బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నాబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోంది. తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా బలపడినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. అక్టోబర్ 26 ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. ఇది మరింత బలపడి కోస్తాంధ్రపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు ఐఎండీ ‘రెడ్ మెసేజ్’తో తుఫాన్ హెచ్చరిక జారీ చేసింది.
28న ఉదయం తీరం దాటే సూచనలు
గడిచిన ఆరు గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదిలిన అర్నాబ్.. సోమవారం తెల్లవారుజామున విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా సుమారు 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. సోమవారం అర్ధరాత్రికి తీవ్ర తుఫాన్‌గా, మంగళవారం అతి తీవ్ర తుఫాన్‌గా బలపడవచ్చని ఐఎండీ అంచనా వేసింది.
Also Read : కడపలో స్టోరీ క్లోజ్..? ఆరు మున్సిపాలిటీలు క్లీన్ స్వీప్..!
బుధవారం, అక్టోబర్ 28న మధ్యాహ్నానికి ముందు బాపట్ల–విశాఖపట్నం మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు 115–125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి, ఈదురుగాలుల వేగం 140 కిలోమీటర్ల వరకు చేరవచ్చు.
కోనసీమ తీరానికి అప్రమత్తత
తీరం దాటే సమయంలో సాధారణ ఖగోళ పోటు స్థాయి కంటే సముద్ర మట్టం అదనంగా 1–1.5 మీటర్లు పెరిగి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చొచ్చుకురావచ్చని ఐఎండీ హెచ్చరించింది. కాకినాడ పరిసరాలు, యానాం వద్ద ఉప్పెన ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని పేర్కొంది. ఈ నేపథ్యంలో సమీపంలోని కోనసీమ తీర గ్రామాలు, లంక ప్రాంతాల ప్రజలు స్థానిక అధికారుల సూచనలను జాగ్రత్తగా పాటించాలి.
Also Read : డాలర్ కలకు గుడ్‌బై! టెకీల చూపు భారత్ వైపు!
అక్టోబర్ 27, 28 తేదీల్లో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశాలోనూ వర్షాల తీవ్రత పెరగనుంది. బలమైన గాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగే ప్రమాదంతోపాటు పంటలు, బలహీన గృహాలకు నష్టం వాటిల్లవచ్చు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని ఐఎండీ సూచించింది.
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తీరప్రాంతాలు, బలహీన ఇళ్లలో నివసించేవారు అధికారులు సూచించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. తాగునీరు, అవసరమైన మందులు, టార్చ్ సిద్ధంగా ఉంచుకోవాలి. మొబైల్ ఫోన్లు, పవర్బ్యాంకులకు చార్జింగ్ పెట్టుకోవాలి. ముఖ్యమైన పత్రాలను నీరు తగలకుండా భద్రపరచుకోవాలి.
విద్యుత్ తీగలు, స్తంభాలు, చెట్లకు దూరంగా ఉండాలి. నీట మునిగిన రహదారులను దాటే ప్రయత్నం చేయవద్దు. అలలను చూసేందుకు బీచ్‌లకు వెళ్లకూడదు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే నిర్ధారణలేని సమాచారాన్ని నమ్మకుండా అధికారిక ప్రకటనలను అనుసరించాలి.


