టీమిండియా ఆటగాళ్ల ఎంపిక విధానం మరియు నిరంతర సిరీస్ ల నిర్వహణపై భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ బీసీసీఐపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వర్క్ లోడ్ పేరుతో సీనియర్ ఆటగాళ్లకు తరచూ విశ్రాంతినిస్తూ, జట్టులోకి ఎవరిని పడితే వారిని తీసుకోవడం వల్ల దేశం తరఫున ఆడే ఇండియా క్యాప్ గౌరవం మరియు విలువ తగ్గిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన వన్డే సిరీస్ ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన అనంతరం గవాస్కర్ ఒక ప్రముఖ పత్రిక కాలమ్ లో ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read : రేవంత్ సర్కార్ దెబ్బకు దిగి వచ్చిన ఎస్బీఐ..!
“భారత క్రికెట్‌లో అపారమైన ప్రతిభ ఉంది, ఆటగాళ్లను మార్చడం మంచిదే. కానీ, జట్టులో ఖచ్చితంగా ఉండాల్సిన ఒక సీనియర్ ప్లేయర్ కు రెస్ట్ ఇచ్చి, ఆ స్థానంలో మరొకరిని రీప్లేస్ చేసినంత మాత్రాన వారికి ఇండియా క్యాప్ ఇచ్చేయకూడదు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం అనేది కష్టపడి సంపాదించుకునే గౌరవంగా ఉండాలి కానీ, ఇలా సులువుగా ఇచ్చేసేది కాకూడదు” అని గవాస్కర్ స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడాన్ని గవాస్కర్ తప్పుబట్టారు.
“గాయాల వల్ల తప్ప, మిగిలిన సమయాల్లో భారత్ బరిలోకి దిగుతుందంటే అత్యుత్తమ జట్టునే ఆడించాలి. బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ ఈ మ్యాచ్ ఆడి ఉంటే తన కెరీర్ రికార్డులో మరో 5 లేదా 10 వికెట్ల మైలురాయిని చేరేవాడు కదా” అని ప్రశ్నించారు. యువ ప్రతిభను పరీక్షించాలనుకుంటే దానికి ఇండియా-ఎ జట్లు, అండర్-19 మ్యాచ్ లు సరైన వేదికలని గవాస్కర్ సూచించారు. అంతర్జాతీయ మ్యాచ్ లలో ప్రయోగాలు చేస్తూ సీనియర్లను పక్కన పెట్టడం సరికాదన్నారు.
Also Read : సొంత గూటికి రిషభ్ పంత్.. ఎంత లాస్ అంటే..!
క్రికెటర్ల శారీరక, మానసిక దృఢత్వం చాలా ముఖ్యమని గుర్తు చేస్తూ.. బిజీ షెడ్యూల్ వల్ల ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని గవాస్కర్ అన్నారు. సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లకు ఏడాదిలో కనీసం ఒక నెల రోజుల పాటు ఎలాంటి క్రికెట్ లేకుండా పూర్తి విశ్రాంతి ఇచ్చేలా బీసీసీఐ కొత్త రూల్ తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే సిరీస్‌లు పెట్టడం వల్ల మైదానాలు కూడా సగం ఖాళీగా దర్శనమిస్తున్నాయని, ఇది అభిమానులను కూడా నిరాశపరుస్తోందని హితవు పలికారు.

