గుంటూరు జిల్లా రాజకీయాలు ఇప్పుడు అధికార పక్షమైన టీడీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. జిల్లాకు చెందిన ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్యవహారశైలి, వారి నియోజకవర్గాల్లో జరుగుతున్న కొన్ని పరిణామాలు పార్టీ అంతర్గత వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా మట్టి, మైనింగ్, రేషన్ మాఫియా వంటి వ్యవహారాల్లో కొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండటం జిల్లా రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. వీరిలో ఒక నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే పరిధిలో విచ్చలవిడిగా అడ్డగోలు మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Also Read : చంద్రబాబుతో ఏపీ బిజేపి చీఫ్.. ఆ ఒక్కటి నాకే ప్లీజ్..?
ఈ వ్యవహారంలో స్థానిక సొంత పార్టీ నేతల మధ్యే తీవ్ర విభేదాలు తలెత్తాయని సమాచారం. ఎమ్మెల్యే అనుచరులు చేస్తున్న అక్రమాలపై పార్టీ కేడర్ లోనే తీవ్ర అసంతృప్తి నెలకొంది. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించేలా ఉన్న సదరు ఎమ్మెల్యే తీరుపై పార్టీ అధిష్టానానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది. మరో నియోజకవర్గంలో పరిస్థితి చూస్తే, అక్కడ పూర్తిస్థాయిలో కుటుంబ ఆధిపత్యం నడుస్తోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఏ చిన్న పని జరగాలన్నా ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరి అయిందట.
Also Read : ఇన్స్టంట్ ఫ్రెండ్ వర్సెస్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్.. ఏపీకి మేలు ఎవరితో..?
దీనివల్ల ఎన్నో ఏళ్ల తర్వాత పార్టీ గెలిచినా స్థానిక నాయకులకు కనీస ప్రాధాన్యత దక్కడం లేదన్న బాధ వారిలో వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే ఈ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోకపోవడం, వెనుక అంతా కుటుంబ సభ్యులే నడిపిస్తుండటం లోకల్ లీడర్స్, కేడర్ కు తీవ్ర చిరాకు తెప్పిస్తోంది. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. నియోజకవర్గాల్లో పాలన, ప్రజాప్రతినిధుల ప్రవర్తనపై పార్టీ అధిష్టానం ప్రత్యేక నిఘా ఉంచిందని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

