గత ప్రభుత్వ హయాంలో తనపై అక్రమంగా కేసులు బనాయించడంతో పాటు, మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చి తన ప్రతిష్టను దిగజార్చారంటూ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా అప్పటి కీలక అధికారులు, రాజకీయ ప్రముఖులతో సహా మొత్తం 11 మందికి ఆయన పరువు నష్టం నోటీసులు పంపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి తనను మానసిక వేదనకు గురిచేశారని ఆయన ఈ నోటీసుల్లో పేర్కొన్నారు.
Also Read : జగన్ మెప్పు కోసం సాయిరెడ్డి కొత్త డ్రామా..?
ఈ లీగల్ నోటీసులు అందుకున్న వారిలో అప్పటి డీజీపీ గౌతం సవాంగ్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, అప్పటి ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ వంటి ఉన్నతాధికారులు ఉన్నారు. వీరితో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాజీ సీపీఆర్వో పూడి శ్రీహరిపై కూడా ఆయన న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. వీరంతా కలిసి కుట్రపూరితంగా వ్యవహరించి తన వృత్తిపరమైన గౌరవానికి భంగం కలిగించారని ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపించారు.
Also Read : కల్తీ నెయ్యి కేసు.. దినేష్ రిపోర్ట్ రెడీ..!
తన పరువుకు భంగం కలిగించినందుకు గానూ, ఒక్కొక్కరు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పుడు సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీక్ చేయడం ద్వారా తన వ్యక్తిత్వాన్ని హననం చేశారని, దీనివల్ల తాను తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యానని నోటీసుల్లో వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ స్థాయిలో మాజీ ఉన్నతాధికారులపై లీగల్ నోటీసులు రావడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై నోటీసులు అందుకున్న మాజీ అధికారులు, రాజకీయ నేతలు ఏ విధంగా స్పందిస్తారో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సుదీర్ఘ కాలం పాటు న్యాయపోరాటం చేసిన ఏబీ వెంకటేశ్వరరావు, ఇప్పుడు ఈ డిఫేమేషన్ కేసుల ద్వారా సంచలనం సృష్టించారు.

