ఉత్తరాంధ్ర రాజకీయాల్లో విశాఖ మేయర్ పీఠం చుట్టూ ఉత్కంఠ రోజురోజుకూ పెరుగుతోంది. ఒకవైపు విజయం తమదేనన్న ధీమాతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముందుకు సాగుతుండగా, మరోవైపు రెండోసారి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల గెలుపోటములపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ప్రస్తుత కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు క్షేత్రస్థాయిలో ఏ మేరకు పనిచేస్తారన్నది కీలకంగా మారింది.
Also Read : కడపలో స్టోరీ క్లోజ్..? ఆరు మున్సిపాలిటీలు క్లీన్ స్వీప్..!
విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయా వార్డుల్లో పార్టీ అభ్యర్థులకు నాయకులు ఎంతవరకు సహకరిస్తున్నారు? క్షేత్రస్థాయిలో ప్రచారం ఎలా సాగుతోంది? ఓటర్లను సమన్వయం చేసుకోవడంలో నాయకుల పాత్ర ఏమిటి? అనే అంశాలపై సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే నిఘా వర్గాల ద్వారా, సర్వే సంస్థల ద్వారా రిపోర్టు తెప్పించుకున్నట్లు సమాచారం.
టీడీపీ తరఫున మేయర్ అభ్యర్థిగా ముక్క శ్రావణి పేరును ప్రకటించినప్పటి నుంచి రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి. నిజానికి విశాఖ మేయర్ రేసులో పలువురు ప్రముఖుల పేర్లు బాగా వినిపించాయి. కానీ చివరికి ముక్క శ్రావణి పేరును అధిష్ఠానం ప్రకటించింది. మేయర్ అభ్యర్థిగా ఆమె విజయానికి పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. అభ్యర్థి ఎంపికతో పాటు ఎన్నికల నిర్వహణ, వార్డుల వారీగా ప్రచారం, స్థానిక నాయకుల మధ్య సమన్వయం వంటి అంశాలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పార్టీలోని వివిధ స్థాయిల నాయకులు ఒకే లక్ష్యంతో ముందుకు సాగితేనే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అందుకే అభ్యర్థి గెలుపును తమ రాజకీయ ప్రతిష్ఠకు సంబంధించిన అంశంగా తీసుకుని ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read :పోస్టల్ బ్యాలెట్లపై ఎస్ఈసీ కీలక ఉత్తర్వులు..!
టీడీపీతో పాటు కూటమి భాగస్వామ్య పార్టీల నాయకుల సహకారం కూడా ఈ పోరులో కీలకంగా మారనుంది. ఎన్నికల సమయంలో స్థానిక స్థాయిలో ఎలాంటి విభేదాలు తలెత్తకుండా సమన్వయంతో ముందుకు సాగాలని పార్టీ పెద్దలు సూచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గాజువాకతో పాటు పెందుర్తి, భీమిలి, విశాఖ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలపై కూడా రాజకీయ వర్గాలు దృష్టి సారిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు ఏ విధంగా పనిచేస్తారన్నది ఎన్నికల ప్రచారంలో కీలక అంశంగా మారుతోంది. ముఖ్యంగా గాజువాకలో పార్టీ బలాన్ని నిలబెట్టుకోవడంతో పాటు కూటమి నాయకుల మధ్య సమన్వయాన్ని కొనసాగించడం పల్లా శ్రీనివాసరావుకు ప్రాధాన్యమైన అంశంగా కనిపిస్తోంది.
మరోవైపు వైసీపీలో అభ్యర్థుల ఎంపిక, టికెట్ల పంపిణీ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో అసంతృప్తి వ్యక్తమైంది. టికెట్లు ఆశించి నిరాశకు గురైన నాయకులు, వారి అనుచరులు ఏ విధంగా వ్యవహరిస్తారనేది పార్టీ నాయకత్వానికి సవాలుగా మారిన అంశం. టికెట్లు దక్కని వారంతా ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. స్థానిక సమీకరణాలు, వ్యక్తిగత సంబంధాలు, పార్టీ నాయకత్వం చేపట్టే బుజ్జగింపులు కూడా ఎన్నికల ప్రచారంపై ప్రభావం చూపే అవకాశం. వైసీపీ తన కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ ఎన్నికల్లో ప్రచారం చేస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న పట్టు, స్థానిక నాయకుల పట్టుదల, ఓటర్లతో ఉన్న సంబంధాలు తమకు అనుకూలంగా మారుతాయని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. వైసీపీలో అభ్యర్థుల ఎంపికపై కొన్ని ప్రాంతాల్లో అసంతృప్తి ఉందన్న ప్రచారాన్ని టీడీపీ శ్రేణులు తమకు అనుకూలంగా భావిస్తున్నాయి.
Also Read :విజయ్‌పై ట్రోలింగ్‌కు రష్మిక మందన్నా ఘాటు కౌంటర్..!
విశాఖ మేయర్ పీఠం కోసం సాగుతున్న రాజకీయ పోరులో టీడీపీ తన ఎమ్మెల్యేలు, కూటమి నాయకుల సమన్వయంపై దృష్టి పెడుతుండగా, వైసీపీ తన సంస్థాగత బలాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. రెండు పార్టీల నాయకులు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు. వార్డుల వారీగా ఓటర్ల స్పందన, అభ్యర్థుల బలం, పార్టీల మధ్య సమన్వయం, చివరి వరకు సాగే ప్రచారం కీలకంగా నిలవనున్నాయి. విశాఖ మేయర్ పీఠంపై ఏ పార్టీ వ్యూహం ఫలిస్తుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్.


