అమెరికాలో స్థిరపడిన విదేశీ ఐటీ ఉద్యోగులకు, ముఖ్యంగా భారత ఐటీ నిపుణులకు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో భారీ షాక్ ఇచ్చింది. అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థలోకి వలసదారులు ప్రవేశించకుండా నియంత్రించేందుకు అధ్యక్షుడు ట్రంప్ ఒక సరికొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. ఈ వివాదాస్పద ఉత్తర్వుల ప్రకారం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇకపై ఖాతాదారుల ఇమ్మిగ్రేషన్ స్టేటస్ ను ఒక ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్ గా పరిగణించాల్సి ఉంటుంది.
Also Read : గన్నవరం రాజకీయం.. మళ్లీ మారుతున్న లెక్కలు..!
ఈ సరికొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రధానంగా హెచ్-1బీ వీసాపై పనిచేస్తున్న ఐటీ నిపుణులు, ఓపీటీ కింద శిక్షణ పొందుతున్న అంతర్జాతీయ విద్యార్థుల ఖాతాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. హోమ్ లోన్లు, కార్ లోన్లు లేదా క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే ముందు బ్యాంకులు వారి వీసాలను, లీగల్ స్టేటస్ ను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ట్రంప్ ఆదేశించారు. ఒకవేళ రుణం తీసుకున్న వ్యక్తిని దేశం నుండి డిపోర్ట్ చేస్తే, ఆ లోన్ రికవరీ కాదనే సాకుతో ట్రంప్ యంత్రాంగం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read : లింక్ డాక్యుమెంట్ల దోపిడీకి సర్కార్ బ్రేక్..!
ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై అమెరికాలోని వలసదారుల హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. చట్టబద్ధంగా వీసాలు పొంది, అమెరికా ఆర్థిక వ్యవస్థకు బిలియన్ల కొద్దీ పన్నులు చెల్లిస్తున్న ఐటీ నిపుణులను కూడా అనుమానితులుగా చూడటం వివక్షతో కూడుకున్నదని వారు మండిపడుతున్నారు. ట్రంప్ జారీ చేసిన ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను కోర్టుల్లో సవాలు చేస్తామని, దీనిపై న్యాయపరంగా గట్టిగా పోరాడుతామని పలు వలసదారుల సంఘాలు ఇప్పటికే స్పష్టం చేశాయి.

