Wednesday, August 19, 2026 03:02 PM
Wednesday, August 19, 2026 03:02 PM

ప్రత్యక్ష ఎన్నిక.. తెలుగు తమ్ముళ్లలో గుబులు..!

మున్సిపల్ ఛైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లను ప్రజలు నేరుగా ఎన్నుకునే పాత విధానాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వ నిర్ణయం కూటమి శిబిరంలో కొత్త చర్చకు తెరలేపింది. ప్రత్యక్ష ఎన్నికల విధానం వైసీపీకి రాజకీయంగా మేలు చేస్తుందన్న ఆందోళన టీడీపీ ప్రజాప్రతినిధుల్లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. మరోవైపు ఇదే నిర్ణయంపై వైసీపీలో మాత్రం ఉత్సాహం కనిపిస్తోంది.

Also Read : తెలుగు రాష్ట్రాలపై సీఎం విజయ్ కన్ను..?

మరో రెండు నెలల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఎన్నికలు నిర్వహించడంపై పెద్దగా అభ్యంతరం లేని మంత్రులు, ఎమ్మెల్యేలు.. చైర్మన్లు, మేయర్లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునే విధానంపైనే ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పరోక్ష ఎన్నికల విధానం కొనసాగితే కౌన్సిలర్లు, కార్పొరేటర్ల సంఖ్యా బలంతో పీఠాలను సులభంగా కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని కూటమి ప్రజా ప్రతినిధులు భావిస్తున్నారు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుందని.. అభ్యర్థి వ్యక్తిగత ప్రభావం, స్థానిక అసంతృప్తి, ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం వంటి అంశాలు నేరుగా ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో అనుకూలత ఎక్కువగా ఉందన్న సర్వే నివేదికలపై ఆధారపడటం కంటే.. స్థానికంగా కనిపిస్తున్న పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కొందరు టీడీపీ ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి స్థాయిలో సానుకూల వాతావరణం ఉందన్న అంచనాలు మున్సిపల్ ఎన్నికల్లో తప్పు కావొచ్చని నేతలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో స్థానిక సమస్యలు, అభ్యర్థుల ఎంపిక, వ్యక్తిగత వ్యతిరేకతలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

పరోక్ష ఎన్నికల విధానం కొనసాగితే కౌన్సిలర్లు, కార్పొరేటర్లను గెలిపించుకోవడం ద్వారా చైర్మన్, మేయర్ పీఠాలను దక్కించుకునే వ్యూహాన్ని అమలు చేయవచ్చని కూటమి నేతలు భావిస్తున్నారు. ఏకగ్రీవాలు, స్థానిక రాజకీయ సమీకరణాలు, ఎన్నికల అనంతర మద్దతు వంటి మార్గాల ద్వారా బలాబలాలను తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదే ప్రత్యక్ష ఎన్నికల్లో అయితే.. చైర్మన్, మేయర్ అభ్యర్థి ఓటమి మొత్తం పార్టీకి రాజకీయంగా ఇబ్బందికర సంకేతంగా మారుతుందని భయపడుతున్నారు. ఒకవేళ తమపై ఉన్న అసంతృప్తిని ఓటర్లు ప్రత్యక్షంగా వ్యక్తం చేస్తే.. దాని ప్రభావం రానున్న రాజకీయ పరిణామాలఫై కూడా పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

ఈ అంశంపై కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రి నారా లోకేశ్ ద్వారా కూడా సీఎం చంద్రబాబుకు తమ అభ్యంతరాలను తెలియజేసినట్లు సమాచారం. అయినప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల విధానానికే ప్రభుత్వం మొగ్గు చూపడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో వైసీపీ కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను గెలుచుకున్నా.. అది కేవలం స్థానిక ఎన్నికల ఫలితంగా కాకుండా కూటమి ప్రభుత్వంపై ప్రజాభిప్రాయానికి సంకేతంగా ప్రచారం జరిగే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

Also Read : APPSC గ్రూప్-1 అక్రమాలు.. డిఫెన్స్‌లో జగన్ పార్టీ

ఇదే సమయంలో ప్రత్యక్ష ఎన్నికల విధానంపై వైసీపీ శిబిరంలో మాత్రం ఉత్సాహం కనిపిస్తోంది. పరోక్ష విధానంతో పోలిస్తే ప్రత్యక్ష ఎన్నికలు తమకు మరింత అనుకూలంగా ఉంటాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వంపై స్థానిక అసంతృప్తి, పట్టణ సమస్యలు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలను తమకు అనుకూలంగా మలుచుకుని ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రయోజనం పొందవచ్చని వైసీపీ లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేవలం ఎన్నికల విధానంలో మార్పుగా మిగిలిపోతుందా? లేక కూటమి రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే తొలి సంకేతంగా మారుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని వైసీపీ ఎంత మేరకు తనకు అనుకూలంగా మలుచుకుంటుందో.. కూటమి తన బలాన్ని ఎలా నిరూపించుకుంటుందో తేలాలంటే మున్సిపల్ ఫలితాల వరకు వేచిచూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సాయిరెడ్డి పార్టీ.. వైసీపీలో...

ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ...

ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో...

టాలీవుడ్ ప్రముఖ నటి నిధి అగర్వాల్‌కు...

రైతుల కల సాకారమవుతున్న...

ఏళ్ల తరబడి గంజికి ఏడ్చాం.. గుడ్డకు...

లగ్జరీ ఫ్లాట్ లు.....

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని రాయపూడిలో...

APPSC గ్రూప్-1 అక్రమాలు.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిరుద్యోగ నియామకాల అంశం...

జోగి రమేష్ రాజకీయ...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,...

పోల్స్