ఏరు దాటే వరకు ఏటి మల్లన్న.. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న.. అనేది సామెత. అంటే పని అయ్యే వరకు ఓ మాట.. పని పూర్తయిన తర్వాత మరో మాట.. ఇలా మాట మార్చే వారినే ఊసరవెల్లి అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంపై ఇప్పటి వరకు ఓ మాట మాట్లాడిన వైసీపీ నేతలు.. ఇప్పుడు కొత్త మాటలు మాట్లాడుతున్నారు. అసలు అమరావతిలో నిర్మాణాలే లేవన్న వైసీపీ మాజీ మంత్రులు.. ఇప్పుడు మాత్రం.. అందులో ఎవరుంటారంటూ కొత్త పాట పాడుతున్నారు. అమరావతిని గ్రాఫిక్స్ అని నిన్నటి వరకు కథలు చెప్పిన వైసీపీ నేతలు.. ఇప్పుడు మాత్రం.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు చేసిన తప్పులను కవర్ చేసుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు.
Also Read : ఏపీలో మద్యం ధరలు తగ్గే అవకాశం ఉందా..? మంత్రుల బృందం కీలక భేటీ
2014లో ఏపీలో తెలుగుదేశం – బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది. అప్పటికి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఉండాలనే లక్ష్యంతో నాటి చంద్రబాబు ప్రభుత్వం పని చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయం మేరకు గుంటూరు – విజయవాడ మధ్య ప్రాంతాన్ని రాజధానికి అనుకూలంగా ఎంపిక చేశారు. అక్కడ భూసేకరణ చేసింది. ఆ ప్రాంతానికి అమరావతి అంటూ నామకరణం చేశారు. అమరావతికి శంకుస్థాపన చేసేందుకే దాదాపు రెండేళ్లు సమయం పట్టింది. రైతులతో చర్చలు, సమస్యల పరిష్కారం, అలాగే కోర్ క్యాపిటల్ ఏరియా ఎంపిక, ప్రభుత్వ భవనాల డిజైన్ వంటివి పూర్తి చేయడానికి మరో ఏడాది గడిచింది.
అయితే ఇదే సమయంలో అమరావతి నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగేందుకు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సచివాలయం, శాసససభ, హైకోర్టు నిర్మించారు. ఆ తర్వాత అమరావతిలో శాశ్వత అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, గవర్నర్ బంగ్లా, ముఖ్యమంత్రి అధికారిక నివాసం, మంత్రుల క్వార్టర్స్, హైకోర్టు న్యాయమూర్తుల నివాసాలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాలు, ఏఐఎస్ అధికారులకు క్వార్టర్స్ నిర్మాణానికి నాటి చంద్రబాబు సర్కార్ శ్రీకారం చుట్టింది. వీటిల్లో రెండేళ్ల కాలంలోనే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఏఐఎస్ అధికారుల భవనాల నిర్మాణం 80 శాతం పూర్తి చేసింది కూడా. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్మాణాలను గాలికి వదిలేసింది. దీంతో వాటి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారయ్యాయి.
Also Read : గ్లోబల్ స్టేజీపై అమరావతి వైభవం..!
ఇక వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి తీసుకువచ్చిన పైపులు, ఐరన్, ఇసుక, మట్టిని దొంగలు ఎత్తుకెళ్లారు కూడా. 2024లో ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. నిజానికి ఐదేళ్ల నిర్లక్ష్యం వల్ల పేరుకుపోయిన చెత్తను తొలగించడానికి, జంగిల్ క్లియరెన్స్ చేయడానికే ప్రభుత్వానికి సుమారు 6 నెలలు సమయం పట్టింది. ఆ తర్వాత గతేడాది జనవరి నుంచి అమరావతి పనులు వేగం పుంజుకున్నాయి. ఇప్పుడు శరవేగంగా రాత్రిబవళ్లు పనులు జరుగుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే నివాసాలకు సంబంధించిన తాళాలను జీఏడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు అందించారు. ఇక జీఏడీ అధికారులు వాటిని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేటాయించాల్సి ఉంది.
సీడ్ యాక్సెస్ రోడ్ ప్రారంభం, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే భవనాల పూర్తితో వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు పస లేదని తేలిపోయింది. దీంతో మరోసారి అమరావతిపై విషం చిమ్మితే ప్రజల నుంచి తిరస్కారాలు వస్తాయని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త నాటకానికి తెర లేపారు. 9 అంతస్తుల అపార్ట్‌మెంట్ నిర్మించడానికి ఆరేళ్లు పట్టిందంటూ కొత్త ఆరోపణలు చేస్తున్నారు. అదేదో పెద్ద ఘన కార్యమా అని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. మరో అడుగు ముందుకు వేసిన పేర్ని.. ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎవరుంటారో చూస్తా.. అంటున్నారు. వాటిల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయని.. ఎమ్మెల్యేలంతా హోటళ్లలో ఉంటారన్నారు.
Also Read : ఎన్టీఆర్ అభిమాని కొడుక్కి కీలక బాధ్యతలు..!
నిర్మాణాలు పూర్తి కాక ముందేమో.. అక్కడ ఎవరుంటారు.. అది శ్మశానం.. అని నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. అడవిలో ఎవరుంటారు.. అని చెప్పిన అదే నోటితో.. ఇప్పుడు నిర్మాణాలు పూర్తి అయిన తర్వాత కూడా అక్కడ ఎవరుంటారో నేను చూస్తా.. అంటూ సవాల్ చేస్తున్నారు పేర్ని నాని. నిజానికి ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వసతి కింది ప్రత్యేక నిధులు కేటాయించారు. అయితే క్వార్టర్స్ ఇచ్చిన తర్వాత అలా నిధుల మంజూరు రద్దు అవుతుంది. మాజీ మంత్రిగా పని చేసిన పేర్ని నానికి ఈ విషయం కూడా తెలియదా అని ఇప్పుడు టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. కాబట్టి ప్రజాప్రతినిధులంతా తప్పనిసరిగా క్వార్టర్స్‌లోనే ఉంటారని చెబుతున్నారు. ఇలా తప్పుడు ప్రచారం చేయడం వల్లే వైసీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని అంటున్నారు.

