ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వేటు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లారు దానం నాగేందర్. అయితే సుప్రీంకోర్టుకు వెళ్లనని.. ఖైరతాబాద్ ఉపఎన్నికను నేరుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు దానం ముందు ప్రకటించారు. కానీ ఓ చాయిస్ ఉన్నప్పుడు ఎందుకు వదులుకోవడం అని పిటిషన్ వేశారు కానీ.. సుప్రీంకోర్టులో ఊరట లభించడం కష్టమేనన్న అభిప్రాయం ఇప్పుడు బలంగా ఉంది. చట్టపరంగా అనర్హత వేటు పడినప్పటికీ, తదుపరి జరిగే ఉపఎన్నికలో పోటీ చేయకుండా నిరోధించే నిబంధన ఏదీ లేదు కాబట్టి దానం నాగేందర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. ఈ పరిణామంతో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యం కాగా, ఇక్కడ రాజకీయ పరిస్థితులు పూర్తిగా దానం నాగేందర్ చుట్టూనే తిరుగుతున్నాయి.
Also Read : నానీ రిక్వస్ట్ కు రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్..!
ఖైరతాబాద్ నియోజకవర్గ చరిత్రను పరిశీలిస్తే.. పార్టీల సిద్ధాంతాల కంటే దానం నాగేందర్ వ్యక్తిగత ప్రభావమే ఇక్కడ ఎక్కువ పనిచేస్తుందని స్పష్టమవుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఏవైనా సరే.. నియోజకవర్గంలోని ప్రతి బస్తీ, డివిజన్ స్థాయి నేతలతో దానంకు దశాబ్దాలుగా ఉన్న ప్రత్యక్ష పరిచయాలు, బలమైన అనుచరగణమే ఆయన ప్రధాన బలం. ఖైరతాబాద్‌లో ప్రత్యేకంగా ఏ ప్రతిపక్షానికి బలమైన సంస్థాగత క్యాడర్ నిర్మాణం లేకపోవడంతో, దానం నెట్‌వర్కే ప్రధాన శక్తిగా నిలుస్తోంది. ఇక పార్టీల సమీకరణాల పరంగా చూస్తే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఖైరతాబాద్ సంప్రదాయబద్ధంగా పాత ఓటు బ్యాంకు ఉంది. దానం నాగేందర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగినప్పుడు.. ఆయన వ్యక్తిగత ఇమేజ్, బస్తీల్లో ఉన్న పట్టుకు తోడు కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు, శ్రేణులు ఏకమవుతాయి. దీనికి తోడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ యంత్రాంగం, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల హోడా తోడవటం దానం నాగేందర్‌కు ఉపఎన్నికలో భారీ అడ్వాంటేజ్ మారే అవకాశం ఉందనేది పొలిటికల్ ట్రెండ్స్ చెబుతున్నాయి.
ఈ పరిస్థితి ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు అతిపెద్ద సవాలుగా మారింది. ఖైరతాబాద్‌లో స్థానికంగా దానం స్థాయి బలమైన, నియోజకవర్గమంతా తెలిసి ఉన్న ప్రత్యామ్నాయ నాయకుడు బీఆర్ఎస్‌కు లేకపోవడం పెద్ద లోటు. గతంలో దానంను నమ్ముకునే అక్కడ బీఆర్ఎస్ రాజకీయం నడిచింది. ఇప్పుడు ఆయననే ఎదుర్కొని నిలబడటానికి బలమైన లోకల్ క్యాడర్, సమర్థుడైన అభ్యర్థి దొరకడం గులాబీ పార్టీకి కత్తిమీద సాము లాంటిదే. ప్రభుత్వ బలం, దానం పర్సనల్ క్యాడర్‌ను తట్టుకుని పోరాడటం బీఆర్ఎస్‌కు అంత తేలికైన విషయం కాదు. మరోవైపు భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా ఇక్కడ అంత ఆశాజనకంగా లేదు. గతంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్న సమయంలో మాత్రమే బీజేపీ ఈ నియోజకవర్గంలో విజయం సాధించగలిగింది. ఆ తర్వాత ఒంటరిగా పోటీ చేసిన ప్రతిసారి డిపాజిట్ కోల్పోవడం లేదా నామమాత్రపు ఓట్లకే పరిమితమైంది.
Also Read : బ్రేకింగ్: వైసీపీ కీలకనేతలపై రౌడీ షీట్ లు..!
హైదరాబాద్ నగర పరిధిలో ఉనికి ఉన్నప్పటికీ, ఖైరతాబాద్‌లోని స్థానిక బస్తీ ఓటర్లను ఆకట్టుకునే స్థాయి బలమైన కేడర్ గానీ, అభ్యర్థి గానీ బీజేపీకి కూడా అందుబాటులో లేరు. ఖైరతాబాద్ ఉపఎన్నిక అనివార్యమైన వేళ, మిగిలిన ప్రతిపక్షాల వద్ద గట్టి అభ్యర్థులు, బలమైన క్యాడర్ లేకపోవడం దానం నాగేందర్‌కు ప్లస్ పాయింట్‌గా మారుతోంది. చట్టపరమైన తీర్పు దానంకు ప్రతికూలంగా వచ్చినా, ప్రజాక్షేత్రంలో మాత్రం అధికార పార్టీ బలం, తన సొంత ఇమేజ్, స్థానిక బస్తీ ఓటర్ల మద్దతుతో ఆయన మరోసారి విజయం సాధించే అవకాశాలే మెండుగా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

