మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించే లక్ష్యంతో విజయవాడలో జాతీయ సరస్ మేళా నిర్వహణకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. మేళా ఏర్పాట్లపై నగరంలోని పింగళి వెంకయ్య హాల్‌లో ఉన్నతాధికారులు తొలి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో నిర్వహించిన ఈ జాతీయ స్థాయి కార్యక్రమాన్ని విజయవాడకు తీసుకురావడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి.
Also Read : జనసేన గూటికి కీలక నేతలు.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్..!
ఇళ్ల వద్దే స్వయం ఉపాధితో ఉత్పత్తులు తయారు చేస్తున్న గ్రామీణ మహిళలకు కొనుగోలుదారులను నేరుగా చేరుకునే అవకాశం కల్పించడం మేళా ప్రధాన ఉద్దేశం. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 350కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు సుమారు 250 స్టాళ్లతో పాల్గొనే అవకాశం ఉంది. విక్రయాలతో పాటు వివిధ రాష్ట్రాల ఉత్పత్తులు, సంస్కృతులు, మహిళల విజయగాథలను పరిచయం చేసుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడనుంది.
విజయవాడలో దసరా శరన్నవరాత్రుల సమయంలో మేళా నిర్వహణకు ప్రాధాన్యం ఉంది. కనకదుర్గమ్మ దర్శనానికి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే నేపథ్యంలో ప్రదర్శనకు సందర్శకుల ఆదరణ లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, స్టాళ్ల నిర్వహణ, ఇతర మౌలిక సదుపాయాలపై సమీక్షా సమావేశంలో చర్చించారు.
Also Read : ఫామ్-6లో చిన్న మార్పు.. ఈసీ కొంప ముంచుతుందా..?
ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలన్న లక్ష్యానికి సరస్ మేళా తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మహిళలకు ఆర్థిక సహకారం, మార్కెట్ అనుసంధానం కల్పించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు ‘స్వయం ఏపీ’ బ్రాండ్‌ను ప్రతిపాదిస్తోంది. నాణ్యత, బ్రాండింగ్, ప్యాకేజింగ్‌పై సహకారం అందించి ఈ ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

