వైసీపీని రాజకీయంగా దెబ్బతీయడానికే మైండ్ గేమ్ మొదలైందా..? సీనియర్ నేత బొత్స సత్యనారాయణ జనసేనలోకి వెళ్తున్నారంటూ సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లలో హోరెత్తుతున్న ప్రచారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ మార్పును బొత్స ఖండిస్తున్నప్పటికీ అదే ప్రచారాన్ని పదేపదే తెరపైకి తీసుకురావడం వెనుక రాజకీయ వ్యూహం ఉందా అన్న చర్చ మొదలైంది. నేతను పార్టీలోకి లాగడం కంటే.. ఆయన పార్టీ మారుతున్నారనే భావనను ప్రజల్లోకి నాటడమే అసలు టార్గెట్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బొత్స పై టీడీపీ నేతలు ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి.
Also Read : మలేరియాపై భారత్ విజయం.. కేంద్రం కీలక ప్రకటన..!
బొత్స సత్యనారాయణ చుట్టూ జనసేన చేరిక ప్రచారం ఒక్కసారిగా ఊపందుకోవడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బొత్స త్వరలో జనసేనలో చేరబోతున్నారంటూ వరుస కథనాలు ప్రసారం అవుతున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని బొత్స స్వయంగా ఖండించిన నేపథ్యంలో.. అసలు ఈ ప్రచారం వెనుక ఎవరి వ్యూహం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని బొత్స స్వయంగా ప్రకటించారు. అయినప్పటికీ ప్రచారం ఆగకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ప్రచారం వెనుక వైసీపీ నేతలే ఉన్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్.
బొత్స జనసేనలోకి వెళ్తున్నారన్న ప్రచారం వల్ల వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైన మాట వాస్తవం. ఈప్రచారం వల్ల వైసీపీపై ప్రభావం గట్టిగానే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణకు ఉన్న రాజకీయ ప్రాధాన్యత నేపథ్యంలో.. ఆయన పార్టీ మారుతున్నారనే వార్తలు వైసీపీ శ్రేణుల్లో అనుమానాలు, గందరగోళం సృష్టిస్తున్నాయి. “బొత్స కూడా వెళ్లిపోతున్నారు.. ఇక వైసీపీలో ఎవరు మిగులుతారు?” అనే భావన ఇప్పటికే క్యాడర్‌లో కలిగించడమే ఈ ప్రచారం వెనుక అసలు ఉద్దేశమా? అన్న చర్చ కూడా వినిపిస్తోంది. వైసీపీకి చెందిన కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారనే భావనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే.. ప్రతిపక్ష పార్టీపై మానసిక ఒత్తిడి పెంచవచ్చన్నది రాజకీయ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే దీనిని కొందరు రాజకీయ పరిశీలకులు “మైండ్ గేమ్’గా అభివర్ణిస్తున్నారు.
ప్రస్తుతం బొత్స శాసన మండలిలో కూటమి ప్రభుత్వంపై విమర్శలు కొనసాగిస్తున్నారు. ఇటీవల కూడా డీఎస్సీ, నిరుద్యోగ సమస్యలు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అలాంటి సమయంలో ఆయన జనసేనలోకి వెళ్తున్నారంటూ ప్రచారం ఊపందుకోవడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. నేతను మార్చడం కంటే.. నేతపై ప్రజల్లో అభిప్రాయాన్ని మార్చడం చాలా సులభం. అదే రాజకీయ మైండ్ గేమ్‌లో భాగమైతే.. బొత్సపై జరుగుతున్న ప్రచారం ఒక పెద్ద వ్యూహంలో భాగమే కావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : కేఏ పాల్ ని కదిపి బొత్స పరువు పోగొట్టుకున్నాడా?
ఇదే సమయంలో బొత్స తన కుమార్తె డాక్టర్ అనూషను రాజకీయాల్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించడం కూడా ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది. ఆమెను విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవికి పోటీ చేయించనున్నట్లు బొత్స స్వయంగా ప్రకటించారు. ఈ పరిణామం కూడా బొత్స కుటుంబం జనసేన వైపు చూస్తోందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు బొత్స సత్యనారయణపై పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. దీని వల్ల వైసీపీ క్యాడర్‌లో అయోమయం, బొత్స రాజకీయ బలంపై అనుమానాలు, ఉత్తరాంధ్రలో వైసీపీ భవిష్యత్తుపై ప్రతికూలత వంటివి కీలకంగా మారాయి.
అన్ని ఊహాగానాలకు తెరపడాలంటే బొత్స సత్యనారాయణ స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. కానీ.. ఆయన మాత్రం ఇది కేవలం ప్రచారం అనే అంటున్నారు తప్ప.. తాను వైసీపీలోనే కొనసాగుతా.. జగన్ వెంటే ఉంటా.. తన కుమార్తె వైసీపీ తరఫునే జెడ్పీ ఛైర్మన్ పదవికి పోటీ చేస్తారనే మాటలు మాత్రం చెప్పటం లేదు. దీంతో ఈ ప్రచారం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

