక మాండలికాలు ఉండటం భాష గొప్పదనానికి ప్రతీకగా భావించాలి.
Also Read : చివరి రోజుల్లో శ్రీలక్ష్మికి పోస్టింగ్.. అసలు కారణమేంటి?
“ఇడుపు కాగితం”.. ఈ పేరులో అచ్చమైన తెలంగాణ యాస, మాండలికం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ప్రాంతానికీ ఓ యాస ఉంది. ఉత్తరాంధ్ర యాస వేరు. గోదావరి జిల్లాల యాస వేరు. కోస్తాంధ్ర యాస వేరు. రాయలసీమ యాస వేరు. అలాగే తెలంగాణ తెలుగుకు కూడా తనదైన ప్రత్యేక శైలి ఉంది. గతంలో రాయలసీమ యాసలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇటీవల వచ్చిన పలాస, పెద్ది లాంటి సినిమాలు ఉత్తరాంధ్ర యాసలో ఉన్నాయి. గోదావరి యాసలో రంగస్థలం, చిత్తూరు యాసలో పుష్ప వచ్చాయి. తెలంగాణ యాసలో వచ్చిన సినిమాలకు లెక్కే లేదు. అంతమాత్రాన అది తెలుగు కాకుండా పోతుందా..?
దానికి సబ్ టైటిల్స్, డబ్బింగ్ అనే మాటలు ఇప్పుడు ఎందుకు అంటున్నారో అర్థం కావటం లేదు.
ప్రస్తుతం పరభాషా సినిమాలు ఎన్నో అదే పేరుతో తెలుగులో విడుదలవుతున్నాయి. కంగువ, ఆయలాన్, ఆరమ్ వెట్రుమై, ధురంధర్.. లాంటి సినిమాలపై లేని అభ్యంతరం “ఇడుపు కాయితం” సినిమా విషయంలో మాత్రమే ఎందుకు..?. ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఆ సినిమా తీస్తున్న నిర్మాతలు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు. నటిస్తోంది, దర్శకత్వం చేస్తోంది తెలంగాణ ప్రాంత వాసులు. వాళ్లకు ఎక్కడా ఆంధ్రా – తెలంగాణ అనే ఇబ్బంది మాత్రం లేదు. కానీ పనిగట్టుకుని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనుకునే కొంతమంది సన్నాసులే ఇలాంటి పనులు చేస్తుంటారనే మాట మాత్రం వాస్తవం. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనుకునే వారికి ఒకటే సలహా.. వెళ్లి ముందు యాస, భాష, మాండలికాల గురించి కాస్త చదువుకోవాలి. తర్వాత సినిమా చూడాలో వద్దో ఆలోచించుకోవాలి. అంతేకానీ సోషల్ మీడియాలో ఏది పడితే అది కూయకూడదు.
Also Read : యూఎస్ వీసా దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్..!
నిజానికి ఇడుపు కాగితం అంటే ఏదో కొత్త పదం కాదు.. పెండ్లి అయినంక భార్యాభర్తలు కలిసి ఉండలేమంటే, నలుగురు పెద్దలు కూసోని మాట్లాడి, సర్ది చెప్పి, ఇంక కుదరకపోతే ఇద్దరి అంగీకారంతో రాసుకునే కాగితమే “ఇడుపు కాగితం”. కోర్టులు, లాయర్లు అందుబాటులో లేని కాలంలో తెలంగాణ పల్లెల్లో పెద్దల సమక్షంలో జరిగిన సామాజిక పరిష్కారం. తెలంగాణ బతుకులు, తెలంగాణ ఆచారాలు తెలియనోళ్లకు ఇడుపు కాగితం కూడా విచిత్రంగానే కనిపిస్తుంది. సినిమాకు పేరు పెట్టుకున్నంత మాత్రాన ఎవరికీ నష్టం లేదు. మరి ఎందుకు అనవసర మాటలు.. అర్థం లేని విమర్శలు.అయితే మరక మంచిదే అన్నట్టుగా… సోషల్ మీడియాలో ఓ సినిమా గురించి జరిగే రచ్చ కూడా మంచిదే. నిర్మాతలకు బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ లభిస్తుంది.

