పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో వైరల్ జ్వరాలతో పదుల సంఖ్యలో విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. తుఫాను అనంతర వాతావరణ మార్పులు, కలుషిత తాగునీరు, అపరిశుభ్ర వాతావరణం వల్ల పిల్లలు జ్వరం, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారని అధికారులు చెప్తున్నారు. అయితే ఈ దారుణ పరిస్థితికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పరిపాలనా వైఫల్యమే కారణమంటూ ప్రతిపక్షాలు, స్థానిక గిరిజన సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
Also Read : చీరాలలో వైసీపీ కొంపముంచిన ఆమంచి..!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల మౌలిక వసతుల పట్ల మంత్రి పూర్తిగా నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గురుకులాల్లో కనీస వైద్య సదుపాయాలు, సిక్ రూమ్‌లు సరిగ్గా లేకపోవడం వల్లే ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థినులు ఒకేసారి అనారోగ్యానికి గురయ్యారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ శాఖపై కనీస అవగాహన లేకుండా, కేవలం రాజకీయ పరమైన విమర్శలకే ప్రాధాన్యత ఇస్తూ..
Also Read : జగన్‌కు కేసుల భయం.. రాయభారం ఫలిస్తుందా..?
గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థుల ప్రాణాలతో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చెలగాటమాడుతున్నారని, గతంలో ఇదే పాఠశాలలో సరైన వైద్యం అందక ఇద్దరు విద్యార్థినులు మరణించినా కనీస చర్యలు తీసుకోలేదని అటు వైసీపీ విమర్శలు చేస్తోంది. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన మంత్రి సంధ్యారాణి, అస్వస్థతకు గురైన విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ను, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. గిరిజన పాఠశాలల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో గురుకులాల దుస్థితి చూస్తుంటే మంత్రి గారూ మీ పర్యవేక్షణ, మీ శాఖ పనితీరు ఎంత సమర్థవంతంగా ఉందో అర్థమవుతోందంటూ విమర్శలు వస్తున్నాయి.


