Gen Z యువతలో నాలుగు రోజుల నుంచీ రాజకీయంపై సరికొత్త ఆసక్తి వ్యక్తమవుతోంది. ట్రెండింగ్ రీల్స్ నుండి డైలీ అప్‌డేట్స్ వరకు.. రాజకీయం ఒక్కసారిగా యువత చర్చల్లోకి వచ్చేసింది. దీనికంతటికీ కారణం ఒక్కడే.. అతనే అభిజీత్ దీప్కే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగ యువతను ‘బొద్దింకలు’ కాక్‌రోచెస్ అంటూ వ్యాఖ్యానించిన తర్వాత, ఆ వ్యాఖ్యలకు నిరసనగా ఆన్‌లైన్‌లో పుట్టుకొచ్చిన ఒక వ్యంగ్య రాజకీయ పార్టీ ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’.. సీజేపీ. ఈ పార్టీకి అభిజీత్ దీప్కేనే ప్రధాన సారథి.
ఈ సీజేపీ ప్రారంభించిన రెండు రోజుల్లోనే 40వేల మందికి పైగా సభ్యులు ఇందులో చేరారు. అంతేకాదు, సోషల్ మీడియా వేదికగా జరిగిన చర్చల ద్వారా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్‌లను కూడా ఈ పార్టీ ఇప్పటికే తమ సభ్యులుగా చేర్చుకోవడం విశేషం.
Also Read : చంద్రబాబుతో ఏపీ బిజేపి చీఫ్.. ఆ ఒక్కటి నాకే ప్లీజ్..?
అసలు ఇంతకీ ఎవరీ అభిజీత్ దీప్కే..?.. ఏమిటీ కాక్‌రోచ్ జనతా పార్టీ గోల..? బీజేపీని టార్గెట్ చేస్తూ సీజేపీ అని ప్రతిపక్షాలు మొదలెట్టాయా..? నిజంగానే బొద్దింకను చూసి కాషాయ పార్టీ పెద్దలు భయపడుతున్నారా..?.. ఇవే ఇప్పుడు అంతా వినిపిస్తున్న ప్రశ్నలు. అభిజీత్ దీప్కే.. ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు. ఆయన ఒక పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్. నేరేటివ్ బిల్డింగ్, పబ్లిక్ మెసేజింగ్, డిజిటల్ ప్లాట్‌ఫాంలు రాజకీయ అభిప్రాయాలను ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాలపై ఆయన ప్రధానంగా పనిచేస్తుంటారు. ఆయన పూణేలో జర్నలిజంలో అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి, ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. ప్రస్తుతం ఆయన బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నారు.
2020 నుండి 2023 వరకు ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీమ్‌లో వాలంటీర్‌గా పనిచేశారు. ఫిబ్రవరి 2020లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ విజయం సాధించగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మీమ్స్ ఆధారిత డిజిటల్ క్యాంపెయినింగ్‌లో అభిజీత్ కీలక పాత్ర పోషించారు. ఇది పార్టీ రాజకీయ, ఆన్‌లైన్, యువత భాగస్వామ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. ఆ తర్వాత, 2026లో ఆయన ఈ ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ని ప్రారంభించారు.
Also Read : మంత్రి గారి ప్రేమ మామూలుగా లేదుగా..!
ఏమిటీ ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’?.. అనేది చాలా మందిలో వినిపిస్తున్న ప్రశ్న. నిజానికి ఇది ఎవరో ఆకతాయితనంతో ప్రారంభించిన ప్రచారం కాదు. దీని వెనుక పెద్ద ఎత్తున యువత చేరడానికి ప్రధాన కారణం.. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు. భారత ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విచారణ సందర్భంగా.. వివిధ వృత్తుల్లో, సమాజంలో స్థానం కోసం కష్టపడుతున్న నిరుద్యోగ యువతను “బొద్దింకలు” అని సంబోధించినట్లు వార్తలు వచ్చాయి. ఇది యువతను కించపరిచినట్లుగా భావించి.. ఈ పార్టీకి ఆ పేరు పెట్టారు. ఆ వ్యాఖ్యలను చూసి నీరుగారిపోకుండా, దీప్కే దానిని ఒక వ్యంగ్య పొలిటికల్ గ్రూప్‌గా మార్చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న యువత దీనికి భారీగా మద్దతు ఇస్తోంది.
ఈ పార్టీ వెబ్‌సైట్ ప్రకారం.. ఇది ‘సోమరులు, నిరుద్యోగుల గళం’. ఈ పార్టీ మేనిఫెస్టోలో ఐదు ప్రధాన వాగ్దానాలను పొందుపరిచారు.
1. సీజేపీ అధికారంలోకి వస్తే, రిటైర్మెంట్ తర్వాత ఏ చీఫ్ జస్టిస్‌కు కూడా బహుమతిగా రాజ్యసభ సీటు ఇవ్వబడదు.
2. సీజేపీ పాలిత రాష్ట్రంలోనైనా లేదా ప్రతిపక్షాల పాలనలోనైనా.. ఏదైనా అసలైన ఓటు గనుక తొలగించబడితే, సదరు ఎన్నికల అధికారిని ఉపా చట్టం కింద అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే పౌరుల ఓటు హక్కును లాక్కోవడం ఉగ్రవాదం కంటే తక్కువ ఏమీ కాదు.
3. మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తారు.
4. ప్రభావవంతమైన వ్యాపారవేత్తల యాజమాన్యంలోని అన్ని మీడియా సంస్థల లైసెన్సులను రద్దు చేస్తారు.
5. ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి ఫిరాయించే ఏ ఎమ్మెల్యే లేదా ఎంపీ అయినా సరే.. 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా లేదా ప్రభుత్వ పదవులను చేపట్టకుండా నిషేధిస్తారు.
సీజేపీలో చేరడానికి అర్హతలేంటి?
1. నిరుద్యోగి: బలవంతంగానైనా, స్వచ్ఛందంగానైనా లేదా సిద్ధాంతపరంగానైనా నిరుద్యోగి అయి ఉండాలి.
2. సోమరిపోతు: శారీరకంగా సోమరితనంగా ఉన్నా, మెదడు మాత్రం ఆలోచనలతో పరిగెడుతూ ఉండాలి.
3. క్రానికల్లీ ఆన్‌లైన్: బాత్రూమ్ బ్రేక్స్‌తో కలుపుకుని రోజుకు కనీసం 11 గంటలు ఆన్‌లైన్‌లో గడపాలి.
4. ప్రొఫెషనల్‌గా విమర్శించగలగడం: చేసే విమర్శ పదునైనదిగా, నిజాయితీగా, సమాజానికి నిజంగా ఉపయోగపడే అంశంపై ఉండాలి.
Also Read : సీమపై గురిపెట్టిన లోకేష్..!
వినబడని ప్రజల గొంతుకగా మారతాం.. నిర్భయంగా ప్రజా సమస్యలను లేవనెత్తుతూనే ఉంటాం. మన చర్యలు మాటల కంటే బిగ్గరగా మాట్లాడతాయి.. అంటూ సీజేపీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లో చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు దుమ్ము రేపుతున్నాయి. మేము అద్భుతాలను వాగ్దానం చేయడం లేదు.. మేము నిజాయితీకి హామీ ఇస్తున్నాము.. అంటూ రాజకీయ పార్టీలు ఇస్తున్న ఫేక్ హామీలకు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. సీజేపీ ఇక్కడ అధికారం కోసం కాదు.. మార్పు కోసం సీజేపి వచ్చింది.. అంటూ సోషల్ మీడియా పెట్టిన పోస్టులు యువతను మరింత ఆకట్టుకుంటోంది. నిజానికి ఈ పార్టీ ఇంకా అధికారికంగా నమోదు కానప్పటికీ, దేశ రాజకీయాలపై విరక్తి చెందిన భారతీయ యువతను చివరకు రాజకీయాల వైపు నడిపించే సాధనంగా ఇది మారుతుందని చాలా మంది నమ్ముతున్నారు.
సీజేపీకి ఎందుకు ఇంత మద్దతు పెరుగుతోంది.. అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇదే అంశంపై ప్రజల్లో, పొలిటికల్ సర్కిల్‌లో కూడా జోరుగా చర్చ నడుస్తోంది. నిజానికి సోషల్ మీడియాలో పుట్టిన ఓ వ్యంగ్య పార్టీకి దేశ వ్యాప్తంగా ఇంత క్రేజ్ రావడం.. ఆషామాషీ వ్యవహారం కాదు. కేవలం క్లీన్ పాలిటిక్స్ కోసం మాత్రమే యువత కాక్‌రోచ్ వైపు చూస్తున్నారా.. అంటే కాదనే చెప్పాలి. ప్రస్తుత పరిస్థితుల్లో క్లీన్ పాలిటిక్స్ అనే మాట చాలా దూరంలో ఉంది. అయితే ఇక్కడ మరో అంశం ఏమిటంటే.. క్లీన్ జస్టిస్ కూడా దూరమవుతుందనే భావన దేశ యువతలో క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుత న్యాయ వ్యవస్థ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక తీర్పు వెనుక రాజకీయ నేతలు, పార్టీల ప్రభావం స్పష్టంగా ఉందనేది బహిరంగ ఆరోపణ.
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ 12 ఏళ్ల పాలనలో.. సుప్రీం కోర్టు ఎన్నో కీలక తీర్పులు ఇచ్చింది. ఇదేం పెద్ద విషయం కాదు. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రాజకీయాలతో ముడిపడిన క్లిష్టమైన అంశాలకు కూడా పరిష్కారం లభించింది. ఇందుకు అయోధ్య రామమందిరం నిర్మాణ తీర్పు ప్రధాన ఉదాహరణ. ఇలాంటి పెండింగ్ కేసులు పరిష్కారం అయితే అందరికీ సంతోషమే.. కానీ ఆ తీర్పు వెనుక రాజకీయ ప్రమేయం, ప్రభావం ఉండటమే ప్రమాదం అంటున్నారు. అందుకే న్యాయ వ్యవస్థ ఇస్తున్న కొన్ని తీర్పుల పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ వ్యతిరేకతకు మరో ప్రధాన కారణం కూడా ఉంది. అదే.. కీలక కేసుల్లో తీర్పులు ఇచ్చిన చీఫ్ జస్టిస్‌లకు పదవులు బహుమతులుగా రావటం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ .. మాజీ చీప్ జస్టిస్. త్రిపుల్ తలాక్, అయోధ్య వివాదంతో పాాటు భారతీయ కరెన్సీ నోట్ల రద్దుకు సంబంధించిన కేసులను విచారించిన రాజ్యాంగ ధర్మాసనానికి కూడా నజీర్ నాయకత్వం వహించారు.
అబ్దుల్ నజీర్ సీజేఐగా 4 జనవరి 2023న పదవీ విరమణ చేసిన సరిగ్గా నెల రోజులకే 12 ఫిబ్రవరి 2023న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా మోదీ సర్కార్ నియమించింది. దీనిపై అప్పట్లోనే తీవ్ర్ విమర్శలు వెల్లువెత్తాయి కూడా. మోదీ సర్కార్‌కు అనుకూలంగా తీర్పులు వచ్చినందుకే నజీర్‌కు పదవి వచ్చిందనే వ్యాఖ్యలు బాగా వినిపించాయి. ఇక ప్రస్తుతం సీజేపీ.. కాక్‌రోచ్ జనతా పార్టీకి ఈ స్థాయిలో క్రేజ్ రావడానికి మరో ప్రధాన కారణం.. యువతలో అసహనం. నిరుద్యోగం పెరిగిపోవడం.. అవినీతి, అక్రమాలు పెరగటంతో పాటు.. రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న వారిలో చాలా మంది 50 పదుల వయసు దాటిన వారే. ఇక్కడ మరో విచిత్రమేమిటంటే.. మామూలుగా 18-40 ఏళ్ల మధ్య వారిని యువత అని.. 40 ఏళ్లు దాటిన వారిని నడి వయస్కులని, 60 ఏళ్లు దాటిన వారిని వృద్ధులని వ్యాఖ్యానిస్తారు. కానీ రాజకీయాల్లో మాత్రం.. 50 ఏళ్ల వారు కూడా యువత కిందే చలామణి అవుతున్నారు.
సీజేపీ వెనుక రాజకీయ శక్తులు లేదనేది బహిరంగ రహస్యం. ఈ పార్టీ పెట్టిన వెంటనే ప్రజల్లో, యువతలో ఈస్థాయిలో స్పందన రావడానికి ప్రధాన కారణం.. దేశ ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం, అభివృద్ధి, రాజకీయాలు. ఈ అంశాలపై దేశ యువత ఇప్పటికే చాలా అసహనం వ్యక్తం చేస్తోంది. చాలా ఏళ్లుగా దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటూనే ఉంది.. అభివృద్ధి చెందిన దేశాలతో భారత్ పోటీ పడుతోంది.. అనే మాటలు విని వినీ యువత విసిగిపోయింది. అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉన్నాం.. తప్ప.. అభివృద్ధి చెందిన దేశం అని స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా కూడా గర్వంగా చెప్పుకోలేని పరిస్థితి. అత్యధిక జనభా ఉన్న దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ.. ఇప్పటికీ ఇతర దేశాల పైన ఆధారపడాల్సి వస్తోంది. ఉపాధి కోసం గల్ఫ్, అమెరికా, లండన్, ఆస్ట్రేలియ వంటి ఇతర దేశాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. ఇదే యువతలో అసహనానికి ప్రధాన కారణం. ఏది ఏమైనా… నిరుద్యోగుల్లో ఈ స్థాయిలో స్పందన రావడం.. రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సీజేపీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌ను విత్ హెల్డ్‌లో పెట్టారు. అంటే.. ఈ బొద్దింకను చూసి రాజకీయ నేతలు భయపడుతున్నారా.. అనే ప్రశ్న వినిపిస్తోంది. కాక్‌రోజ్ జనతా పార్టీ అనే పేరుతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలాంటి దరఖాస్తులు రాలేదు. ఇది ఇప్పటి వరకు రిజిస్టర్ కాలేదు. కానీ.. ఈ బొద్దింక భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో పెను మార్పులకు కారణం అవుతుందనేది మాత్రం ఖాయం.

