సౌత్ ఇండియా స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ క్రేజీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్నారంటూ వస్తున్న వార్తలకు ఇప్పుడు బ్రేక్ పడింది. వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమ బంధం ముగిసిందని, ఈ జంట అధికారికంగా విడిపోయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతారని భావించిన ఈ జోడీ.. హఠాత్తుగా విడిపోవడానికి గల అసలు కారణాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.
Also Read : సూర్యవంశి కోసమే ఎందుకీ నిర్ణయం..?
గతేడాది మృణాల్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 సినిమా ప్రీమియర్ షోలో వీరిద్దరూ కలిసి తొలిసారిగా మీడియా కంటికి చిక్కారు. ఆ తర్వాత ధనుష్ నటిస్తున్న తేరే ఇష్క్ మే మూవీ ర్యాప్ అప్ పార్టీలో కూడా మృణాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో వీరి మధ్య ఏదో నడుస్తోందనే ప్రచారం ఊపందుకుంది. ఆపై ధనుష్ చెల్లెళ్ళు డాక్టర్ కార్తీక, విమల గీతలను మృణాల్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడం, ఫ్యామిలీ ఈవెంట్స్ లో కనిపించడంతో వీరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు గట్టిగా నమ్మాయి.
కొన్ని నెలల క్రితం వీరిద్దరి ప్రేమాయణం పెళ్లి వరకు వెళ్లిందనే వార్తలు నెట్టింట తెగ హల్ చల్ చేశాయి. మృణాల్, ధనుష్ సాంప్రదాయక దక్షిణాది పెళ్లి దుస్తుల్లో ఉన్న కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. వచ్చే నెలలోనే ఈ జంట మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ కథనాలు కూడా వచ్చాయి. అయితే అప్పట్లో ఆ వార్తలను మృణాల్ సన్నిహితులు ఖండించారు. కేవలం మంచి స్నేహితులం మాత్రమేనని, ధనుష్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని మృణాల్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది.
Also Read : ప్రపంచంలోనే తొలి క్రికెటర్ గా స్మ్రితి మందన్న..!
కాగా, ధనుష్ గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 18 ఏళ్ల పాటు ఎంతో సంతోషంగా సాగిన వీరి వైవాహిక బంధం 2022 లో విడాకులతో ముగిసింది. వీరికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఐశ్వర్యతో విడిపోయిన తర్వాత ధనుష్ ఒంటరిగానే ఉంటున్నారు. ప్రస్తుతం మృణాల్ తో బ్రేకప్ వార్తలు ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్ గా మారినప్పటికీ.. ఈ తాజా పరిణామాలపై అటు ధనుష్ గానీ, ఇటు మృణాల్ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

