ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల తతంగానికి రంగం సిద్ధం అవుతోంది. మొత్తం 45 రోజుల్లోగా ఈ మొత్తం ఎన్నికల క్రతువు జరిపించాలని కూటమి ప్రభుత్వం పట్టుదలగా ఉంది. అంటే అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబర్ మధ్యలోగా మొత్తం పంచాయతీ ఎన్నికలు కూడా జరిగిపోతాయని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే స్థానిక ఎన్నికల మీద ఎవరి ఆశలు ఎలా ఉన్నాయి, అంచనాలు ఏమిటి అన్న విషయంపై చర్చ వాడిగా వేడిగా సాగుతోంది. ఏపీలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి అధికారంలో ఉంది కాబట్టి మొగ్గు అటు వైపే అన్నది అందరికీ తెలిసిన విషయమే. కచ్చితంగా మరో రెండున్నరేళ్ల పాటు ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంటుంది కాబట్టి.. స్థానిక ప్రభుత్వం కూడా కూటమిదే అయితే మేలు అన్నది సగటు జనం భావనగా ఉంటుంది. అలా చూస్తే కూటమి ఈ ఎన్నికల్లో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కూడా.
Also Read : బ్రేకింగ్: విజయసాయి రెడ్డి ఛానల్ పేరు ఇదే..!
అయితే కూటమికి ఒక ఇబ్బంది ఉంది. అదే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి కూర్చుని సీట్లను సాఫీగా సర్దుబాటు చేసుకోవడం. అలా చేస్తేనే ఎన్నికల రంగంలో ఐక్యత కనిపిస్తుంది. ఇందులో ఏ ఒక్క పార్టీ అసంతృప్తిగా వ్యవహరించినా కూడా.. అది గ్రౌండ్ లెవెల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సార్వత్రిక ఎన్నికలకు స్థానిక ఎన్నికలకు భారీ తేడా ఉంది. వేలాదిగా అభ్యర్థులు అక్కడ ఉంటారు. అందరినీ కో ఆర్డినేట్ చేసి ముందుకు తీసుకురావడం అన్నది కష్టం. అంతే కాదు స్థానికం అంటే పక్కా లోకల్ కూడా. దాంతో ఎవరి ఆశలు వారికి ఉంటాయి. ఆ మాత్రం పలుకుబడి ఉన్న వారు పార్టీ జెండా లేకపోయినా పోటీకి దిగిపోతుంటారు. అలా కాకుండా చూసుకోవాలంటే పకడ్బందీగా పొత్తులు వ్యవహారం ఉండాలని అంటున్నారు.
అలాగే స్థానికంలో కచ్చితంగా రెబెల్స్ బెడద ఉంటుంది. ఒక పార్టీగా పోటీ చేసినా ఇద్దరు ముగ్గురు ఒకే సీటు ఆశించినప్పుడు కచ్చితంగా బరిలోకి రెబెల్‌గా నిలబడతారు. అలాంటిది మూడు పార్టీలు కలసి ఒకే చోట ఒక అభ్యర్థి అంటే కనీసంగా పది మందిలో ఒకరికి మాత్రమే చాన్స్ ఉంటుంది. అప్పుడు మిగిలిన తొమ్మిది మంది ఆశావహులు ఒకేలా ఉంటారని చెప్పలేరు. దాంతో ఎవరో ఒకరైనా రెబెల్‌గా బరిలోకి దిగితే అది కూటమి ఫలితానికే ఇబ్బందిగా మారుతుందనే మాట బాగా వినిపిస్తోంది. ఇలాంటి రెబెల్స్‌ని కట్టడి చేయడం చాలా కష్టం. కొన్నిసార్లు సాధ్యపడని విషయం కూడా. సరిగ్గా ఇక్కడే వైసీపీలో ఆశలు పెరుగుతున్నాయని అంటున్నారు.
Also Read : సిఎం మెడకు చుట్టుకున్న చిల్లర గాళ్ళ రచ్చ..!
2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఆ తరువాత మొత్తం స్థానిక సంస్థలలో చాలా వరకూ కూటమి వైపు చేరిపోయాయి. అంతా ఫిరాయించారు. దాంతో ప్రస్తుతం వైసీపీ వైపు చూసే వారే లేని పరిస్థితి. ఇప్పుడు తన బలాన్ని పెంచుకోవాలని వైసీపీ చూస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో కొన్ని స్థానాలు గెలిచినా చాలు.. అవి వైసీపీకి చాలా బలాన్నిస్తాయి. మొత్తానికి మొత్తంగా కూటమి గెలవాలనుకున్నా వైసీపీకి బలం ఉన్న చోట కొంత అయినా ఉనికి చాటుకోవాలని చూస్తోంది. అలాగే కూటమిలో లుకలుకలు అసంతృప్తులు బయటపడితే.. రెబెల్స్ బరిలో దిగిన చోట తమకు అనుకూలమని కూడా ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఏపీలో స్థానిక సంస్థల పోరు ఏకపక్షం కాకుండా చూసుకోవడం వైసీపీ మొదటి విజయం అయితే ఎన్నో కొన్ని సీట్లు సాధించడం రెండో విజయం. ఇక 2024లో తమకు వచ్చిన 40 శాతం ఓటు షేర్ కాపాడుకుంటూనే మరింతగా పెంచుకోవడం మూడవ విజయం. ఆ విధంగా చూస్తే వైసీపీకి పోయేది ఏమీ లేదని వచ్చేదంతా లాభమే అనేది ఆ పార్టీ నేతల మాట.

