“ఒక కేసు అనేక ప్రశ్నలు, అనేక విమర్శలు, వ్యవస్థలపై ప్రజలకు సన్నగిల్లుతున్న నమ్మకం, సామాన్యులకు పలుకుబడి గల వ్యక్తులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వ్యవస్థలు ఇస్తున్న విలువలు, చేస్తున్న న్యాయం, మనల్ని పాలించడానికి ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల తీరు, పార్టీలు వేరైనా సమస్య వచ్చినప్పుడు అంతా ఒక్కటే అని సంకేతాలు ఇచ్చిన రాజకీయ నాయకుల తీరు ప్రస్తుతం తీవ్ర చర్చకు కారణమవుతుంది.
ఇంకో విషయమేమిటంటే కుమారుడు లొంగిపోయాడని స్వయంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ప్రకటించగా అదేమీ లేదని, తాము అరెస్టు చేశామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ ప్రకటన పరస్పర విరుద్ధంగా ఉండటం. ఇదే అసలు చర్చకు దారి తీసిని అంశం. తెలంగాణ పోలీసింగ్ వ్యవస్థ దేశంలోనే టాప్‌గా ఉన్నప్పటికీ ఫిర్యాదు అందిన తర్వాత మూడు రోజులకు కూడా అరెస్టు చేయకపోవడం కూడా చర్చకు వస్తుంది. ఫిర్యాదు అందిన వారం రోజుల తర్వాత నిందితుడు లొంగిపోయాడంటే.. పోలీసుల తీరుపైన ఎన్నో అనుమానాలు వస్తున్నాయి.
Also Read : టాలీవుడ్‌లో పర్సంటేజీ రచ్చ.. ఎండ్ కార్డ్ పడినట్లేనా..?
పోక్సో కేసు నమోదైన వెంటనే నిందితుడిని కటకటాల్లోకి నెట్టిన చరిత్ర ఉన్న తెలంగాణ పోలీసులకు బండి భగీరథ్ దొరకకపోవడం, లుకవుట్ నోటీసులు జారీచేయడం పట్ల అంతా ఆశ్చర్యపోతున్నారు. సామాన్యులకు పోక్సో కేసులో ఇన్ని మినహాయింపులు ఉంటాయా?.. ఉండవని గతంలో నమోదైన కేసులు చెబుతున్నాయి. గతంలో కొన్ని కేసుల్లో దాదాపు 20 ఏళ్ల జైలు శిక్ష పడేలా పోలీసులు వ్యవహరించి శభాష్ అనిపించుకున్నారు. అంతెందుకు గతంలో జరిగిన పోక్సో కేసుల్లో ఎప్పుడైనా సిట్ తరహాలో ప్రత్యేక అధికారిని విచారణకు నియమించారా? ఇప్పుడెందుకు ఈ నిర్ణయం?. ప్రస్తుతం ఉన్న హోం సెక్రటరీ మహిళా భద్రతా విభాగం అధిపతిగా ఉన్నప్పుడు చైల్డ్ పోర్న్ వీడియోలు చూస్తున్న వారిని నిమిషాల్లో గుర్తించి అరెస్టు చేశారు. మరీ బీబీ విషయంలో ఎందుకు చేయలేదు. అంతేకాకుండా వెకేషన్ పీరియడ్‌లో హైకోర్టు కూడా అర్ధరాత్రి వరకు వాదనలు వినింది. న్యాయస్థానం సామాన్యులకు ఇటువంటి వెసులుబాటు గతంలో కల్పించిందా? భవిష్యత్తులో కల్పిస్తుందా? అనే అనేక ప్రశ్నలు సామాన్య జనంలో చర్చకు దారితీశాయి. ఈ విషయంలో ప్రభుత్వం కూడా కొంత వెసులుబాటు కల్పించినట్లు కనబడుతుంది. అంతేకాకుండా హోం శాఖ సహాయమంత్రిగా ఉన్న బండి సంజయ్ వ్యవహారం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధానమంత్రి నరేంద్రమోడీకీ తెలిసినా.. అలసత్వం ప్రదర్శించడంతో అన్ని వ్యవస్థలపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సామాన్యులకో న్యాయం, పలుకుబడి ఉన్నవాళ్లకు మరో న్యాయం అనే నానుడి ప్రతీసారి నిజమే అవుతుంది. ఏదో కుగ్రామంలో లేదా మారుమూల ప్రాంతంలో గ్రామ పెద్దలు చేసే పంచాయతీలో ఇచ్చే తీర్పులో ఇటువంటివి సర్వ సాధారణంగా కనబడుతాయి. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిసి కూడా పలుకుబడి గల వ్యక్తులకు వ్యవస్థలు ఎలా సలామ్ కొడుతున్నాయో బండి భగీరథ విషయంలో తేలిపోయింది. సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నా.. అవి సామాన్యులకు మాత్రమే అన్నట్లుగా పోలీసులు వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శల పాలవుతుంది. తమ కూతురికి అన్యాయం జరిగిందని, తనపై భగీరథ లైంగిక దాడి పాల్పడ్డాడని తల్లీ కూతుళ్లు ఫిర్యాదు చేసినా స్వీకరించడంలో జాప్యం, ఎఫ్ఎఆర్ చేయడంలో జాప్యం, అరెస్టు చేయడంలో ఆలస్యం. ఇలా అనేక రకాలుగా నిందితుడికి పోలీసు వ్యవస్థ అండగా నిలిచింది. వీరి మీద ఎవరి ఒత్తిడి ఉన్నదో పక్కన పెడితే చివరకు పోలీసు డిపార్ట్‌మెంట్ మాత్రం నిందలు మోయాల్సి వస్తున్నది.
Also Read : సైనికులకు రొయ్యలు పెట్టండి.. కేంద్రానికి చంద్రబాబు సంచలన లేఖ..!
ఫిర్యాదు నుండి అరెస్టు వరకు పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వాస్తవానికి తెలంగాణ పోలీసులు ఛేదించని కేసు లేదు. అంతటి గొప్ప ఘనత ఉన్న పోలీసులకు ఈ ఘటన తీవ్ర చెడ్డ పేరు వచ్చేలా చేసింది. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్న బండి సంజయ్ పరువుతో పాటు రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి పరువు కూడా పోయినట్లు అయ్యింది. కావాలనే కాలయాపన చేస్తూ అరెస్టు చేయలేదని విమర్శలు గుప్పుమన్నాయి. చేతుల కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు విమర్శలు ఎక్కువైన తర్వాత అరెస్టు చేసినా ఫలితం లేకపోయింది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రభుత్వం డ్యామేజీ కంట్రోల్ చేయడానికి ఈ కేసులో విచారణకు ప్రత్యేకాధికారిగా మహిళా ఐపీఎస్‌ను నియమించినప్పటికీ విమర్శలు ఆగటం లేదు. గతంలో ఎన్నో పోక్సో కేసులు నమోదు అయినప్పుడు నిందితులుగా పేర్కొన్న వారిని ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే ఎందుకు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. బండి భగీరథను ఎందుకు అరెస్టు చేయలేదనే ప్రశ్న ఇప్పుడు చర్చకు దారితీసింది. పోక్సో కేసుల చరిత్రలో ఎప్పుడైనా ప్రత్యేకాధికారిని నియమించారా? ఇప్పుడెందుకనే విమర్శలు ఉన్నాయి.
ఉమెన్ సేఫ్టీ వింగ్ ఉన్నతాధికారిగా సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖాగోయల్ ఉన్న సమయంలో ఫోర్న్ వీడియోలు సెల్ ఫోన్‌లో వీక్షిస్తున్నారనే సమాచారంతో దాదాపు 30 మంది పైగా యువకులను అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. ఇందులో కొంతమంది వీడియోలు షేర్ చేసిన వారు కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించడంలో శిఖాగోయల్ పక్కాగా విధులు నిర్వహించారు. అరెస్టు చేసిన వారిలో కొందరూ పోర్న్ వీడియోలను వీక్షించారు. వీడియోలు కలిగి ఉన్నారని సెల్ ఫోన్లు సీజ్ చేసి అరెస్టు చేశారు. ప్రస్తుతం శిఖాగోయల్ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు. ఈ సమయంలోనే పేట్ బషీర్ బాగ్ లో తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేస్తే అరెస్టు చేయకపోగా బాధితులను ఇబ్బంది పెట్టిన ఘటన తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఫిర్యాదు అందిన వెంటనే అరెస్టు జరిగితే ఇంత రచ్చ రచ్చ జరిగేది కాదని అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

