కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పరిధిలోని ప్రయాణికులకు, వ్యాపారవేత్తలకు అలాగే ఆధ్యాత్మిక పర్యాటకులకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన తీపి కబురు అందించింది. విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దేశంలోని ప్రముఖ నగరాలైన వారణాసి, కోల్‌కతా నగరాలకు సరికొత్త విమాన సర్వీసులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఎంతో కాలంగా ఈ రూట్లలో ప్రయాణ సదుపాయాల కోసం ఎదురుచూస్తున్న అమరావతి రాజధాని ప్రాంత వాసులకు ఈ నిర్ణయం ఎనలేని ప్రయోజనాన్ని చేకూర్చనుంది.
Also Read : కర్నూలులో పొలిటికల్ హీట్.. జగన్ గో బ్యాక్..!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఆధ్వర్యంలో ఈ నూతన సర్వీసులు నడవనున్నాయి. వారానికి మూడు రోజుల పాటు.. ప్రతీ మంగళవారం, గురువారం, శనివారం.. ఈ విమానాలు గన్నవరం నుంచి వారణాసి మీదుగా కోల్‌కతాకు ప్రయాణికులను చేరవేస్తాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ రెండు నూతన సర్వీసులను వర్చువల్ విధానంలో ఘనంగా ప్రారంభించారు. గన్నవరం విమానాశ్రయాన్ని దక్షిణాదిలోనే ఒక ప్రముఖ రవాణా హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగానే ఈ కనెక్టివిటీని పెంచినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Also Read : దమ్ముంటే సభకు రా.. జగన్‌కు ఆలపాటి ఛాలెంజ్..!
ఈ సరికొత్త డైరెక్ట్ విమాన సర్వీసుల వల్ల కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కాశీ విశ్వనాథుని దర్శనానికి వెళ్లే వృద్ధులు, పీఠాధిపతులు, ఆధ్యాత్మిక పర్యాటకుల ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. అంతేకాకుండా, తూర్పు భారతదేశంలోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రమైన కోల్‌కతాతో నేరుగా విమాన బంధం ఏర్పడటం వల్ల విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల వ్యాపార, పారిశ్రామిక రంగాలు మరింత వేగంగా వృద్ధి చెందడానికి సరికొత్త అవకాశాలు లభిస్తాయి.

