తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తూ, ఉద్యోగాల కోసం సిద్దమవుతోన్న.. నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోలీస్ శాఖలో భర్తీ చేయనున్న కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి గరిష్ట వయోపరిమితిని అదనంగా మరో మూడేళ్లు పెంచుతూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగ యువతీ యువకులకు వయోపరిమితి విషయంలో చాలా పెద్ద ఊరట లభించినట్లయింది.
Also Read : వైసీపీ హయాం మద్యం రవాణా స్కామ్‌లో కీలక పరిణామం..!
ఏళ్ల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి, వయసు పైబడి అభ్యర్థిత్వం కోల్పోయే ఆందోళనలో ఉన్న అభ్యర్థులందరికీ ఈ నిర్ణయం ఒక గొప్ప అవకాశంగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే యూనిఫామ్ సర్వీసుల ఉద్యోగాలకు ఏడేళ్ల వయోపరిమితి సడలింపును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, హోంశాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల గరిష్ట వయోపరిమితి 32 ఏళ్లుగా ఉండగా, కానిస్టేబుల్ పోస్టులకు మాత్రం 29 ఏళ్లుగా మాత్రమే నిర్దేశించారు. ఈ రెండు పోస్టుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించిన అభ్యర్థులు, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
Also Read : ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్‌లో సంచలనం..!
దీంతో ఎస్సై పోస్టులతో ఉన్న వ్యత్యాసాన్ని తొలగిస్తూ, కానిస్టేబుల్ అభ్యర్థుల వయోపరిమితిని కూడా 32 ఏళ్లకు పెంచింది. దీనివల్ల గతంలో ఇచ్చిన 7 ఏళ్లకు తోడు ఇప్పుడు మరో 3 ఏళ్లు కలసి, మొత్తంగా 10 సంవత్సరాల భారీ వయోసడలింపు అభ్యర్థులకు లభించనుంది. ప్రభుత్వం ప్రకటించిన ఈ అదనపు మూడేళ్ల వయోపరిమితి సడలింపు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ భర్తీ చేసే పోలీస్, ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖ, మరియు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లోని కానిస్టేబుల్ పోస్టులకు వర్తిస్తుంది. వయోపరిమితి పెంచడంతో పాటు, ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్యోగాల నియామక ప్రక్రియలో దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు బోర్డు గడువు తేదీని కూడా పొడిగించింది.

