మన దేశంలో ఎండలు ఏ స్థాయిలో ఉన్నాయో అందరికి తెలిసిందే. గత వారం రోజుల నుంచి ఈ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో.. తీవ్రమైన ఎండలు, హీట్ వేవ్స్ కారణంగా శరీరంలో జీర్ణక్రియ మందగిస్తుందని, దీనివల్ల ఎసిడిటీ, కడుపుబ్బరం, ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలు గణనీయంగా పెరుగుతాయని ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ గౌరదాస్ చౌదరి తెలిపారు. వేసవి కాలంలో శరీరాన్ని చల్లబరచడానికి రక్తం చర్మం వైపు ఎక్కువగా ప్రవహించడం వల్ల జీర్ణవ్యవస్థకు రక్తప్రసరణ తగ్గి ఎంజైమ్ ల ఉత్పత్తి మందగిస్తుందని వైద్య నిపుణులు వివరిస్తున్నారు.
Also Read : అధికారం కోసం కొత్త దారులు.. జగన్, కేసీఆర్ నయా స్కెచ్..!
దీనికి తోడు అధిక ఉష్ణోగ్రతలలో బ్యాక్టీరియా, క్రిములు ఆహారం, నీటిలో చాలా వేగంగా విస్తరించడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ ముప్పు పెరుగుతుందట. ముఖ్యంగా పాలు, రోడ్ల పక్కన అమ్మే కట్ చేసిన పండ్లు, ఫ్రిజ్ లో పెట్టి మళ్లీ వేడి చేసిన మాంసాహారాలు వేసవిలో త్వరగా కలుషితమై కడుపునొప్పి, వాంతులు, విరేచనాలకు దారితీస్తాయి. ఎండల వల్ల శరీరంలో విపరీతంగా చెమటలు పట్టి ఫ్లూయిడ్స్ కోల్పోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుందని, ఇది జీర్ణక్రియను మరింత బలహీనపరుస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
డీహైడ్రేషన్ తీవ్రమైతే కిడ్నీలు దెబ్బతినడం, బీపీ పడిపోవడం లేదా విపరీతమైన కడుపు తిమ్మిర్లు రావడం వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కాబట్టి వేసవి కాలంలో జీర్ణవ్యవస్థను సురక్షితంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ రోజంతా తగినంత నీరు లేదా ఎలక్ట్రోలైట్స్ తీసుకోవడం ఎంతో ముఖ్యం. బయటకు వెళ్లే ముందు కనీసం రెండు గ్లాసుల నీరు తాగాలని, ఇంట్లో ఎల్లప్పుడూ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
Also Read : పెద్దిలో ఉప్పెనను మించిన షాకింగ్ ట్విస్ట్..?
వేసవిలో కడుపు చల్లగా ఉండటానికి నూనె, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తగ్గించి, సులభంగా అరిగే తేలికపాటి భోజనం, పెరుగు లేదా మజ్జిగను డైట్ లో చేర్చుకోవాలి. పుచ్చకాయలు, కర్బూజ, కీరదోసకాయలు వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవచ్చని, అయితే అవి ఎప్పటికప్పుడు తాజాగా కట్ చేసినవి మాత్రమే అయి ఉండాలని స్పష్టం చేశారు. నిల్వ ఉంచిన ఆహారాలు, రోడ్డు పక్కన తెరిచి ఉంచిన తినుబండారాలకు దూరంగా ఉంటూ, చేతుల పరిశుభ్రతను పాటించడం ద్వారా ఈ వేసవిలో కడుపు సంబంధిత ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

