బెంగళూరు నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా తన ఓటు హక్కును అక్రమంగా తొలగించారంటూ ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. తాను పుట్టి, పెరిగి, చదువుకుని, గతంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రాంతంలోనే ఓటు తొలగించడంపై ఆయన సాషల్ మీడియాలో వీడియో షేర్ చేస్తూ “ఇదొక మంచి జోక్.. గేమ్ ఆన్” అంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బెంగళూరు సెంట్రల్ పరిధిలోని శాంతినగర నియోజకవర్గంలో తనతో పాటు సుమారు 65 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయని ఆయన ఆరోపించారు.
Also Read : బాలినేని – దామచర్ల వివాదంపై అధిష్ఠానాల సీరియస్ ఫోకస్..!
అయితే ప్రకాశ్ రాజ్ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం తీవ్రంగా ఖండించింది. బెంగళూరు సెంట్రల్ సిటీ కార్పొరేషన్ కమిషనర్ మరియు అడిషనల్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ జగదీష్ జి ఈ వ్యవహారంపై స్పష్టమైన అధికారిక వివరణ ఇచ్చారు. ప్రకాశ్ రాజ్ ఓటును తాము ఏకపక్షంగా తొలగించలేదని, చట్టపరమైన నిబంధనలకు కట్టుబడే ఈ చర్య తీసుకున్నామని స్పష్టం చేశారు. ఓటర్ ఐడీలో నమోదైన చిరునామాకు బూత్ లెవెల్ అధికారులు స్వయంగా వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేయగా, ఆయన గత నాలుగేళ్లుగా ఆ అడ్రస్‌లో నివసించడం లేదని తేలిందన్నారు.
Also Read : స్టార్ హీరోల నెక్స్ట్ లైనప్ ఏమిటి..?
అక్కడ ఉన్న ప్రాపర్టీ మేనేజర్ కూడా ప్రకాశ్ రాజ్ ఇల్లు మారిన విషయాన్ని ధృవీకరించడంతో, నిబంధనల ప్రకారం ఆయన ఓటును “శాశ్వతంగా బదిలీ అయ్యారు” అనే కేటగిరీ కింద మార్చడం జరిగిందని వివరించారు. ఎన్నికల అధికారులు స్వయంగా ప్రకాశ్ రాజ్‌తో ఫోన్ ద్వారా మాట్లాడగా.. తాను ప్రస్తుతం ఆ పాత చిరునామాలో ఉండటం లేదని, అదే శాంతినగర నియోజకవర్గంలోని వేరే అడ్రస్‌లో నివసిస్తున్నట్లు ఆయనే స్వయంగా అంగీకరించారని ఈసీ వెల్లడించింది. ప్రస్తుత చిరునామా ఆధారంగా కొత్తగా ఫామ్-6 సమర్పించి మళ్లీ ఓటు హక్కును నమోదు చేసుకోవచ్చని అధికారులు ఆయనకు సూచించారు. కాబట్టి ప్రకాశ్ రాజ్ చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఈసీ కొట్టిపారేసింది.

