ఐటీ రంగానికి హబ్ గా మారుతోన్న విశాఖకు కేంద్ర ప్రభుత్వం తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ నగర మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధిని మరింత బలోపేతం చేసే దిశగా సరికొత్త అడుగు పడింది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదించిన మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ అపెక్స్ కమిటీ ఈ ప్రాజెక్టులను అర్బన్ ఛాలెంజ్ ఫండ్ పథకం కింద ఆమోదిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
Also Read : 59 ఏళ్ళ తర్వాత కేబినేట్ లోకి కాంగ్రెస్..!
ఈ వివరాలను విశాఖ ఎంపీ శ్రీ భరత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీనితో విశాఖ నగరంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న మధురవాడ ప్రాంతంలో ఆధునిక అండర్ గ్రౌండ్ డ్రైనేజి వ్యవస్థను నిర్మించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం కేంద్రం ఏకంగా రూ. 658.61 కోట్లు మంజూరు చేసింది. దీనివల్ల రాబోయే రోజుల్లో ఆయా పరిసర ప్రాంతాల్లో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. అలాగే అదే మధురవాడ జోన్ లో నిరంతరాయంగా, సరికొత్త సాంకేతికతతో రక్షిత మంచినీటిని అందించేందుకు రూ. 725.18 కోట్లతో స్మార్ట్ తాగునీటి సరఫరా వ్యవస్థ ప్రాజెక్టును కూడా చేపట్టనున్నారు.
Also Read : కేబినేట్ ప్రక్షాళనకు మోడీ ప్లాన్.. తెలంగాణాకు పెద్ద పీట..?
వీటితో పాటు నగరవ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిగే వాటర్ సప్లై చెయిన్ ను ఆధునీకరించేందుకు జీవీఎంసీ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. పాతబడిన పైప్ లైన్ల మార్పు, సరఫరా సామర్థ్యం పెంపు కోసం రూ. 117.24 కోట్లతో బల్క్ అండ్ సెమీ-బల్క్ నీటి సరఫరా వ్యవస్థ ఆధునీకరణ ప్రాజెక్ట్ ను చేపట్టనున్నారు. కేంద్రం నుంచి ఏకకాలంలో భారీ నిధులు మంజూరు కావడం పట్ల నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే విశాఖ గ్లోబల్ సిటీగా మారేందుకు అవసరమైన మౌలిక వసతులు మరింత మెరుగవుతాయని ఎంపీ శ్రీభరత్ ధీమా వ్యక్తం చేశారు.

