Monday, April 20, 2026 08:01 PM
Monday, April 20, 2026 08:01 PM

స్లీపర్ బస్సుల నిషేధం సాధ్యమేనా..?

ప్రయాణీకులు ఇప్పుడు సౌకర్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రజలు.. ఇప్పుడు మాత్రం, సమయం, సౌకర్యం వైపే మొగ్గు చూపిస్తున్నారు. అందుకే గతంలో నైట్ సర్వీసులు ఎక్స్‌ప్రెస్‌లు, సూపర్ లగ్జరీ బస్సులు మాత్రమే ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం స్లీపర్ బస్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు ఏసీ అదనం. ఉంటే స్లీపర్ అయినా ఉండాలి.. లేదా ఏసీ అయినా ఉండాలి.. లేదంటే ప్రయాణమే రద్దు చేసుకునేందుకు కూడా వెనుకడుగు వేయటం లేదు. కొంతమంది సుఖం అంటుంటే.. కొంతమంది సౌకర్యం అంటున్నారు. ఏది ఏమైనా డబ్బు కంటే కూడా సుఖం వైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారనేది స్పష్టం.

Also Read : తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి సీఎం చంద్రబాబు

ప్రస్తుతం దాదాపు అన్ని ప్రైవేటు ట్రావెల్స్ కూడా ఏసీ, స్లీపర్ బస్సులను నడిపిస్తున్నాయి. ముందుగా సీటింగ్ బస్సుల్లో స్లీపర్ బెర్తులను ఆల్ట్రేషన్ చేసి నడిపించారు. కానీ ఇప్పుడు మాత్రం నేరుగా కంపెనీలో స్లీపర్ బస్సులను తయారు చేస్తున్నాయి. ఇప్పుడు మార్కెట్‌లో వీటికే డిమాండ్ ఎక్కువ. దూర ప్రాంత ప్రయాణాలకే కాదు.. 4, 5 గంటల ప్రయాణానికి కూడా ఏసీ, స్లీపర్, వేగం అనే అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ప్రతిరోజు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా అన్ని ప్రధాన నగరాల నుంచి కూడా బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై వంటి దూర ప్రాంతాలకు ఏసీ స్లీపర్ బస్సులే ఎక్కువగా నడుస్తున్నాయి.

ఇప్పుడు ఈ స్లీపర్ బస్సులను ఏపీలో నిషేధించాలనే ప్రతిపాదన సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. గతేడాది అక్టోబర్ 24వ తేదీన కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి కావేరీ ట్రావెల్స్ స్లీపర్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 21 మంది సజీవ దహనం అయ్యారు. ఈ ఏడాది మార్చి 26వ తేదీన మార్కాపురం జిల్లా రాయవరం వద్ద ఓ ట్రావెల్స్ బస్సు టిప్పర్‌ను ఢీ కొట్టిన ప్రమాదంలో 14 మంది సజీవ దహనం అయ్యారు. అలాగే పలు చోట్ల స్లీపర్ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. అయితే డ్రైవర్ల అప్రమత్తతతో ప్రయాణీకులు సురక్షితంగా బయటపట్టారు. ఈ ఘటనలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. ఇదే సమయంలో స్లీపర్ బస్సులను నిషేధించాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేసింది.

Also Read : ఏపీలో స్లీపర్ బస్సుల పై నిషేధం..?

స్లీపర్ బస్సులను ఏపీలో నిషేధించాలని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందింది. అయితే ఇది అంత సులభమైన విషయం కాదు. ప్రస్తుతం ఏపీలో నడుస్తున్న బస్సుల్లో చాలా వరకు ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగిస్తున్నవే ఎక్కువ. అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన బస్సులే ఎక్కువ. తెలంగాణ, నాగాలాండ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, పాండిచ్చేరి, అసోం రాష్ట్రాలకు చెందిన బస్సులే ఏపీలో ఎక్కువగా నడుస్తున్నాయి. అవి కూడా విశాఖ – భువనేశ్వర్, విశాఖ – హైదరాబాద్, విజయవాడ – బెంగళూరు, విజయవాడ – చెన్నై, విజయవాడ – భువనేశ్వర్, హైదరాబాద్ – భువనేశ్వర్, హైదరాబాద్ – బెంగళూరు, హైదరాబాద్ – చెన్నై మార్గాల్లో ఎక్కువగా తిరుగుతున్నాయి. వీటి యజమానులు చాలా వరకు ఏపీ వాసులే అయినప్పటికీ.. వీటి గమ్యస్థానం, కార్యాలయాలు మాత్రం ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువగా ఉన్నాయి.

ఇక స్లీపర్ బస్సులను రద్దు చేయాల్సిందే అన్నట్లుగా ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఇది అంత సులువైన విషయం ఏం కాదు. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో కూడా ఉన్న అంశం. కేంద్రం స్పందించకుండా ఇది సాధ్యమయ్యే అవకాశమే లేదు. ఇక మరో కీలక విషయం ఏమిటంటే.. ప్రమాదాలకు గురైన బస్సులు కంపెనీలు తయారు చేసినవి కాదు. వాటిని యజమానులు ఆల్ట్రేషన్ చేసి, రీ మోడల్ చేసిన బస్సులే ప్రమాదానికి గురవుతున్నాయి. ఓల్వో సహా పలు పలు సంస్థలే నేరుగా స్లీపర్ బస్సులను తయారు చేస్తున్నాయి. వీటి వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. కానీ రీ మోడల్ చేసిన బస్సుల వల్లే అసలు సమస్య.

Also Read : ఏపీకి మోదీ సర్కార్ వరాలు..!

ఓల్వో, స్కానియా, భారత్ బెంజ్ వంటి సంస్థలు సీటింగ్‌తో తయారు చేసిన బస్సులను యజమానులు రీ మోడల్ చేస్తున్నారు. వాటిల్లో సీట్లతో పాటు స్లీపర్ బెర్తులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీని వల్ల నిర్దేశించిన బరువు కంటే అధిక లోడ్‌తో ప్రయాణం చేస్తున్నాయి. పైగా ప్రస్తుతం నడుస్తున్న అన్నీ బస్సుల్లో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. రెండు రోజుల క్రితం హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ వద్ద తగలబడిన స్లీపర్ బస్సు కూడా ఏసీ సహా ఇంజన్‌లో సమస్య వల్లే మంటలు చెలరేగాయి. ప్రయాణ సమయానికి అరగంట ముందు నుంచే ఏసీ ఆన్ చేయటం.. దాదాపు రాత్రి అంతా ఏసీ నడుస్తూనే ఉండటం.. అలాగే బస్సు ఇంజన్ కూడా కాసేపు కూడా ఆఫ్ చేయకపోవటం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయనేది సాంకేతిక నిపుణుల మాట.

ఇక ప్రస్తుతం అంతర్రాష్ట్ర సర్వీసులుగా నడుస్తున్న ప్రైవేటు బస్సులు కాంట్రాక్టు క్యారియర్‌లుగా అనుమతి తీసుకున్నవే. ప్రస్తుతం “వన్ ఇండియా వన్ ట్యాక్స్” విధానం దేశవ్యాప్తంగా అమలులో ఉంది. అందుకే ఒక రాష్ట్రంలో పన్ను చెల్లించే బస్సులు మరో రాష్ట్రంలో తిరుగుతున్నాయి. దీంతో స్లీపర్ బస్సుల రద్దు అంశం మొత్తం కేంద్రం ఆధీనంలోనే ఉంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఏపీఎస్ ఆర్టీసీ సైతం వెన్నెల, స్టార్ లైనర్ పేరుతో స్లీపర్, సీట్ కమ్ స్లీపర్ బస్సులను నడిపిస్తోంది. మరి ఈ బస్సులను కూడా ఆర్టీసీ రద్దు చేస్తుందా.. ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పెయిడ్ ఆర్టిస్ట్ కోసం...

ఇద్దరు ముఖ్యమంత్రులను దూషించిన వ్యక్తి పై...

విజయ్‌ ఆస్తుల పంచాయితీ.....

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ టీవీకే...

బీఆర్ఎస్‌లో ముసలం.. హరీష్...

గులాబీ పార్టీలో ముసలం మొదలైందా..? జీవన్...

షర్మిలపై మాజీ ఎమ్మెల్యే.....

ఏపీ రాజకీయాల్లో మాటల యుద్ధం మరోసారి...

అన్నం తింటే భరించలేని...

ఏపీ సిఎం చంద్రబాబు పుట్టిన రోజు...

తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి...

ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అభ్యర్థుల విజయానికి...

పోల్స్