సీఎం చంద్రబాబు గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో అమిత్ షా నిజంగా తక్కువ చేసి మాట్లాడారా..? కానీ ఆయన ఏదో అన్నారనే కామెంట్‌లే సోషల్ మీడియాలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు అంటే బీజేపీ ఢిల్లీ పెద్దలకు లెక్క లేదా..? రాష్ట్రంలో ఉన్న కొంతమంది బీజేపీ నేతలు ఇప్పటికీ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో అంటకాగుతున్నారనేది బహిరంగ రహస్యం. ఇలాంటి వారికి ఢిల్లీ పెద్దల అండ ఉందని.. అందుకే వాళ్లు ఇప్పటికీ చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీ నేతలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారనే మాట తెలుగు తమ్ముళ్లు బలంగా నమ్ముతున్నారు కూడా.
Also Read : మంత్రి గారి ప్రేమ మామూలుగా లేదుగా..!
ఇక అసలు విషయం ఏమిటంటే.. ప్రస్తుతం చంద్రబాబు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. 2024 ఎన్నికల్లో చివరి నిమిషంలో టీడీపీ, జనసేన పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. వాళ్లు అడిగిన పది అసెంబ్లీ సీట్లు, 6 పార్లమెంట్ స్థానాలను చంద్రబాబు కేటాయించారు. వైసీపీ గెలిచిన మూడు పార్లమెంట్ స్థానాల్లో రెండు బీజేపీ అభ్యర్థులు పోటీ చేసినవే. గతంలో చంద్రబాబుపై మోదీ సహా బీజేపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయినా సరే.. ప్రస్తుతం రాష్ట్రాభివృద్ధి కోసమే బీజేపీతో చంద్రబాబు చేతులు కలిపారు. రాష్ట్రానికి కాసిని నిధులు కేటాయించగానే.. వారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం చంద్రబాబును అంతగా నమ్ముతున్నట్లు లేదని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.
గతంలో చంద్రబాబును అక్రమ కేసుల్లో అరెస్టు చేసి ఏకంగా 53 రోజుల పాటు జైలులో ఉంచారు. ఆ సమయంలో ఏపీతో పాటు తెలుగు ప్రజలంతా వైసీపీ సర్కార్ పైన, జగన్ మోహన్ రెడ్డి తీరు పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు బదులు తీర్చుకోవాల్సిందే అనేది తెలుగు తమ్ముళ్ల డిమాండ్. నిజానికి జగన్‌పైన కొత్తగా కేసులు బనాయించాల్సిన అవసరం లేదు. ఎప్పుడో 2012లోనే సీబీఐ, ఈడీ కేసులు పెట్టింది. అప్పుడే 16 నెలలు జైలు జీవితం గడిపారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పైన బయట ఉన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కోరుకునేది ఒక్కటే. బెయిల్ రద్దు చేసి.. ఆయనపై నమోదైన అక్రమాస్తుల కేసులను విచారణ జరిపించాలంటున్నారు.
Also Read : ప్రొ. నాగేశ్వర్ అబద్ధాల డ్రామాపై దండయాత్ర..!
కానీ బీజేపీ పెద్దలు మాత్రం.. చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్‌తో కూడా మీరు జగన్ మోహన్ రెడ్డి గురించి వదిలేయండి.. కేవలం రాష్ట్రాభివృద్ధి గురించి మాత్రమే ఆలోచన చేయాలని సూచించినట్లు గతంలోనే సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇక తాజాగాకేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబు కంటే.. జగన్ తమకు నమ్మ తగిన మిత్రుడు అని పవన్‌తో అమిత్ షా అన్నారని.. ఆ సమయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా అక్కడే ఉన్నారని.. మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం పొలిటికల్ సర్కిల్‌లో సంచలనం రేపింది.
ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. అమిత్ షాతో పవన్, మనోహర్ ఎప్పుడు, ఎక్కడ కలిసారో కూడా చెప్పారు. ఈ మీటింగ్‌లో జగన్ అరెస్టు గురించి పవన్ ప్రస్తావించగా.. జగన్ తమకు లాంగ్ టర్మ్ మిత్రుడని, చంద్రబాబు ఇన్‌స్టంట్ మిత్రుడని షా వ్యాఖ్యానించారని నాగేశ్వర్ అన్నారు. అయితే నాగేశ్వర్ వ్యాఖ్యలపై పవన్ ఇప్పటి వరకు స్పందించలేదు.. కానీ మనోహర్ మాత్రం.. ఏదో ఒక మాట అనేసి ఊరుకున్నారు. నాగేశ్వర్ వ్యాఖ్యలపై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసులు కూడా పెడుతున్నారు. దీంతో ఆయన ఆ వ్యాఖ్యాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రత్యక్ష భాగస్వామి అయితే.. వైసీపీ పరోక్ష భాగస్వామి అనేది అందరికీ తెలిసిన విషయమే. మోదీ సర్కార్ తీసుకువచ్చిన ఎన్నో కీలక బిల్లులకు వైసీపీ నేతలు బేషరతుగా మద్దతు తెలిపారు. ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థికే ఓటు వేశారు. మరోవైపు కేంద్ర సర్కార్‌పైన బీజేపీ పెద్దల గురించి జగన్ ఇప్పటి వరకు పల్లెత్తు మాట కూడా అనలేదు.
నిజానికి వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కేంద్ర బీజేపీ పెద్దలతో వ్యవహరించిన తీరు అందరూ గమనించారు. పూర్తి మెజారిటీ ఇస్తే.. కేంద్రం మెడలు వంచి అయినా సరే..రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని ఎన్నికల ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కానీ ఫలితాలు వెల్లడైన తర్వాత తొలిసారి ఢిల్లీ వెళ్లిన జగన్.. అక్కడ మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు చెప్పిన జవాబు ఇప్పటికీ అందరికీ గుర్తే. కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేం కదా.. కలిసి పని చేయటం వల్లే ఏదైనా సాధించగలం.. అని ఢిల్లీ పెద్దలకు మద్దతు తెలిపారు. అలాగే మోదీ, అమిత్ షా సహా కేంద్ర మంత్రులు ఏపీకి వచ్చినప్పుడు.. వారికి పాదాభివందనాలు కూడా చేశారు. చంద్రబాబు అలా చేయరు కాబట్టి.. కాషాయ పెద్దలకు చంద్రబాబు కంటే జగన్ అంటేనే నమ్మకం అని పొలిటికల్ సర్కిల్‌లో టాక్. అందుకే 15 మంది ఎంపీలున్నా కూడా కేంద్ర మంత్రి వర్గంలో ఒకే ఒక్క క్యాబినెట్ మంత్రి పదవి.. అధి కూడా ప్రాధాన్యత లేని పౌర విమానయాన శాఖ కేటాయించారని విమర్శలు. టీడీపీని ఇన్‌స్టంట్ అని అమిత్ షా భావిస్తున్నారనేందుకు ఇదే ఉదాహరణ అని వ్యాఖ్యానిస్తున్నారు.

