తెలంగాణలో వర్షాకాలం ప్రారంభమై గోదావరి నదిలోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చుట్టూ మళ్లీ రాజకీయం వేడెక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నేపల్లి పంప్ హౌస్ మోటార్‌లను తక్షణమే ఆన్ చేసి, ఎగువనున్న రిజర్వాయర్లకు నీటిని ఎత్తిపోయాలనే డిమాండ్‌తో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేడిగడ్డ పర్యటనకు సిద్ధమయ్యారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతాంగానికి నీరు అందించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఈ టూర్‌ను ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసింది. గోదావరిలోకి భారీగా ఇన్-ఫ్లో వస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పై ఉన్న రాజకీయ కక్షతోనే కాళేశ్వరం మోటార్లను ఆన్ చేయడం లేదని కేటీఆర్ ఆరోపిస్తున్నారు.
Also Read : మాట నిలబెట్టుకున్న కూటమి సర్కార్.. రైతులకు గుడ్ న్యూస్..!
కన్నేపల్లి పంప్ హౌస్‌లోని మోటార్లు సురక్షితంగా ఉన్నాయని, వాటిని ఆన్ చేసి నీటిని పంప్ చేస్తే ఎండిపోతున్న ఆయకట్టుకు తిరిగి ప్రాణం పోయవచ్చని బీఆర్ఎస్ వాదిస్తోంది. కేసీఆర్ నిర్మించిన మహా అద్భుత ప్రాజెక్టును పనికిరానిదిగా చూపించేందుకే రేవంత్ రెడ్డి సర్కార్ కుట్రలు చేస్తోందని.. దీనిని ఎండగట్టడానికే తాము క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తున్నట్లు కేటీఆర్ చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ డిమాండ్‌ను పూర్తిగా తప్పుబడుతోంది. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన పిల్లర్ల వల్ల ప్రస్తుతం అక్కడ నీరు నిల్వ ఉంచడం ప్రమాదకరమని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిబంధనల ప్రకారం జూన్ 2027 నాటికి మాత్రమే పునరుద్ధరణ పనులు పూర్తవుతాయని స్పష్టం చేస్తోంది. కేటీఆర్ వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని కొట్టిపారేస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పుడు డిజైన్ల వల్లే మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయని.. ప్రస్తుతం సెంట్రల్ వాటర్ కమీషన్, ఎన్‌డీఎస్ఏ నిపుణుల ఆధ్వర్యంలో 13 రకాల కీలక సేఫ్టీ టెస్టులు నడుస్తున్నాయంటున్నారు హస్తం పార్టీ నేతలు. ఇలాంటి సాంకేతిక పరీక్షల సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా మోటార్లు ఆన్ చేసి నీటిని నిల్వ చేస్తే.. దిగువన ఉన్న భద్రాచలంతో పాటు 44 గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి రాజకీయం చేయాలని చూస్తే సహించేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరిస్తున్నారు.
Also Read : ట్రంప్ కు ఇరాన్ అదిరిపోయే ఆన్సర్..!
కాళేశ్వరం ప్రాజెక్టు రెండు పార్టీల మధ్య మరోసారి పొలిటికల్ వార్‌కు కేంద్రంగా మారింది. బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకోవడానికి, కేసీఆర్ మార్క్ ప్రాజెక్టు అంటూ మరోసారి ప్రజలకు వివరించేందుకు చలో మేడిగడ్డ అస్త్రాన్ని ప్రయోగిస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం టెక్నికల్ సేఫ్టీ రిపోర్టులను ముందుకు తెచ్చి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని, నిర్మాణ లోపాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. రాబోయే రోజుల్లో కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటారా లేదా శాంతిభద్రతల సమస్య రాకుండా పోలీసులు ఎలా వ్యవహరిస్తారనేది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

