సోషల్ మీడియా అనేది ప్రజలు ఆన్‌లైన్ ద్వారా సమాచారం, ఆలోచనలు, ఫోటోలు, వీడియోలను పంచుకోవడానికి, వర్చువల్ కమ్యూనిటీలను సృష్టించడానికి ఉపయోగించే డిజిటల్ ప్లాట్ ఫారం. ప్రపంచవ్యాప్తంగా దీనిని ఐదు బిలియన్ల మందికి పైగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారులపై సామాజిక మాధ్యమాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
Also Read : చంద్రబాబుతో ఏపీ బిజేపి చీఫ్.. ఆ ఒక్కటి నాకే ప్లీజ్..?
మానసిక సమస్యలు, పిల్లల్లో ఏకాగ్రత లోపించడం, నిద్ర లేమి, సైబర్ బెదిరింపుల బారిన పడే ప్రమాదం పెరుగుతోంది. వాటి ప్రభావం వల్ల తెలిసీ తెలియని వయస్సులో కొందరు పిల్లలు సరిదిద్దుకోలేని తప్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసింది. టిక్ టాక్, ఇన్టాగ్రామ్, యూ ట్యూబ్, ఫేస్బుక్, రెడిట్, స్నాప్ చాట్ తదితర సామాజిక మాధ్యమాలను వారు వినియోగించకూడదంటూ పాలసీ తీసుకొచ్చింది. ప్రపంచంలోనే ఈ తరహా నిబంధనలు అమలుచేస్తున్న తొలి దేశంగా నిలిచింది. మలేషియా, ఫ్రాన్స్, చైనా, యూకే, ఇటలీ, గ్రీస్, స్పెయిన్, టర్కీ, ఇండోనేషియా పోర్చుగల్ వంటి దేశాలు కూడా చిన్నారులకు సోషల్ మీడియాను పరిమితం చేసే చట్టాలను, నిబంధనలను పరిశీలిస్తున్నాయి.
ఫ్రాన్స్ లో ఇప్పటికే ప్రైమరీ, మిడిల్ స్కూళ్లలో ఫోన్లపై ఉన్న నిషేధాన్ని హైస్కూళ్లకు కూడా విస్తరించనున్నారు. ముఖ్యంగా 15 నుండి 18 ఏళ్ల లోపు వారికి రాత్రివేళల్లో ‘డిజిటల్ కర్ఫ్యూ’ విధించే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. అయితే దీనికి ఫ్రాన్స్ లోని సుమారు 79 శాతం మంది తల్లిదండ్రులు సమర్థిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. భారతదేశంలో సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్న వారిలో పిల్లలు, యువతే అధికం. అందువల్ల తక్షణమే ఈ తరహా విధానాన్ని తీసుకురావాల్సిన అవసరముందని కొందరు సోషల్ మీడియా వేదికగా వాదిస్తున్నారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇన్ఫూయెన్సర్లు కూడా ఈ చర్చల్లో భాగస్వాములవుతున్నారు. సినీనటుడు సోనూసూద్ కూడా ఈ విషయం పై స్పందించారు.16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ అవకాశాలను పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. భారత్ లో చిన్నారులకు సోషల్ మీడియాను నిషేధించాలన్న వాదనలు వినిపిస్తున్నప్పటికీ.. అది అంత సులభం కాదన్నది కొందరి వాదన. గణాంకాల ప్రకారం చాలామంది చిన్నారులు స్మార్ట్ ఫోన్ ల ద్వారానే సోషల్ మీడియాకు అనుసంధానం అవుతున్నారు. అది కూడా తల్లిదండ్రుల మొబైల్స్ నుంచే. 80 శాతం మంది రోజుకు మూడు గంటలకు పైగా వాట్సాప్, యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ చూస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. చాలావరకు తల్లిదండ్రుల ఖాతాలనే పిల్లలు వినియోగిస్తున్నారు. అందువల్ల ప్రత్యేకించి పిల్లల ఖాతాలపై బ్యాన్ విధించినా పెద్దగా ఫలితం ఉండదు. స్మార్ట్ ఫోన్ లలో పేరెంటల్ కంట్రోల్స్ ఆప్షన్ ఉన్నప్పటికీ.. ఈ తరం పిల్లలు సాంకేతికంగా చురుగ్గా ఉంటున్నారు. పేరెంట్స్ రిస్ట్రిక్షన్ ను తొలగించి మరీ.. నచ్చిన యాప్ లను ఇన్ స్టాల్ చేసుకుంటున్నారు. అందువల్ల దీంతో ప్రయోజనం అంతంతే.
Also Read : గ్రీన్ కార్డ్ ఆశావహులకు అమెరికా బిగ్ షాక్..!
కర్ణాటక బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు. 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై అనేక మంది స్పందించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందిస్తూ 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ విషయం తమ ప్రభుత్వం కూడా పరిశీలిస్తోందని తెలిపారు. అయితే భారతదేశంలో సోషల్ మీడియా నిషేధం సాధ్యమవుతుందా? డిజిటల్ నిపుణులు చెబుతోంది ఏంటంటే.. నిషేధం అమలు చేయడం కష్టమని. ఎందుకంటే భారత్ లో 25 కోట్ల మైనర్లు సోషల్ మీడియా వాడుతున్నారనే అంచనా ఒకటి ఉంది. అంతేకాదు.. భారతదేశంలో డిజిటల్ మానిటరింగ్ బలహీనంగా ఉందని. సోషల్ మీడియా వాడకాన్ని ఆరోగ్యకరంగా ప్రోత్సహించడం మంచిదని సూచిస్తున్నారు. పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉన్నప్పటికీ, పూర్తిగా నిషేధం కంటే నియంత్రణ, అవగాహన అవసరమని నిపుణులు భావిస్తున్నారు. అయితే బిజీ లైఫ్ లో ఇటు భారత్ లో అలాంటి నిషేధం వద్దని చాలా మంది తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.
సామాజిక మాధ్యమ ఖాతాదారుల వయస్సును కృత్రిమమేధ..ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ తో అంచనా వేసి, అసభ్య, అవాంఛిత కంటెంట్ ను పిల్లలకు అందకుండా చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వినియోగదారుల వయసును బట్టి కంటెంట్ కు నియంత్రణలు ఉండేలా ప్లాట్ఫామ్స్ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వాలు ఈ విషయంలో కఠిన చట్టాలు తీసుకురావాలి. నిబంధనలు పాటించడంలో విఫలమైతే ప్లాట్ ఫామ్స్ పైనే బాధ్యత మోపాలి. అయితే ప్రభుత్వాలు, సోషల్ మీడియా వేదికలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నేటి సాంకేతిక యుగంలో వాటన్నింటినీ దాటేసే అవకాశం లేకపోలేదు. భారత్ లో చిన్నారులు సోషల్ మీడియా వాడకుండా నిషేధించడం తమ పరిధిలో లేదని సర్వోన్నత న్యాయస్థానం ఇది వరకే తేల్చి చెప్పింది. ఇది చట్టపరిధిలోని అంశమని స్పష్టం చేసింది. అంతేకాదు 13-18 ఏళ్ల లోపు పిల్లల సోషల్ మీడియా అకౌంట్ల పర్యవేక్షణ తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండేలా చూడాలన్న అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చింది.
Also Read : పాక్ బౌలర్ కు ఐపిఎల్ ఎంట్రీ క్లియర్..?
భారత్ లో మైనర్లు సోషల్ మీడియా వాడకూడదనే రూల్ ఏం లేదు. రాజకీయ కోణం, ఇక్కడి జనాభా, సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ జరిపే వ్యాపారాలను పరిగణనలోకి తీసుకుంటే అది సాహసమనే చెప్పాలి. అయితే కేంద్ర ప్రభుత్వం 2023లో డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం 2023 ఆధారంగా 2025 లో నోటిఫై చేసింది. ఈ నియమాల ప్రకారం 18 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల లేదా లీగల్ గార్డియన్ అనుమతి తప్పనిసరి. సోషల్ మీడియా కంపెనీలు పిల్లల డేటా సేకరణ, వినియోగం, షేరింగ్ పై కఠిన నియంత్రణలు పాటించాలి. ఉల్లంఘన జరిగితే కంపెనీలకు రూ.250 కోట్లు వరకు జరిమానా విధించవచ్చు. అయితే.. ఇది సక్రమంగా అమలు కావడం లేదు.
ఏది ఏమైనప్పటికీ నేటి టెక్నాలజీ యుగంలో డిజిటల్ మీడియా వినియోగం పిల్లల్లో, యువకుల్లో ఒక వ్యసనంగా మారింది అనడంలో అతిశయోక్తి లేదు. కట్టడి చేయవలసిన బాధ్యత అటు ప్రభుత్వాల పైన, ఇటు తల్లిదండుల పైన ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

