ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఇ-3 సీడ్ యాక్సెస్ ప్రధాన రహదారి నిర్మాణంలో ఉన్న ‘S’ ఆకారపు మలుపుపై కొందరు పనిగట్టుకుని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజధానిని ఇతర కీలక ప్రాంతాలతో అనుసంధానించే ఈ అత్యంత ప్రాధాన్యత కలిగిన రహదారిపై వస్తున్న తప్పుడు వార్తలను పురపాలక శాఖ తీవ్రంగా ఖండించింది. భవిష్యత్తు ప్రణాళికలు, అత్యాధునిక రవాణా అవసరాలకు అనుగుణంగానే ఈ రహదారి డిజైన్ రూపుదిద్దుకుందని, ఎలాంటి అపోహలకు గురికావద్దని ప్రజలకు స్పష్టం చేసింది.
Also Read : అమరావతికి రాచబాట.. సీడ్ యాక్సెస్ రోడ్ రెడీ..!
ఈ సీడ్ యాక్సెస్ రహదారిని కేవలం ప్రస్తుత అవసరాల కోసమే కాకుండా, రాబోయే రోజుల్లో పెరగబోయే ట్రాఫిక్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యూహాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ రహదారి మూడో దశ లో భాగంగా రానున్న విజయవాడ – చెన్నై జాతీయ రహదారి కనెక్టివిటీకి అనుగుణంగానే ఈ ‘S’ ఆకారపు మలుపును ఇంజనీరింగ్ ప్రమాణాలతో రూపొందించారు. నేషనల్ హైవే నెట్‌వర్క్‌తో ఎలాంటి ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా సులువుగా విలీనం అయ్యేందుకే ఈ విధమైన అమరిక అవసరమైందని, దీని వెనుక ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Also Read : కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలకు ఇండిగో గుడ్ న్యూస్..!
రాజధాని అమరావతికి మంగళగిరి, విజయవాడ నగరాలతో రవాణా బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ సీడ్ యాక్సెస్ రహదారితో పాటు బకింగ్‌హామ్ కెనాల్, కొండవీటివాగులపై భారీ స్టీల్ బ్రిడ్జిలు సైతం అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టులతో సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ ప్రాంతాలకు వెళ్లేవారి ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. కరకట్ట రోడ్డుపై నిరంతరం ఎదురయ్యే ట్రాఫిక్ ఇబ్బందులకు ఈ రహదారులు శాశ్వత పరిష్కారం చూపనున్నాయని, కాబట్టి అభివృద్ధిని అడ్డుకునేలా సాగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని పురపాలక శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

