తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ భక్తి ఛానల్ శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ నూతన ఛైర్మన్‌గా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు, టీడీపీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ శ్రీధర్ వర్మ నియమితులయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పార్టీ కోసం సుదీర్ఘకాలంగా కష్టపడి పనిచేస్తున్న యువ నాయకత్వానికి గుర్తింపునిస్తూ ఈ కీలక బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం నుండి అధికారిక ఉత్తర్వులు వెలువడటంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : గ్లోబల్ స్టేజీపై అమరావతి వైభవం..!
శ్రీధర్ వర్మ తండ్రి అయిన ఎన్టీఆర్ రాజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుండి పార్టీలోనే ఉంటూ సీనియర్ నాయకుడిగా కొనసాగారు. ఎన్టీఆర్ కుటుంబంతో సుదీర్ఘకాలంగా ప్రత్యేక అనుబంధం కలిగిన ఎన్టీఆర్ రాజు.. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా కూడా విశేష సేవలు అందించారు. తండ్రి వారసత్వాన్ని పుచ్చుకుని పార్టీకి మరియు సమాజానికి సేవ చేస్తున్న శ్రీధర్ వర్మ.. గత కొన్నేళ్లుగా పార్టీ విధేయుడిగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించడంలో మీడియా కో-ఆర్డినేటర్‌గా కీలక పాత్ర పోషించారు.
Also Read : ఎన్డీయే కన్వీనర్ గా సీఎం చంద్రబాబు..?
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడి, క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పనిచేసినందుకు గానూ శ్రీధర్ వర్మకు దక్కిన అత్యున్నత పురస్కారంగా ఈ ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక సమాచారాన్ని, భక్తి కార్యక్రమాలను మరింత నాణ్యతతో అందించడమే తన ప్రథమ ప్రాధాన్యత అని శ్రీధర్ వర్మ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ఈ నెల 22వ తేదీన ఆయన ఎస్వీబీసీ ఛైర్మన్‌గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

