అఫ్గానిస్తాన్ తో జూన్ 6 నుండి ప్రారంభం కానున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ కు ముందు రిషభ్ పంత్ తన వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడం.. భారత క్రికెట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ప్రకటించిన తాజా జట్టులో, శుభ్మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా.. పంత్ స్థానంలో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ను టెస్ట్ వైస్ కెప్టెన్ గా నియమించారు. కేవలం టెస్ట్ వైస్ కెప్టెన్సీ మాత్రమే కాకుండా, అఫ్గాన్ తో జరగబోయే వన్డే సిరీస్ నుండి కూడా పంత్ ను పూర్తిగా పక్కన పెట్టడం గమనార్హం.
Also Read : కులగణ జరగాల్సిందే.. సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..!
ఈ లీడర్ షిప్ మార్పు వెనుక ప్రధానంగా పంత్ బ్యాటింగ్ పై ఉన్న ఒత్తిడిని తగ్గించాలనే ఆలోచన ఉన్నట్లు సెలెక్టర్లు స్పష్టం చేశారు. పంత్ ఎలాంటి అదనపు బాధ్యతలు లేకుండా కేవలం తన సహజసిద్ధమైన ఆట తీరుపైనే దృష్టి పెట్టాలని బోర్డు భావించింది. దీనికి తోడు, ఐపీఎల్ 2026 సీజన్ లో లక్నో సూపర్ జాయింట్స్ కెప్టెన్ గా పంత్ ఘోరంగా విఫలమయ్యాడు. అతని సారథ్యంలో లక్నో పాయింట్ల పట్టికలో అడుగున నిలవడమే కాకుండా, పంత్ 12 ఇన్నింగ్స్ ల్లో కేవలం 251 రన్స్ మాత్రమే చేసి ఫామ్ కోల్పోవడం సెలెక్టర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేసిందని సమాచారం.
Also Read : లింక్ డాక్యుమెంట్ల దోపిడీకి సర్కార్ బ్రేక్..!
మరోవైపు, గతంలో టీమిండియాకు టెస్టుల్లో కెప్టెన్ గా వ్యవహరించిన అనుభవం కేఎల్ రాహుల్‌కు ఉండటం అతనికి కలిసి వచ్చింది. యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కు మైదానంలో సరైన సలహాలు ఇవ్వడానికి మరింత అనుభవజ్ఞుడైన డిప్యూటీ కావాలని సెలెక్టర్లు రాహుల్ వైపు మొగ్గు చూపారని సమాచారం. గత ఏడాది సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత్ పరాజయం పాలైనప్పుడు, గిల్ స్థానంలో పంత్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడం పట్ల విమర్శలు వచ్చాయి. అయితే, వైస్ కెప్టెన్సీ కోల్పోయినప్పటికీ టెస్ట్ ఫార్మాట్ లో వికెట్ కీపర్ బ్యాటర్ గా పంత్ స్థానానికి ఎలాంటి ఢోకా లేదని, అతను ఇప్పటికీ జట్టుకు ప్రధాన మ్యాచ్ విన్నర్ అని సెలెక్షన్ కమిటీ స్పష్టం చేసింది.

