ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసేసరికే అధికార కూటమి చారిత్రాత్మక విజయాలను నమోదు చేసుకుంది. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని కంచుకోటగా, ఆ పార్టీ గుండెకాయగా భావించే ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో వచ్చిన ఫలితాలు రాజకీయ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఒకప్పుడు విపక్షాలకు నామినేషన్లు వేసేందుకు కూడా ధైర్యం చాలని ఈ జిల్లాలో, ఇప్పుడు వరుసగా ఆరు మున్సిపాలిటీలు కూటమి పరమవ్వడం.. వైసీపీ ఇక్కడ పూర్తిగా ఉనికిని కోల్పోతోందా అనే చర్చకు దారితీస్తోంది.
Also Read : ఉమ్మడి ఆస్తిని నాది అనడం.. షర్మిలకి అన్యాయం చేయడం కాదా?
వైసీపీలో జగన్ తర్వాత అత్యంత పవర్ఫుల్ నాయకుడిగా, రాయలసీమ రాజకీయాలను శాసించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి రాజంపేట ఫలితం ఘోర అవమానంగా మారిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాజంపేట పార్లమెంట్ పరిధిలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఇక్కడ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆ కుటుంబంపైనే ఉంది. అయితే రాజంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ స్థానం ఏకగ్రీవమై, టీడీపీ అభ్యర్థి దొంతం గాయత్రి విజయం సాధించడం పెద్దిరెడ్డి వర్గానికి తీరని పరాభవంగా మారింది. సొంత లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీని కూడా కనీసం పోటీలో నిలబెట్టలేకపోవడం వారి పట్టు సడలిందనడానికి నిదర్శనమని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.
Also Read : డాలర్ కలకు గుడ్‌బై! టెకీల చూపు భారత్ వైపు!
వైఎస్సార్ కడప జిల్లా పరిధిలోని బద్వేలు (ఎస్. దివ్యతేజ – టీడీపీ), ప్రొద్దుటూరు (నంద్యాల రాఘవరెడ్డి – టీడీపీ), కమలాపురం (జి. స్వప్న – టీడీపీ), మైదుకూరు (ధనపాల జగన్మోహన్ – టీడీపీ), రాజంపేట(దొంతం గాయత్రి – టీడీపీ) లతో పాటు ఎర్రగుంట్ల నగర పంచాయతీని బీజేపీ అభ్యర్థి మధులత కైవసం చేసుకున్నారు. జగన్ సొంత నియోజకవర్గాల పరిధిలో సైతం వైసీపీ అభ్యర్థులు కనీసం నామినేషన్లు వేయడానికి కూడా ముందుకు రాకపోవడం లేదా వెనక్కి తగ్గడం చూస్తుంటే, కేడర్‌లో నైరాశ్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక రకంగా జగన్ సొంత గడ్డపైనే వైసీపీ అధిపత్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందనే వ్యాఖ్యలు నిజమవుతున్నాయి.


