ఏపీ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకున్న తల్లికి వందనం పేరుతో సైబర్ మోసగాళ్ళు రెచ్చిపోతున్న నేపధ్యంలో.. ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. దీనిపై తాజాగా.. జిల్లా ప్రజలు ఇంటర్నెట్‌లో వచ్చే నకిలీ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పలు సూచనలు చేసారు. ముఖ్యంగా ‘తల్లికి వందనం’ పథకం పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెరలేపినట్లు ఆయన వెల్లడించారు. ఈ పథకానికి లబ్ధిదారుల ఎంపిక, నగదు జమ అంటూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని నకిలీ లింకులు విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి.
Also Read : ఉత్తరాంధ్రకు కొత్త యుగం.. ఆగస్టు 1న భోగాపురం ప్రారంభం
ఇలాంటి మోసపూరిత లింకుల పట్ల ప్రజలు, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. మొబైల్ ఫోన్లకు లేదా వాట్సాప్ గ్రూపులకు తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఎలాంటి అపరిచిత లింకులను క్లిక్ చేయవద్దని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే పథకాలకు సంబంధించిన సమాచారాన్ని సరిచూసుకోవాలని కోరారు. సైబర్ కేటుగాళ్లు పంపే లింకులను ఓపెన్ చేయడం ద్వారా ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందన్నారు.
Also Read : తమ్మినేని చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!
అంతేకాకుండా మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ నంబర్ వంటి వ్యక్తిగత వివరాలను వాటిలో నమోదు చేయవద్దని హెచ్చరించారు. బ్యాంకుల నుండి లేదా ప్రభుత్వ అధికారులమంటూ ఎవరైనా ఫోన్ చేసి అడిగినా.. మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ నంబర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరితోనూ పంచుకోవద్దని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తేల్చి చెప్పారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ మోసాలకు గురైతే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన జిల్లా వాసులకు విజ్ఞప్తి చేశారు.

