రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ పోలీస్ యంత్రాంగాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి వేదికగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారులు అధికార పక్షానికి కొమ్ముకాయవద్దని హితవు పలికారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగి ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెట్టడం, వేధించడం వంటి చర్యలకు పాల్పడటం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.
Also Read : బ్రేకింగ్: విజయసాయి రెడ్డి ఛానల్ పేరు ఇదే..!
చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తూ పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ఇచ్చే తీర్పును స్వేచ్ఛాయుత వాతావరణంలో ఇచ్చేలా సహకరించాలని కోరారు. ముఖ్యంగా పోలీసుల ఆత్మగౌరవాన్ని ప్రస్తావిస్తూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. “నేను రాష్ట్ర పోలీసు వ్యవస్థకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ధరించే పోలీస్ టోపీ మీద ఉన్న మూడు సింహాల ముద్రకు మాత్రమే తలవంచండి, అంతేకానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్షసాధింపు రాజకీయాలకు, ఆయన ఇచ్చే అప్రజాస్వామిక ఆదేశాలకు తలవంచకండి” అంటూ పిలుపునిచ్చారు.
Also Read : అభిషేక్ శర్మ పేరిట చెత్త రికార్డు..!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో వైకాపా క్యాడర్ను టార్గెట్ చేస్తూ అక్రమంగా నిర్బంధిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో పోలీస్ శాఖ తన కర్తవ్యాన్ని మర్చిపోకూడదని గుర్తు చేశారు. స్థానిక పోరులో నిలబడే ప్రతిపక్ష అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క స్థానంలోనూ వైకాపా అభ్యర్థులు ఖచ్చితంగా పోటీ చేస్తారని, ఎక్కడా ఏకగ్రీవాలకు తావివ్వకుండా పోరాడతామని ఈ సందర్భంగా వైఎస్ జగన్ స్పష్టం చేసారు.

