అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణం కోసం సేకరించిన విరాళాల దుర్వినియోగం వ్యవహారం రాజకీయంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఉదంతంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనం వహించడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోట్లాది మంది హిందువుల విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే ఈ పవిత్ర క్షేత్రంలో అవినీతి జరగడం దారుణమని, దీనిని ప్రధాని ఏ విధంగా సమర్థించుకుంటారని హస్తం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. భక్తుల నమ్మకాలను వమ్ము చేస్తూ జరుగుతున్న ఈ దోపిడీపై మోదీ స్పందించకపోవడం దేశంలోని ప్రజల మత విశ్వాసాలపై చేస్తున్న ప్రత్యక్ష దాడిగా జైరామ్ రమేష్ అభివర్ణించారు. ఆర్ఎస్ఎస్ సభ్యులతో కూడిన ట్రస్టును నియమించి, ఎటువంటి ప్రజా సంప్రదింపులు లేకుండా వ్యవహరించడం వెనుక ఉన్న మతలబు ఏమిటో ప్రభుత్వం వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ అయోధ్య పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వేడిని మరింత పెంచాయి.
Also Read : రిజిస్టర్ మ్యారేజ్ చెల్లదు: హైకోర్ట్ సంచలన తీర్పు
శ్రీ రాముని ఆశీస్సులు కోరేందుకు తన ప్రతినిధి బృందంతో కలిసి అయోధ్య నగరాన్ని సందర్శించేందుకు వెళ్లిన అజయ్ రాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. రాయ్‌ను అదుపులోకి తీసుకోవడం నిరంకుశత్వానికి పరాకాష్ట అని హస్తం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం ద్వారా అవినీతిని కప్పి పుచ్చుకోవాలని యత్నిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని కాంగ్రెస్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ప్రస్తుత శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుపై నమ్మకం లేదని, దానిని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ భారీ కుంభకోణం వెనుక ఉన్న అసలైన వ్యక్తులను గుర్తించేందుకు ఉన్నతస్థాయి విచారణ అవసరమంటున్నారు.
Also Read : భవిష్యత్ ఏపీ కోసం బాబు భారీ ప్రణాళిక..!
అయోధ్యకు చెందిన ఫైజాబాద్ బార్ అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం ఈ వ్యవహారంలో కీలక మలుపుగా మారింది. నిందితులకు మద్దతుగా ఎవరూ వాదించకూడదని తీర్మానించడం ద్వారా న్యాయవాదులు తమ నిరసనను వ్యక్తం చేశారు. సీబీఐ విచారణ కోరుతూ కోర్టును ఆశ్రయించడానికి కూడా వారు సిద్ధమయ్యారు. బీజేపీపై సమాజ్ వాదీ పార్టీ కూడా తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించింది. శ్రీరాముని పేరుతో అక్రమాలకు పాల్పడటం ద్రోహంతో సమానమని అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యానించారు. రామ మందిర నిర్మాణాన్ని ఎన్నికల నినాదంగా వాడుకున్న ఆ పార్టీ, ఇప్పుడు భక్తుల విశ్వాసంతో చెలగాటం ఆడుతోందన్నారు.
బీజేపీ ఈ విమర్శలను తిప్పికొడుతూ కఠినమైన వైఖరిని ప్రదర్శిస్తోంది. దోపిడీకి పాల్పడిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరని, ప్రభుత్వం ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేసిందని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. ఎనిమిది మందిని అరెస్టు చేయడం ద్వారా చర్యలకు వెనుకాడమని నిరూపించుకున్నామని వాదిస్తున్నారు. ఎటువంటి పరిస్థితులలోనూ తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. జూన్ 13న ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వేగంగా స్పందించిన పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రతిపక్షాలు ఈ అరెస్టులను తక్కువ చేస్తున్నాయి. ప్రధాన దోషులు చక్రం తిప్పుతుంటే.. చిన్నస్థాయి ఉద్యోగులను బలి పశువులను చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Also Read : రంగంలోకి రేవంత్ టీమ్.. రెడీ..!
అయోధ్య ఇప్పుడు కేవలం ఒక పుణ్యక్షేత్రంగానే కాకుండా, రాజకీయ అస్త్రంగా కూడా మారిపోయింది. రామ మందిరానికి సంబంధించిన ప్రతి విషయం కూడా దేశవ్యాప్త చర్చకు దారి తీస్తోంది. వేసవి సెలవుల తర్వాత సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం ఈ కేసు గమనాన్ని నిర్ణయించనుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుందనే నమ్మకంతో ఒకవైపు, వ్యవస్థలపై అనుమానంతో మరోవైపు ప్రజలు ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. నిజం ఏంటనేది నిగ్గుతేల్చాల్సిన బాధ్యత ఇప్పుడు న్యాయవ్యవస్థపైనే ఉందనేది స్పష్టమవుతోంది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది.

