ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. జగన్కు అటు రాజకీయంగా, ఇటు కుటుంబ పరంగా కూడా పరిస్థితులు ఏ మాత్రం కలిసి రావడం లేదు. 2019 ఎన్నికలకు ముందు వరకు జగన్ వెంటే ఉన్న కుటుంబం మొత్తం.. ఇప్పుడు దూరమైంది. 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన ఆనందం.. ఇప్పుడు లేదు. 2024 ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. చివరికి కుటుంబసభ్యులు కూడా తీవ్ర ఆరోపణలు చేయడంతో.. ప్రస్తుతం జగన్ ఒంటరి అయిపోయాడు. ఇదే సమయంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో చేసిన తప్పులు.. ఒక్కొక్కటిగా మెడకు చుట్టుకుంటున్నాయి.
Also Read : అనంతపురంలో ఏం జరుగుతోంది.. బాబు ఫైర్..!
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం, మద్యం కుంభకోణం, పరకామణి చోరీ కేసు.. చివరికి సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు.. ఇలా అన్ని కేసులు ఒక్కసారిగా చుట్టుముట్టి జగన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చివరికి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ కూడా రంగంలోకి దిగడంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్కు ఎటు పోవాలో పాలుపోవటం లేదు. ఇదే సమయంలో ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. చివరికి సొంత నియోజకవర్గం పులివెందుల మునిసిపాలిటీ, సొంత జిల్లా అని గర్వంగా చెప్పుకునే కడప మేయర్ సీటు కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడంతో.. జగన్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది.
ఓ వైపు కేసుల గోల.. మరో వైపు రాజకీయంగా గడ్డుకాలం.. ఇంకో వైపు కుటుంబ సభ్యుల నుంచి చీత్కారాలు.. ఇవన్నీ జగన్ను మరింత కుంగదీస్తున్నట్లు తెలుస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేసుల నుంచి బయటపడితే.. కాస్త ఊరట లభిస్తుందనేది జగన్ సన్నిహితుల మాట. అందుకే కేంద్ర పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. తాజాగా చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్లో వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు తమిళనాడు సీఎం విజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ హాజరయ్యారు. ఈ ముగ్గురు కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు.
అయితే ఇదే వేడుకకు ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ కూడా హాజరయ్యారు. దేశ పారిశ్రామిక రంగంలో కీలక స్థానంలో ఉన్న అదానీ.. కేంద్ర బీజేపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడు అనేది అందరికీ తెలిసిన విషయమే. చెన్నైలో జరిగిన వివాహ వేడుకకు హాజరైన అదానీతో వైఎస్ జగన్ ప్రత్యేకంగా సమావేశమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేసుల విషయంలో మధ్యవర్తిత్వం వహించాలని జగన్ కోరినట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్ర బీజేపీ పెద్దలతో మాట్లాడాలని గౌతమ్ అదానీని కోరినట్లు సమాచారం. అయితే జగన్ చెప్పిన ప్రతిపాదనపై అదానీ పెద్దగా స్పందించలేదని.. సరే.. అన్నట్లుగా వెళ్లిపోయారనేది సన్నిహితుల మాట.
Also Read : అసెంబ్లీ కంటే ఘోరం.. నెక్ట్స్ ఏంటి..?
2019 ఎన్నికల్లో కేంద్ర బీజేపీ పెద్దల సహకారంతోనే జగన్ అధికారంలోకి వచ్చారు. అయితే ప్రస్తుతం ఇండియా కూటమి నేతలతో జగన్ టచ్లో ఉన్నారనే మాట బాగా వినిపిస్తోంది. గతంలో మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు బేషరతుగా మద్దతు తెలిపిన వైసీపీ నేతలు.. ఇప్పుడు మాత్రం నో అంటున్నారు. పైగా బీజేపీ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ సభ్యులకు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్. ఇది కేంద్ర పెద్దలకు కాస్త ఆగ్రహం తెప్పించినట్లు అనిపిస్తోంది. అందుకే ఇప్పటి వరకు పార్టీ నేతల ద్వారా రాయభారం నడిపిన జగన్.. ఇప్పుడు అదానీ ద్వారా నేరుగా రంగంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. మరి రాయభారం ఫలిస్తుందా.. లేదా.. అనేది తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.


