ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల పర్వం వేళ తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేత జగన్మోహన్రెడ్డిని బెదిరించి, కిడ్నాప్‌నకు యత్నించారనే తీవ్ర ఆరోపణలపై నమోదైన కేసు ఆధారంగా పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ఆయనను స్వగ్రామమైన తిమ్మంపల్లిలో అదుపులోకి తీసుకుని భారీ భద్రత నడుమ అనంతపురానికి తరలించారు.
Also Read : డాలర్ కలకు గుడ్‌బై! టెకీల చూపు భారత్ వైపు!
గత మూడు రోజులుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో పోలీసుల నిఘా, హౌస్ అరెస్ట్ పరిధిలో ఉన్నారు. అయితే, తిమ్మంపల్లి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్‌ను తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డుకుంటున్నారనే సమాచారంతో పెద్దారెడ్డి ఆదివారం ఉదయం తాడిపత్రి నుంచి తిమ్మంపల్లి గ్రామానికి చేరుకున్నారు. నామినేషన్ల కేంద్రాల వద్ద ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. యల్లనూరు పరిధిలోనూ వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపించాయి.
శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు పెద్దారెడ్డిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. అక్కడ తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. “ఇవాళ కాకపోయినా రేపైనా యల్లనూరు వెళ్తాను.. నా మండలానికి నేను వస్తే ఎవరినీ వదిలిపెట్టను” అంటూ పోలీసుల ముందే పెద్దారెడ్డి వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ లోగా తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంటి ఆవరణలో ఉన్న ఆయనకు చెందిన స్కార్పియో వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి అద్దాలు ధ్వంసం చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
Also Read : వాళ్లిద్దరే వైరల్.. ట్రెండ్ సెట్ చేశారు..!
జేసీ వర్గీయులు పెద్దారెడ్డి నివాసంపై రాళ్లు రువ్వేందుకు యత్నించడంతో ఇరుపక్షాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగి తిమ్మంపల్లిలో పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను అనంతపురానికి తరలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసులు లాఠీఛార్జ్, టీయర్ గ్యాస్ ప్రయోగించి ఇరు వర్గాల అనుచరులను చెల్లాచెదురు చేశారు. తాడిపత్రి, యల్లనూరు పరిసర ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు బలగాలను మొహరించారు అధికారులు.


