ఊహించని షాక్ తగిలింది. రెండు రోజుల క్రితం సోషల్ మీడియా మొత్తం బాగా వైరల్. ఆ తర్వాత కావాల్సినంత సానుభూతి.. కానీ.. అంతలోనే ఊహించని షాక్.. గెలిచి చూపిస్తామని పెద్ద ఎత్తున సవాల్ చేశారు. ఎన్నికలు ఎదుర్కునే సత్తా లేదని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కానీ సరిగ్గా 48 గంటలు కూడా గడవకముందే.. దెబ్బ మామూలుగా తగలలేదు. ఇంకా చెప్పాలంటే.. మేమే గొప్ప.. మేము ఎంతో చేశాం.. కాబట్టి మేమే గెలుస్తాం.. అందుకే భయపడుతున్నారు.. కావాలంటే మా సత్తా ఎన్నికల్లో చూపిస్తామని కబుర్లు కూడా చెప్పారు. కానీ ఇప్పుడు తగిలిన షాక్ దెబ్బకు ఒక్కసారిగా దిమ్మ తిరిగి బొమ్మ కనిపించినట్లు అయ్యింది.
Also Read : వాళ్లు కూడా గ్లూకోజ్ ప్యాచ్‌లు ఎందుకు వాడుతున్నారు..?
విడదల రజిని పేరు వింటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది సైబరాబాద్ మొక్క. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహానాడు వేదిక పై నుంచి.. “మీరు నాటిన సైబరాబాద్ మొక్కను నేను..” అంటూ అందరినీ ఆకర్షించారు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే.. సరిగ్గా నెల రోజుల్లోనే వైసీపీలో చేరారు. జగన్ ప్రజా సంకల్ప యాత్ర కోసం ఏకంగా కోట్లు ఖర్చు చేశారు. అన్నా.. మీ వెంటే నేను.. అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో అనూహ్యంగా చిలకలూరిపేట టికెట్ తెచ్చుకుని.. రాజకీయ గురువు ప్రత్తిపాటి పుల్లారావు మీద గెలిచారు. ఇక ఆ తర్వాత జగన్ మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ వంటి కీలక శాఖ మంత్రిగా వ్యవహరించారు కూడా. అయితే కావాల్సినన్ని విమర్శలు కూడా మూటగట్టుకున్నారు.
2024 ఎన్నికల్లో చిలకలూరిపేటకు బదులుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి విడదల రజిని పోటీ చేశారు. అయితే సొంత పార్టీ నేతలే రజిని ఓడించారనేది అందరికీ తెలిసిన విషయమే. దీంతో.. గుంటూరులో నా వల్ల కాదని చేతులెత్తేసిన రజిని.. తిరిగి చిలకలూరిపేట చేరుకున్నారు. వైసీపీ ఓడిన తర్వాత పార్టీ మారతారనే ప్రచారం బాగా జరిగింది. అయితే కూటమి పార్టీలు నో ఎంట్రీ బోర్డు పెట్టడంతో.. చేసేది లేక వైసీపీలోనే కొనసాగుతున్నారు. అయితే.. రెండు రోజుల క్రితం వరకు సైలెంట్‌గా ఉన్న రజిని.. ఒక్క వీడియోతో బాగా ఫేమస్ అయ్యారు.
స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా.. నామినేషన్లకు వెళ్లేందుకు ప్రయత్నించిన విడదల రజినిని పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా నెట్టుకుంటూ ముందుకు వెళ్లేందుకు యత్నించిన రజినిని ఓ మహిళా ఎస్సై.. “వద్దు మేడం.. ప్లీజ్.. మా మాట వినండి..” అంటూ మర్యాద పూర్వకంగా అడ్డుకున్నారు. కానీ రజిని మాత్రం తగ్గలేదు. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. అక్కడే ఉన్న అరుగు తట్టుకుని రజిని కింద పడ్డారు. అంతే.. ఏకంగా చంపేస్తావా.. అంటూ ఏడుపు మొదలుపెట్టారు రజిని. ఈ వీడియో బాగా వైరల్ కావడంతో.. రాష్ట్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుంది. తోపులాటకు కారణమైన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఈసీ ఆదేశించారు.
Also Read : వాళ్లిద్దరే వైరల్.. ట్రెండ్ సెట్ చేశారు..!
ఎస్సై పై చర్యలు అనే మాట విన్న తర్వాత వైసీపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. అయితే ఈ ఘటన జరిగిన సరిగ్గా 24 గంటల్లోనే విడదల రజినికి ఊహించని షాక్ ఇచ్చారు సొంత పార్టీ నేతలు. చిలకలూరిపేట మునిసిపల్ ఎన్నికల్లో వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థిగా షేక్ కరీమున్ అభ్యర్థిని విడదల రజిని పోటీలో నిలిపారు. దీంతో వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా పోటీ ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే.. ఇప్పుడు చిలకలూరిపేట మునిసిపల్ రాజకీయం ఒక్కసారిగా ఉత్కంఠగా మారింది. మరో వారం రోజుల్లో ఎన్నిక జరగాల్సి ఉండగా.. వైసీపీ అభ్యర్థి షేక్ కరీమున్ వైసీపీకి రాజీనామా చేసి విడదల రజినికి షాక్ ఇచ్చారు. ఆమె భర్త యూసుఫ్ అలితో కలిసి టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో టీడీపీలో చేరారు.
మునిసిపల్ ఎన్నికల్లో జనసేన అభ్యర్థి తోట రాజరాజేశ్వరికి సంపూర్ణ మద్దతు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో చిలకలూరిపేట అన్ని విధాలుగా అభివృద్ధి సాధిస్తోందని.. అందుకే తాము వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరినట్లు ప్రకటించారు. కరీమున్ దెబ్బతో వైసీపీ నేతలతో పాటు విడదల రజిని కూడా షాక్ అయ్యారు. తప్పకుండా గెలుస్తామని వైసీపీ నేతలు పెద్ద పెద్ద మాటలు చెప్పారు. తీరా ఇప్పుడు చూస్తే.. కనీసం పోటీలో ఉన్న అభ్యర్థి కూడా కూటమికే సపోర్టుగా నిలవడంతో డిపాజిట్లు కూడా రావని వైసీపీ నేతలు భయపడుతున్నారు. సొంత ఊర్లో పార్టీకి డిపాజిట్లు రాకపోతే.. పరువు పోతుందని విడదల రజిని భయపడుతున్నారు. దీంతో చిలకలూరిపేట మున్సిపాలిటీ రాజకీయం ఒక్కసారిగా ఉత్కంఠకు దారితీసింది.


