తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి. పదేళ్లు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి అలియాస్ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలనే కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసింది. ముఖ్యంగా గులాబి పార్టీ కీలక నేతల మూలాలను దెబ్బ తీయటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ముందుగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆస్తులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. వందల ఎకరాలను అక్రమంగా సంపాదించారని అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు. దీనిపై ఇప్పటికే రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు.. కేసీఆర్ ఫామ్ హౌజ్ చుట్టూ సర్వే చేపట్టారు.
Also Read : ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు..!
కేసీఆర్ కుటుంబ ఆస్తులపై రేవంత్ ప్రకటన తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రంగంలోకి దిగారు. తమ కుటుంబానికి తాతల కాలం నుంచే వందల ఎకరాల ఆస్తులున్నాయన్నారు. అదే సమయంలో హైదరాబాద్‌లో సరైన ఇల్లు కూడా లేదు కాబట్టే.. కేసీఆర్ ఫామ్ హౌజ్‌లో ఉంటున్నారన్నారు. దీంతో కాంగ్రెస్ అభిమానులతో పాటు, మీడియా కూడా వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చే పనిలో నిమగ్నమయ్యాయి. కేసీఆర్ కుటుంబానికి హైదరాబాద్ నగరంలో ఉన్న ఆస్తుల వివరాలను వీడియో, ఫోటోలతో సహా బయటకు తీస్తున్నారు. కేటీఆర్ ఇంటి గురించి, కేసీఆర్ ఫామ్ హౌజ్ చుట్టూ ఉన్న చైనా వాల్ లాంటి కాంపౌండ్ వాల్ గురించి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు.
ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతల ఆస్తుల గురించి ఇప్పుడు చర్చ జోరుగా జరుగుతోంది. ఉద్యమ సమయంలో ఉన్న ఆస్తులు, పదేళ్లు పదవులు అనుభవించిన తర్వాత ఇప్పుడు వాళ్ల ఆస్తులు ఎంత అనే చర్చ బాగా జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్జీవో నేతగా వ్యవహరించిన శ్రీనివాసగౌడ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో విస్తృతంగా పాల్గొన్నారు. సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో తమకు జీతాలు కూడా సరిగ్గా రావడం లేదని.. దీని వల్ల కుటుంబాలు గడవటం కూడా చాలా ఇబ్బందిగా ఉందని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి కన్నీరు పెట్టుకున్నారు కూడా.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 మార్చి 12 వరకు ప్రభుత్వ ఉద్యోగం చేసిన శ్రీనివాసగౌడ్.. మార్చి 13న తన ఉద్యోగానికి రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి కండువా కప్పుకున్నారు. 2018లో రెండోసారి గెలిచిన శ్రీనివాసగౌడ్‌ను క్యాబినెట్లోకి తీసుకున్న కేసీఆర్.. ఆయనకు ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల మంత్రిత్వ శాఖలు కేటాయించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో 18 వేల ఓట్ల తేడాతో శ్రీనివాసగౌడ్ ఓడిపోయారు. అంటే మంత్రిగా సరిగ్గా నలుగున్నర సంవత్సరాలు పని చేశారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో శ్రీనివాసగౌడ్ ఉంటున్న ఇల్లు ఇంద్రభవనం మాదిరిగా ఉంది. ఆ ఇంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఓ యూ ట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఇంటిని ప్రత్యేకంగా, స్వయంగా చూపించారు శ్రీనివాసగౌడ్. దీంతో శీనన్న అడ్డంగా దొరికిపోయినట్లు అయ్యింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి,తెలంగాణ ఉద్యమాన్ని తన రాజకీయ ఎదుగుదలకు వాడుకుని రూ.40 కోట్ల విలువ చేసే విల్లాలో నివసించే స్థాయికి ఎదిగాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నయి. ఇంకా ఎన్ని ఆస్తులు సంపాదించాడో..? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఉద్యమం సమయంలో దసరా పండుగకు పిల్లలకు కొత్త బట్టలు కూడా కొన్నివ్వలేక బాధపడిన నిజాయితీ పరుడైన ఉద్యమకారుడు ఇతనే.. అంటూ పాత వీడియోలను ట్రోల్ చేస్తున్నారు.
Also Read : బ్రేకింగ్: విజయసాయి రెడ్డి ఛానల్ పేరు ఇదే..!
2014లో తెలంగాణ వచ్చినప్పుడు అద్దె ఇంట్లో ఉన్న వ్యక్తి.. 2019 నాటికి విల్లా కొనే స్థాయికి ఎదిగాడంటే.. ఆయన సంపాదన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ నిలదీస్తున్నారు. ఇక కొందరైతే.. తెలంగాణ ఉద్యమ బిడ్డ ప్రజా సేవలో అలిసిపోయి విశ్రాంతి తీసుకోవడానికి కొనుక్కుంటే ఓర్చుకోలేరా.. అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తం ఆంధ్ర వారిని బెదిరించి కట్టిన ఇల్లు కదా ఇది.. అంటూ శ్రీనివాసగౌడ్‌ను నేరుగా ట్యాగ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ విల్లా ఉన్న కమ్యూనిటీ కూడా జోరుగా చర్చ నడుస్తోంది. హైదరాబాద్ నగరంలోనే అత్యుత్తమైన విల్లాలు ఉన్నది శ్రీ ఆదిత్యా రిజర్వ్ విల్లాస్. ఈ కమ్యూనిటీ ఏపీ మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి చెందినట్లు తెలుస్తోంది. మొత్తానికి యూ ట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఇప్పుడు తెలంగాణ ఉద్యమ బిడ్డ, పిల్లలకు బట్టలు కూడా కొన్నివ్వలేని శీనన్నను అడ్డంగా బుక్ చేసింది.

